మిన్నంటిన ‘జై జగన్’ నినాదాలు
ఎయిర్‌పోర్టు నుంచి నేరుగా వెళ్లి జగన్‌ను కలిసిన షర్మిల
సాక్షి, హైదరాబాద్: అభిమానం వెల్లువెత్తింది. జోరు వానను సైతం లెక్కచేయక.. ‘జై జగన్.. జయహో జగన్’ అన్న నినాదం శంషాబాద్ ఎయిర్‌పోర్టును హోరెత్తించింది. పద్నాలుగు జిల్లాల మీదుగా 3,112 కిలోమీటర్ల ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్రను ముగిం చుకుని సోమవారం ఉదయం విశాఖపట్నం నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న వైఎస్ షర్మిల, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మలకు వేలాదిగా తరలివచ్చిన కార్యకర్తలు ఆత్మీయ స్వాగతం పలికారు. నాయకులు, కార్యకర్తలు, అభిమానుల నినాదాల మధ్య షర్మిల శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి నేరుగా చంచల్‌గూడ జైలుకు వెళ్లి తన సోదరుడు, పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డిని ములాఖత్‌లో కలుసుకున్నారు.
పాదయాత్ర సాగిన తీరును షర్మిల ఈ సందర్భంగా జగన్‌తో పంచుకున్నారు. ములాఖత్ అనంతరం షర్మిల వేల మంది అభిమానులు భారీ కాన్వాయ్‌తో వెంటరాగా తన నివాసానికి చేరుకున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ కేంద్ర పాలక మండలి సభ్యులు బాజిరెడ్డి గోవర్ధన్, రాష్ట్ర నాయకులు వడ్డేపల్లి నర్సింగ్‌రావు, కె.శివకుమార్, బి.జనార్ధన్‌రెడ్డి, అధికార ప్రతినిధి గట్టు రామచంద్ర రావు, మైనారిటీ సెల్ కన్వీనర్ రహమాన్, కార్మిక విభాగం కన్వీనర్ జనక్‌ప్రసాద్, సీఈసీ సభ్యులు మతీన్‌ముజదాది, పి.విజయారెడ్డి, యువజన, సేవాదళం కన్వీనర్లు పుత్తా ప్రతాప్‌రెడ్డి, కోటింరెడ్డి వినయ్‌రెడ్డి, నగర కన్వీనర్ ఆదం విజయ్‌కుమార్, నియోజకవర్గాల సమన్వయకర్తలు దేప భాస్కర్‌రెడ్డి, ధన్‌పాల్‌రెడ్డి, శేఖర్‌గౌడ్, లింగాల హరిగౌడ్, సాయినాథ్‌రెడ్డి, నాయకులు సురేష్‌రెడ్డి, సూర్యనారాయణరెడ్డి, రాచమళ్ల సిద్ధేశ్వర్, రూపానందరెడ్డి, కొండా రాఘవరెడ్డి తదితరుల ఆధ్వర్యంలో కార్యకర్తలు షర్మిలకు స్వాగతం పలికారు.
షర్మిల పాదయాత్ర చరిత్రాత్మక ఘట్టం: బాజిరెడ్డి గోవర్ధన్
రాష్ట్ర ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు ‘మరో ప్రజాప్రస్థానం’ పేరుతో షర్మిల చేపట్టిన పాదయాత్ర చరిత్రాత్మక ఘట్టమని పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. సోమవారం ఆయన కార్యకర్తలతో కలిసి షర్మిల వెంట చంచల్‌గూడ జైలుకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్‌ను అక్రమంగా జైల్లో నిర్బంధించినప్పటికీ షర్మిల తండ్రి బాటలో నడుస్తూ ప్రజల బాగోగుల కోసం పాదయాత్ర చేయటంతో ఆమె చరిత్ర సృష్టించారని చెప్పారు. విలేకరులు అడిగిన ఓ ప్రశ్నకు ఆయన బదులిస్తూ తమ పార్టీ తెలంగాణకు వ్యతిరేకం కాదని, ఇరు ప్రాంతాలకు సమన్యాయం చేయాలన్నదే పార్టీ ఉద్దేశమని అన్నారు. మహానేత వైఎస్‌ఆర్ ఆశయాలను నెరవేర్చేందుకే వైఎస్‌ఆర్‌సీపీ స్థాపించారన్నారు. వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసిన షర్మిల ప్రపంచ చరిత్రలో నిలిచిపోతారన్నారు.
పాదయాత్ర ప్రజలకు భరోసానిచ్చింది: జనక్ ప్రసాద్
కాంగ్రెస్ పాలనలో ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని, షర్మిల పాదయాత్ర ప్రజలకు భరోసానిచ్చిందని పార్టీ నేత జనక్ ప్రసాద్ అన్నారు. టీడీపీ, కాంగ్రెస్ పార్టీల నుంచి ఎందరో నాయకులు బయటకు వెళితే మాట్లాడని వారు తమ పార్టీ నుంచి కొందరు వెళ్లిపోతే తెలంగాణ ప్రాంతంలో వైఎస్‌ఆర్‌సీపీ లేదనడం సరికాదన్నారు. స్వార్థ ప్రయోజనాల కోసం పార్టీలోకి వచ్చిన వారే తిరిగి వెళ్లిపోయారన్నారు. తెలంగాణలో ఉన్న నాయకులు నిరుత్సాహపడాల్సిన అవసరం లేదని, ఆ ప్రాంతంలో పార్టీని మరింత పటిష్ట పరచాలని అన్నారు.
వైఎస్‌ఆర్‌సీపీ ప్రజల పక్షం: గట్టు
వైఎస్‌ఆర్ సీపీ ప్రజల పక్షానే ఉందని ఆ పార్టీ నేత గట్టు రామచంద్రరావు అన్నారు. షర్మిల చేపట్టిన పాదయాత్రతో కాంగ్రెస్, టీడీపీ నేతలు భయకంపితులయ్యారన్నారు. జగన్‌ను అక్రమంగా నిర్బంధించాక ప్రాంతాలకతీతంగా, మతాలకతీతంగా, కులాలకతీతంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు కసితో పని చేస్తున్నారన్నారు. వైఎస్సార్ పాలన మళ్లీ జగన్ నాయకత్వంలోనే సాధ్యమవుతుందని రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ అభిప్రాయపడుతున్నారని చెప్పా రు. పదవుల కోసం వ చ్చిన వారే పార్టీని విడిచిపెట్టారని, వారు వైఎస్‌ఆర్‌పై అభిమానంతో వచ్చిన వారు కాదన్నారు. తెలంగాణ ఏర్పడినా ఆ ప్రాంతంలో పార్టీ అధికారంలోకి వస్తుందన్నారు. వైఎస్‌ఆర్ సీపీ జాతీయ పార్టీగా అభివృద్ధి చెందుతుందన్నారు.
షర్మిల పాదయాత్రతో గర్వపడుతున్నాం: రహమాన్
రాష్ట్ర ప్రజల సాధకబాధకాలను తెలుసుకుని వారికి భరోసా ఇస్తూ షర్మిల దాదాపు 3 వేల కిలోమీటర్ల పాదయాత్రను పూర్తి చేయడం గర్వంగా భావిస్తున్నామని ఆ పార్టీ నేత, మాజీ ఎమ్మెల్సీ రహమాన్ అన్నారు. మహిళ అయినప్పటికీ వేల కిలోమీటర్ల మేర పాదయాత్రను చేయడంతో షర్మిల చరిత్రపుటల్లో నిలిచిపోతారన్నారు. రాష్ట్ర ప్రజలందరూ ఏకమై జగన్‌ను సీఎం చేయాలన్నారు.
షర్మిలకు ఘన స్వాగతం
సాక్షి ప్రతినిధి, బెంగళూరు: ఆంధ్రప్రదేశ్‌లో సుదీర్ఘ పాదయాత్ర ద్వారా రికార్డు సృష్టించిన దివంగత మహానేత డాక్టర్ వైఎస్. రాజశేఖరరెడ్డి తనయ షర్మిలకు సోమవారం సాయంత్రం బెంగళూరు విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. హైదరాబాద్ నుంచి వచ్చిన ఆమెకు సాదర స్వాగతం పలకడానికి పెద్ద సంఖ్యలో వైఎస్ అభిమానులు విమానాశ్రయానికి తరలివచ్చారు. డాక్టర్ వైఎస్సార్ స్మారక ఫౌండేషన్ కర్ణాటక అధ్యక్షుడు వెంకట కృష్ణారెడ్డి, ఉపాధ్యక్షుడు భక్తవత్సల రెడ్డి, కార్యదర్శి బత్తుల అరుణాదాస్, కోశాధికారి రాకేశ్‌రెడ్డి, కార్యనిర్వాహక కార్యదర్శి సీహెచ్ బాలకృష్ణారెడ్డి, పదాధికారులు దామోదర రెడ్డి, రాజశేఖరరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
శంషాబాద్‌లో వైఎస్ తనయకు ఆత్మీయ స్వాగతం
Published Tue, Aug 6 2013 2:27 AM | Last Updated on Sat, Jul 28 2018 6:26 PM
Advertisement
Advertisement