దక్కని ప్రత్యేక హోదా, రైల్వే జోన్
వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు అమర్‌నాథ్
కలెక్టరేట్ ఎదుట ధర్నా
విశాఖపట్నం: ముఖ్యమంత్రి చంద్రబాబు అసమర్థత వల్లే ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా, విశాఖకు రైల్వే జోన్ రావడం లేదని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్ అన్నారు. రైల్వే ప్రత్యేక జోన్, రాష్ట్రానికి ప్రత్యేక హోదాను డిమాండ్ చేస్తూ శుక్రవారం కలెక్టరేట్ ఎదుట వైఎస్సార్‌సీపీ ధర్నా నిర్వహించింది. ధర్నానుద్దేశించి అమర్‌నాథ్ మాట్లాడుతూ రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్న హామీలేవీ నెరవేరలేదన్నారు. విశాఖకు రైల్వే జోన్‌పై విశాఖ ఎంపీలకు చిత్తశుద్ధి లేదని విమర్శించారు. పోలవరం ప్రాజెక్టుకు ఈ బడ్జెట్‌లో రూ.100 కోట్లు కేటాయిస్తే పూర్తవడానికి 300 ఏళ్లు పడుతుందన్నారు. కేంద్రం రాష్ట్రానికి సాయం చేయకపోవడానికి చంద్రబాబే కారణమని ఆరోపించారు. తనతో పాటు కొడుకు స్వలాభం కోసం రూ.2200 కోట్లతో పట్టిసీమ ప్రాజెక్టు చేపట్టారన్నారు. రాష్ట్రానికి నిధులిస్తే పట్టిసీమలా దోచుకుంటారని కేంద్రానికి తెలిసిపోయినందునే నిధులివ్వడం లేదని చెప్పారు. వైఎస్సార్‌సీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి సీఎం అయ్యాకే పోలవరం ప్రాజెక్టు ముందుకెళ్తుందన్న ఆలోచనలో కేంద్రం ఉందన్నారు. రాజధాని పేరుతో సీఎం కోట్లు కొల్లగొడుతున్నారని సాక్షి దినపత్రిక సాక్ష్యాధారాలతో నిరూపించిందన్నారు. ఆ సొమ్ముతోనే వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలను నిస్సిగ్గుగా కొనుగోలు చేస్తున్నారన్నారు. అమరావతి భూముల కుంభకోణంపై సీబీఐతో విచారణ జరిపించుకుని సీఎం నిజాయతీ చాటుకోవాలని డిమాండ్ చేశారు.
వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే గొల్ల బాబూరావు మాట్లాడుతూ అమరావతి భూముల్లో 25 వేల ఎకరాలు చంద్రబాబు భజనపరులైన లింగమనేని, ప్రత్తిపాటి పుల్లారావు, రావెల కిషోర్‌బాబు, నారాయణలకు దోచిపెట్టారని ఆరోపించారు. డబ్బున్న వారు కొనుక్కోవడం తప్పేమిటంటూ సీఎం చెప్పడం రాజ్యాంగ విరుద్ధమన్నారు. వైఎస్సార్‌సీపీని వీడి టీడీపీలో చేరిన ఎమ్మెల్యేలు రాజ్యసభ, ఎమ్మెల్సీ ఎన్నికల్లో విప్ జారీ చేస్తే అనర్హులవుతారన్నారు. వెళ్లిన వారు రాజీనామా చేసి ఉప ఎన్నికల్లో పోటీ చేసి గెలవాలన్నారు. విశాఖకు రైల్వే జోన్ వచ్చేస్తోందంటూ ఊదరగొట్టిన సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రులు వెంకయ్యనాయుడు, అశోక్‌గజపతిరాజు, సుజనాచౌదరిలు పదవులకు రాజీనామా చేయాలని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కొయ్య ప్రసాదరెడ్డి డిమాండ్ చేశారు. రూ.13 వేలకోట్లు ఖర్చయ్యే విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టుకు బడ్జెట్‌లో రూ.లక్ష కేటాయించడం సిగ్గుచేటన్నారు. సీఎం, అతని తనయుడు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు అమరావతి భూములను దోచుకోవడానికి రాబందుల్లా వాలారన్నారు.
మాజీ ఎమ్మెల్యే, ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త తైనాల విజయకుమార్ మాట్లాడుతూ రైల్వే, సాధారణ బడ్జెట్‌లలో విశాఖకు ఇచ్చిన నిధులను చూసి సీఎం, ఎంపీలు సిగ్గుపడాలన్నారు. మాజీ ఎమ్మెల్యే, పశ్చిమ సమన్వయకర్త మళ్ల విజయప్రసాద్ మాట్లాడుతూ హుద్‌హుద్ తర్వాత సీఎం రిలీఫ్ ఫండ్‌కు వచ్చిన నిధులేంచేశారో శ్వేతపత్రం విడుదల చేయాలని, లేదంటే విశాఖ ప్రజలు త్వరలోనే గుణపాఠం చెబుతారన్నారు.
దీనిపై బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. ధర్నా అనంతరం డీఆర్‌వో చంద్రశేఖరరెడ్డికి వినతిపత్రం అందించారు. ధర్నాలో పార్టీ నియోజకవర్గాల సమన్వయకర్తలు వంశీకృష్ణ శ్రీనివాస్, కర్రి సీతారాం, తిప్పల నాగిరెడ్డి, కోలా గురువులు, అన్నంరెడ్డి అదీప్‌రాజ్, ప్రగడ నాగేశ్వరరావు, రొంగలి జగన్నాథం, రాష్ట్ర కార్యదర్శి కంపా హనోకు, రాష్ట్ర ప్రచార కమిటీ ప్రధాన కార్యదర్శి రవిరెడ్డి, నగర మహిళా అధ్యక్షురాలు పసుపులేటి ఉషాకిరణ్, నగర అనుబంధ సంఘాల అధ్యక్షులు బర్కత్‌ఆలీ, బోని శివరామకృష్ణ, బయ్యవరపు రాధ, సిరతల శ్రీనివాస్, యువజన నాయకులు బి.కాంతారావు, తుల్లి చంద్రశేఖర్‌యాదవ్, ఆళ్ల గణేష్, మాసిపోగు రాజు, రాష్ట్ర ఎస్సీసెల్ సంయుక్త కార్యదర్శి అల్లంపల్లి రాజబాబు పాల్గొన్నారు.
బాబు అసమర్థత వల్లే..
Published Fri, Mar 4 2016 11:25 PM | Last Updated on Sat, Mar 23 2019 9:10 PM
Advertisement
Advertisement