నివాళులందుకున్న పతితపావన మహాపాత్రో
కొరాపుట్: చిన్ననాటి గురువు మృతి పట్ల పూర్వ విద్యార్థులు ప్రగాఢ సంతాపం వెలిబుచ్చారు. కొరాపుట్ బ్లాక్‌లోని డుమురిపుట్ ఉన్నత పాఠశాలలో 1969 నుంచి 1994 వరకు ప్రధానోపా«ధ్యాయునిగా విధులు నిర్వహించిన పతితపావన మహాపాత్రో గత నెల 31న ఆయన స్వగ్రామం ఖుర్దా జిల్లా కైపొదర్‌లో మృతి చెందారు. ఆయన మరణ వార్త తెలుసుకుని పూర్వవిద్యార్థులు దశాహం సందర్భంగా ఆదివారం సాయంత్రం డుమురిపుట్ ఉన్నత పాఠశాల ఆవరణలో స్మృతి సమావేశం నిర్వహించారు.
సమావేశంలో డుమురిపుట్ గ్రామ పెద్దలు నీలాంబర సాహు, రాధామోహన్ ఖిముండు, దీనబంధు బారిక్, దిలీప్ కుమార్ సామంతరాయ్, దేవీప్రసాద్ బిశ్వాల్, గోపీనాథ్ పాణిగ్రాహి, అలనాటి ఆయన శిశ్యులు తిరుమలేశ్వర్ చౌదరి, స్నిగ్ధరాణి మిశ్రా, సుబోధ్ కుమార్ చెటి జగదీస్ ఖోస్లా, ఎం.సురేష్‌కుమార్, తిరుపతి పాణిగ్రాహి, జితేంద్ర సాహు తదితర వందమంది పూర్వ విద్యార్థులు స్మృతి సమావేశంలో పాల్గొని తమ ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు.
తమ గురువు నిలువెత్తు చిత్రపటం ముందు జ్యోతిని వెలిగించి పుష్పాలను సమర్పించి నివాళులర్పించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని రెండు నిమిషాల పాటు మౌనప్రార్థన చేశారు. ఆయన మూలంగా డుమురిపుట్ పరిసర గ్రామాల వందలాది మంది ఉత్తమ విద్యార్థులం కాగలిగామని, స్థానిక విద్యాభివృద్ధికి ఆయన సేవలు గణనీయమంటూ ఆయన వ్యక్తిత్వాన్ని పలువురు కొనియాడారు
ఆయన కుటుంబ ఆర్థిక స్థోమత శోచనీయంగా ఉన్నందున పూర్వ విద్యార్థులందరు చిరు గురు దక్షిణగా ఆయన కుటుంబానికి లక్ష రూపాయల ఆర్థిక సహకారాన్ని సమావేశంలో ప్రకటించి గురుభక్తికి ఆదర్శంగా నిలిచారు.
Comments
Please login to add a commentAdd a comment