రాజ్యాంగమిచ్చిన అధికారం మేరకే ఆర్డినెన్స్‌ | government Reported To High Court Ordinance Was Brought Under Article 213 Of Constitution | Sakshi
Sakshi News home page

రాజ్యాంగమిచ్చిన అధికారం మేరకే ఆర్డినెన్స్‌

Published Sun, Apr 19 2020 8:49 AM | Last Updated on Sun, Apr 19 2020 9:10 AM

government Reported To High Court Ordinance Was Brought Under Article 213 Of Constitution - Sakshi

సాక్షి, అమరావతి: రాజ్యాంగంలోని అధికరణ 213 ప్రకారం సంక్రమించిన న్యాయమైన అధికారాన్ని అనుసరించే రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ పదవీ కాలాన్ని, సర్వీసు నిబంధనలను సవరిస్తూ ఆర్డినెన్స్‌ తీసుకొచ్చామని హైకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం నివేదించింది. ఈ ఆర్డినెన్స్‌కు అనుగుణంగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా జస్టిస్‌ వి.కనగరాజ్‌ బాధ్యతలు కూడా స్వీకరించారని వివరించింది. అధికరణ 243(కె), ఏపీ పంచాయతీరాజ్‌ చట్టం 1994లోని నిబంధనలను అనుసరించే ఆర్డినెన్స్‌ను తీసుకొచ్చామని తెలిపింది. నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ను తప్పించేందుకే ఈ ఆర్డినెన్స్‌ను తీసుకొచ్చామన్న వాదనలో ఏ మాత్రం వాస్తవంలేదని స్పష్టంచేసింది. అధికరణ 243(కె)(2) ప్రకారం సర్వీసు నిబంధనల్లో పదవీ కాలం భాగం కాదని పేర్కొంది.

రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ మేళనం ఎలా ఉండాలన్నది అధికరణ 243(కె) ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ఇష్టమని వివరించింది. స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియలో సంస్కరణల కొనసాగింపు ఫలితమే ప్రస్తుత ఆర్డినెన్స్‌ అని.. ఈ ఆర్డినెన్స్‌ నేపథ్యంలో పిటిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ పదవీ కాలం ముగిసిందని కోర్టు కు నివేదించింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తిని నియమించాలన్నది ప్రభుత్వ విధానప రమైన నిర్ణయమని, ఈ విషయంలో ప్రభుత్వానికి ఉద్దేశాలు అంటగట్టడం  సరికాదంది.

తమ ఈ కౌం టర్‌ను పరిగణనలోకి తీసుకుని నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ దాఖలు చేసిన అనుబంధ వ్యాజ్యాలను కొట్టేయాలని రాష్ట్ర ప్రభు త్వం హైకోర్టును అభ్యర్థించింది. ఎస్‌ఈసీ పదవీ కాలం, సర్వీసు నిబంధనలను సవరిస్తూ తీసుకొచ్చిన ఆర్డి నెన్స్, తదనుగుణ జీఓలను, కమిషనర్‌గా జస్టిస్‌ వి.కనగరాజ్‌ నియామకాన్ని సవాలు చేస్తూ నిమ్మగడ్డ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలి సిందే. ఈ వ్యాజ్యంలో హైకోర్టు ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున పంచాయతీ రాజ్‌ శాఖ ముఖ్య కార్యదర్శి ద్వివేది కౌంటర్‌ దాఖలు చేశారు.

సంస్కరణల్లో భాగమే  ఈ ఆర్డినెన్స్‌
‘ఎన్నికలు నిష్పాక్షికంగా, ప్రశాంత వాతావరణంలో సాగేందుకు అవసరమైన సంస్కరణలు తేవాలని నిర్ణయించి, ఈ విషయాన్ని మార్చిలోనే కేంద్ర ప్రభుత్వానికి తెలియజేశాం. ఈ సంస్కరణలపై పలు సమావేశాల్లో చర్చించాకే ఈ ఆర్డినెన్స్‌ను తీసుకువచ్చాం. అందువల్ల దీనిని హడావుడిగా జారీచేశామన్న పిటిషనర్‌ ఆరోపణల్లో వాస్తవంలేదు. ఎన్నికల కమిషనర్‌గా తనను కొనసాగించాలని ఒత్తిడి చేసే ప్రాథమిక హక్కూ పిటిషనర్‌కు లేదు. విధానపరమైన నిర్ణయాల్లో భాగంగా చట్ట సవరణలు చేసే అధికారం ప్రభుత్వానికి ఉంది’ అని ద్వివేది వివరించారు. 

ప్రభుత్వాన్ని సంప్రదించకుండా ఏకపక్ష నిర్ణయం
‘రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏమాత్రం సంప్రదించకుండా ఎన్నికలు వాయిదా పడ్డాయి. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్‌ను ప్రభుత్వానికి పంపడానికి కన్నా ముందు, ప్రింట్, ఎలక్ట్రానిక్‌ మీడియాకే తెలియజేశారు. ఎన్నికల వాయిదా విషయంలో కమిషనర్‌ది ఏకపక్ష నిర్ణయం. అలాగే వైద్య శాఖ నుంచి ఎటువంటి నివేదిక కోరలేదు.’ అని ఆయన విన్నవించారు. అంతేకాక.. ‘కేంద్ర హోంశాఖకు రాసిన లేఖ గురించి నిమ్మగడ్డ ఆ పిటిషన్‌లో ప్రస్తావించలేదు. ఇందులో ఆయన ఆరోపణలను తోసిపుచ్చుతూ రాష్ట్ర ప్రభుత్వ సీఎస్‌ కేంద్రానికి రెండు లేఖలు రాశారు. ఎన్నికలు కేంద్ర ఎన్నికల సంఘం లేదా బహుళ అధికారుల బృందం మార్గదర్శకంలో జరిగే అవకాశాలను చూడాలని కేంద్రాన్ని కోరే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తున్న విషయాన్ని కేంద్రానికి తెలియజేశాం’ అని ద్వివేది తన కౌంటర్‌లో పేర్కొన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement