
ఇది గిమ్మిక్కుల ప్రభుత్వం
చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి ఈ ప్రభుత్వం గిమ్మిక్కులు చేస్తోందని వైఎస్‌ఆర్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి ధ్వజమెత్తారు...
- ప్రజల దృష్టి మరల్చేందుకు చంద్రబాబు పాట్లు
- మాస్టర్ ప్లాన్ కాదది డైవర్షన్ ప్లాన్
- ధ్వజమెత్తిన వైఎస్‌ఆర్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి, మేయర్, ఎమ్మెల్యేలు
కడప కార్పొరేషన్: చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి ఈ ప్రభుత్వం గిమ్మిక్కులు చేస్తోందని వైఎస్‌ఆర్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి ధ్వజమెత్తారు. స్థానిక వైఎస్ గెస్ట్‌హౌస్‌లో నగర మేయర్ కె. సురేష్‌బాబు, కడప ఎమ్మెల్యే అంజద్‌బాషాతో కలిసి గురువారం ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అమర్‌నాథ్‌రెడ్డి మాట్లాడుతూ ఓటుకు కోట్లు వ్యవహారంలో టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి అడ్డంగా దొరికిపోయి, చంద్రబాబు మాట్లాడిన కాల్‌రికార్డింగ్స్ బట్టబయలైతే దాన్నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు పుష్కరాలను వినియోగించుకొన్నారన్నారు.
పుష్కరాలు గోదావరి నదీ పరివాహక ప్రాంతమంతా సాగుతాయి, కానీ చంద్రబాబు దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని అంతా నేనే చేస్తున్నాను, అంతా నావల్లే జరుగుతోందని వ్యక్తిగత ప్రచారం చేసుకోవడానికి 30 మంది ప్రాణాలు బలిగొన్నారని మండిపడ్డారు. పుష్కరాల్లో జరిగిన తొక్కిసలాట ఘటనను చెరిపేయడానికి మాస్టర్‌ప్లాన్ అంటూ ప్రచారం మొదలు పెట్టారన్నారు. రాజధాని మాస్టర్ ప్లాన్‌తో సింగపూర్ ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని, సింగపూర్‌లోని ఒక కంపెనీ దాన్ని తయారు చేసిందన్నారు. రెండు దేశాల మధ్య ఒప్పందాలు జరిగేటప్పుడు ఆ దేశ జాతీయ జెండాలు పెట్టడం చూశాం గానీ ఏపీ ప్రభుత్వం, సింగపూర్ కంపెనీ మధ్య ఒప్పందం జరిగితే రెండు దేశాల జెండాలు పెట్టడం విచిత్రంగా ఉందన్నారు.
కాంగ్రెస్ బతుకంతా పిల్ల టీడీపీగా బ్రతకడమే
ఆంధ్రప్రదేశ్‌ను అడ్డంగా విభజించి రాహుల్‌గాంధీ ఏ మొఖం పెట్టుకొని రాష్ట్ర పర్యటనకు వస్తున్నారని వారు ప్రశ్నించారు. వైఎస్ మరణానంతరం ఆయన కుటుంబంపై కాంగ్రెస్, టీడీపీలు పగబట్టినట్లు వ్యవహరించాయన్నారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని ఓదార్పు చేయడానికి వీల్లేదని ఆదేశించిన దౌర్భాగ్యపు చరిత్ర సోనియాది, కాంగ్రెస్‌ది అన్నారు.
వైఎస్ జగన్ లొంగలేదని టీడీపీతో కలిసి ఆయనపై కేసు వేయించి 16నెలలు జై ల్లో పెట్టించారని మండిపడ్డారు. పై నుంచి ఆదేశాలు ఇచ్చి వైఎస్‌ఆర్ పేరును చార్జిషీట్‌లో చేర్చారన్నారు. చేసిందంతా చేసి ఇప్పుడు ఆయన విగ్రహానికి ఎలా పూలమాల వేస్తారని ప్రశ్నించారు. వైఎస్‌ను స్మరించే అర్హత రాహుల్‌గాంధీకి లేదని తెలిపారు. ఇక కాంగ్రెస్ చరిత్ర అంతా ఏపీలో పిల్ల టీడీపీగా బ్రతకడమేనని ఎద్దేవా చేశారు. ఈ సమావేశంలో వైఎస్‌ఆర్‌సీపీ నగర అధ్యక్షుడు బి. నిత్యానందరెడ్డి, ఎస్సీ విభాగం జిల్లా అధ్యక్షుడు పులి సునీల్‌కుమార్ పాల్గొన్నారు.