హైదరాబాద్ : మహబూబ్నగర్ జిల్లా కొత్తకోట మండలం పాలెం వద్ద ఈరోజు ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఓ చిన్నారి సహా 45మంది మృతి చెందినట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. మరో అయిదుగురు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. మృతుల కుటుంబాలను అన్నివిధాలా ఆదుకుంటామని ఆయన చెప్పారు.
బుధవారం బొత్స ఖైరతాబాద్లోని రవాణా శాఖ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ప్రయాణికుల వివరాలు, ఫోన్ నంబర్లు అందాయని, హెల్ప్ లైన్ ద్వారా వారి బంధువులకు సమాచారం అందిస్తున్నామన్నారు. ప్రమాదానికి గురైన బస్సును జబ్బర్ ట్రావెల్స్ లీజుకు తీసుకుని నడుపుతున్నట్లు బొత్స తెలిపారు. మరోవైపు మృతదేహాల గుర్తింపు ప్రక్రియ కొనసాగుతోందన్నారు. భవిష్యత్లో ఇటువంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకుంటామన్నారు. శ్రీకాకుళం జిల్లా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి హైదరాబాద్ వచ్చిన అనంతరం చర్చించి బాధితులకు పరిహారాన్ని ప్రకటిస్తామన్నారు.
కాగా ఈ ప్రమాదంలో మహబూబ్ నగర్ జిల్లా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కోర్టు జడ్జి మోహనరావు కుమార్తె ప్రియాంక కూడా మృత్యువాత పడింది. ఆమె చేతికి ఉన్న గొలుసు ఆధారంగా కుటుంబ సభ్యులు ప్రియాంక మృతదేహాన్ని గుర్తించారు.