పెళ్లి ఇంట విషాదం
= అదుపుతప్పి కారు బోల్తా
= చిన్నారి దుర్మరణం
= నలుగురికి తీవ్ర గాయాలు
= వారిలో ఒకరి పరిస్థితి విషమం
కనిగిరి: అదుపుతప్పి కారు బోల్తా కొట్టడంతో ఓ చిన్నారి అక్కడికక్కడే మృతి చెందగా నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా మారింది. ఈ సంఘటన శనివారం కనిగిరిలో జరిగింది. వివరాలు.. తెలంగాణ రాష్ట్రం మెదక్ జిల్లా పటాన్‌చెరువు మండలం ఇస్‌నాపూర్ గ్రామానికి చెందిన ఎస్.దుర్గారెడ్డి, కె.శ్రీనివాసులురెడ్డి, బ్రహ్మారెడ్డి, విజయలక్ష్మి, రమాదేవి, చిన్నారులు బ్రహ్మణి, చరణ్‌లు నెల్లూరు జిల్లా దుత్తలూరు మండలం నాయుడుపల్లి వివాహానికి కారులో వస్తున్నారు.
పెళ్లి కుమారుడు సందీప్‌రెడ్డి.. దుర్గారెడ్డికి వరుసకు బావమరిది (మేనమామ కొడుకు). ఈ మేరకు పెళ్లి కుమారుడి తరఫున ఇస్‌నాపూర్ నుంచి కారులో పెళ్లికుమారుడు బావ దుర్గారెడ్డి, బాబాయ్ శ్రీనివాసులురెడ్డితో పాటు మొత్తం ఏడుగురు కారులో పెళ్లి కమార్తెకు పథానం తీసుకుని వస్తున్నారు. మార్గమధ్యంలో కనిగిరి నగర పంచాయతీ కాశిరెడ్డి నగర్ వద్ద చప్టా గుంతను కారు గుద్దుకుని మూడు పల్టీలు కొట్టింది. కారు వేగంగా ఉండటంతో రోడ్డు పక్కనే ఉన్న గ్రామ సూచిక బోర్డు దిమ్మెను పగులగొట్టుకుని వెళ్లి మరో దిమ్మెను ఢీకొని ఆగింది.
కారును దుర్గారెడ్డి నడుపుతుండగా కాకర్ల శ్రీనివాసులురెడ్డి, బ్రహ్మణి ముందు కూర్చొన్నారు. ప్రమాదంలో బ్రహ్మణి కారుకింద పడి అక్కడికక్కడే మృతి చెందగా శ్రీనివాసులురెడ్డితో పాటు వెనుక కూర్చున్న బ్రహ్మారెడ్డి, విజయలక్ష్మి, బాలుడు చరణ్‌కు తీవ్రగాయాలయ్యాయి. రమాదేవి, దుర్గారెడ్డికి స్వల్ప గాయాలయ్యాయి. పరిస్థితి విషమంగా ఉన్న శ్రీనివాసులురెడ్డిని ఒంగోలు తరలించారు. ఎస్‌ఐ శ్రీనివాసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
దుర్గారెడ్డి కుమార్తె బ్రహ్మణి మృత్యు ఒడికి చేరడంతో తండ్రి రోదనలు చూపరుల హృదయాలను కలచి వేశాయి. అప్పటి వరకూ తన పక్కనే కూర్చుని ఉన్న కుమార్తె క్షణాల వ్యవధిలో కన్నుమూయడంతో ఆ తండ్రి తల్లిడిల్లిపోయాడు. దుర్గారెడ్డి, అశ్విని దంపతులకు బ్రహ్మణి పెద్ద కుమార్తె. వీరందరిదీ దుత్తలూరుకాగా 20 ఏళ్ల కిత్రం బేల్దారి పనులకు హైదరాబాద్ వలస వెళ్లారు. వైఎస్సార్ సీపీ కనిగిరి నియోజకవర్గ ఇన్‌చార్జి బుర్రా మధుసూదన్, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి రంగనాయకులురెడ్డి, మండల అధ్యక్షుడు సంగు సుబ్బారెడ్డిలు ప్రమాదం జరిగిన వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రును హుటాహుటిన ఆస్పత్రులకు తరలించారు.