
హంద్రీనీవా..చెరువులకేనా!
రాయలసీమకు కృష్ణా జలాలు అందించి బంగారు పంటలు పండించాలనే ఉద్దేశంతో హంద్రీనీవా సుజల స్రవంతి....
► ప్రాజెక్టు ఉద్దేశాన్ని మారుస్తున్న ప్రభుత్వం
► డిస్ట్రిబ్యూటరీలకు నీరు ఇచ్చేందుకు విముఖత
► చెరువులకు మాత్రమే నీరిచ్చేలా ప్రణాళిక
► పంట కాల్వల భూసేకరణ పూర్తి కాలేదని సాకు
► నెపం రైతులపై నెడుతున్న పాలకులు
► ఆయకట్టు అన్నదాతల్లో ఆందోళన
హంద్రీనీవా ద్వారా కృష్ణా జలాలు కరువు సీమకు తరలించి సస్యశ్యామలం చేస్తామని సీఎం చంద్రబాబు నాయుడు, జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమమహేశ్వరరావులు పదేపదే చెబుతున్నారు. మాటలతో రాయలసీమపై ఎంతో ప్రేమను ఒలకబోస్తున్న వీరు.. ఆచరణలో మాత్రం కరువు సీమకు అన్యాయం చేస్తున్నారు. ఈ ప్రాజెక్టు కింద కాల్వల ద్వారా నీరందించాల్సింది పోయి..చెరువులు నింపుతాం, భూగర్భజాలు పెంచుతాం అంటూ కొత్త పల్లవి అందుకున్నారు. ప్రాజెక్టు అసలు ఉద్దేశాన్ని అటకెక్కించి రైతుల ఆశలపై నీళ్లు చల్లుతున్నారు.
కర్నూలు సిటీ: రాయలసీమకు కృష్ణా జలాలు అందించి బంగారు పంటలు పండించాలనే ఉద్దేశంతో హంద్రీనీవా సుజల స్రవంతి పథకానికి వైఎస్సార్ శ్రీకారం చూట్టారు. నాడు ప్రతి పక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీ ఉమ్మడిరాష్ట్రంలో తెలంగాణకు చెందిన తన పార్టీ నాయకులతో హంద్రీనీవాకు వ్యతిరేకంగా ఆందోళనలూ చేపట్టింది. ఈ కాల్వకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. 1996 మార్చి 11వతేదీన, 1999 జూలై9న రెండు సార్లు శంకుస్థాపక చేశారు. కానీ పనులు మాత్రం మొదలు పెట్టలేదు. రాష్ట్ర విభజన తరువాత అధికారంలోకి వచ్చి..హంద్రీనీవా ఉద్దేశాన్నే మార్చేశారు.
అది ఎలాగంటే..
రాయలసీమలోని కర్నూలు, అనంతపురం, వైఎస్సార్ కడప, చిత్తూరు జిల్లాల్లో 6.025 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలనేది హంద్రీనీవా లక్ష్యం. శ్రీశైలం వెనుక జలాలను వరద రోజుల్లో 40 టీఎంసీలు తరలించాలనేది ఈ పథక ఉద్దేశం. ఇందుకు రూ. 6850 కోట్లతో ఈ ప్రాజెక్టు నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. వైఎస్సార్ సీఎంగా ఉన్న సమయంలో రూ. 4340.40 కోట్లు ఖర్చు చేసి 80 శాతం పనులు పూర్తి చేశారు. మిగిలిన 20 శాతం పనులు ఏడేళ్లయినా పూర్తికాలేదు. మాల్యాల దగ్గర మొదలు అయ్యే కాల్వ 144 కి.మీ వద్ద అనంతపురం జిల్లాలోకి ప్రవేశిస్తుంది. ప్రధాన కాల్వకు మొత్తం 12 డిస్ట్రిబ్యూటరీలు ఉన్నాయి. వీటి కింద పంట కాల్వలు తీసి నీరు ఆందించాలి. అయితే భూములు ఇచ్చేందుకు రైతులు ముందుకు రావడం లేదనే సాకుతో పంట కాల్వల నిర్మాణాన్ని ప్రభుత్వం అటకెక్కించింది. హంద్రీనీవా నుంచి చెరువులకు నీరు నింపి భూగర్భ జలాన్ని పెంచుతామని ప్రభుత్వ పెద్దలు చెబుతున్నారు. అసలు ఉద్దేశాన్ని నీరుగార్చే ప్రయత్నాలు చేస్తున్నారు.
ఏం జరిగిందంటే..
హంద్రీనీవా ప్రధాన కాల్వతో పాటు పంట కాల్వలకు 9781.06 ఎకరాలు అవసరం. ఇప్పటి వరకు 8700 ఎకరాలు సేకరించారు. పత్తికొండ రిజర్వాయర్ కుడి, ఎడమ కాల్వల కింద పంట కాల్వల నిర్మాణానికి 1800 ఎకరాలు సేకరించాల్సి ఉంది. అయితే 500 ఎకరాలు కూడా సేకరించలేకపోయారు. రైతులు సహకరించడం లేదని అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వం భూసేకరణ పరిహారం కోస్తా ప్రాంతంలో ఒకరకంగా, రాయలసీమలో మరో రకంగా ఇస్తోంది. పరిహారంలో పేచీ రావడంతో పంట కాల్వ పనులు నిలిపివేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. హంద్రీనీవా నీరు నింపేందుకు ఇప్పటికి 106 చెరువులను గుర్తించారు. ఇందుకు సుమారు రూ.1060 కోట్లతో డీపీఆర్(డిటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టు) తయారు చేశారు. అంత మొత్తం ప్రభుత్వం ఇవ్వదని చెప్పడంతో అత్యంత ప్రాధాన్యం కింద 17 చెరువులకు నీరు ఇచ్చేందుకు రూ. 155 కోట్లతో ప్రతిపాదనలు ప్రభుత్వానికి ఇటీవలే పంపించారు. దీని బట్టి చూస్తే సాగునీటి కాల్వ.. వాటర్ రీచార్జీ కెనాల్‌గా మారుతోందని చెప్పవచ్చు.
భూసేకరణ పూర్తి కాలేదు
హంద్రీనీవా ప్రధాన కాల్వపై మొత్తం 12 డిస్ట్రిబ్యూటరీలు ఉన్నాయి. పనులు దాదాపు పూర్తి అయ్యాయి. అయితే పంట కాల్వకు అవసరమైన భూసేకరణ పూర్తి కాలేదు. పత్తికొండ రిజర్వాయర్ కిందే అధిక శాతం పెండింగ్‌లో ఉంది. ఈ విషయంపై ప్రభుత్వం దృష్టికి తీసుకపోయాం.- శ్యాంసుందర్, హంద్రీనీవా ఫేజ్-1 ఎస్‌ఈ