రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏ ప్రభుత్వ వైద్య కళాశాల, ఆస్పత్రికి దక్కని రికార్డు గుంటూరు జీజీహెచ్‌కు సొంతమైంది. న్యూరాలజీ పీజీ సీట్లు నాలుగు కల్గిన ఏకైక ప్రభుత్వ ఆస్పత్రిగా గుర్తింపు పొందింది. ఈ విభాగంలో ఉన్న సౌకర్యాలు, పేదలకు అందుతున్న వైద్యసేవలకు గుర్తింపుగా ఈ గౌరవం దక్కింది. డీఎం న్యూరాలజీ పీజీ సీట్లను రెండు నుంచి నాలుగుకు పెంచుతూ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఉత్తర్వులు జారీ చేయడంతో ఈ అరుదైన అవకాశం వరించింది.
సాక్షి, గుంటూరు: రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏ ప్రభుత్వ వైద్య కళాశాల, ఆస్పత్రిలో లేని విధంగా అంతర్జాతీయ స్థాయిలో న్యూరాలజీ రోగులకు గుంటూరు జీజీహెచ్ న్యూరాలజీ వైద్య విభాగంలో ఉచితంగా కార్పొరేట్ వైద్యసేవలను అందిస్తున్నారు. న్యూరాలజీ వైద్య విభాగంలో ఉన్న వైద్య సౌకర్యాలు, రోగులకు అందిస్తున్న ఉచిత కార్పొరేట్ వైద్యసేవలను మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసీఐ) గుర్తించింది. ఈ మేరకు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏ ప్రభుత్వ ఆస్పత్రి, వైద్య కళాశాలలో లేని విధంగా డీఎం న్యూరాలజీ పీజీ సీట్లు రెండు నుంచి నాలుగుకు పెంచుతూ గురువారం ఎంసీఐ ఉత్తర్వులు ఇచ్చింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో డీఎం న్యూరాలజీ పీజీ సీట్లు నాలుగు కల్గిన ఏకైక, మొదటి వైద్య విభాగంగా గుంటూరు జీజీహెచ్ న్యూరాలజీ విభాగం సరికొత్త రికార్డు సృష్టించింది.
2019 డిసెంబర్ 2న గుంటూరు జీజీహెచ్‌లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి న్యూరాలజీ రోగి ఆరోగ్య పరిస్థితిని వివరిస్తున్న ఆ విభాగాధిపతి డాక్టర్
నాగార్జునకొండ వెంకటసుందరాచారి (ఫైల్)
పేదరోగులకు ఉచితంగా కార్పొరేట్ వైద్యసేవలు
గుంటూరు జీజీహెచ్ న్యూరాలజీ వైద్య విభాగంలో పేదలకు కార్పొరేట్ వైద్యసేవలను ఉచితంగా అందిస్తున్నారు. న్యూరాలజీ వైద్య విభాగాధిపతి డాక్టర్ నాగార్జునకొండ వెంకట సుందరాచారి పేదలకు కార్పొరేట్ వైద్యసేవలను అందించేందుకు దాతల సాయంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో లేని వైద్యసౌకర్యాలను గుంటూరు జీజీహెచ్ న్యూరాలజీ వైద్య విభాగంలో ఏర్పాటు చేయించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏ ప్రభుత్వ ఆస్పత్రుల్లో లేని విధంగా బ్రెయిన్ స్ట్రోక్ బాధితుల కోసం 20 పడకలతో స్ట్రోక్ యూనిట్‌ను, దాతల సాయంతో కోటి రూపాయలతో 2015 అక్టోబర్‌లో ఏర్పాటు చేశారు. బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన వారికి అందిస్తున్న వైద్యసేవలకు జీజీహెచ్ స్ట్రోక్ యూనిట్‌కు 2017 జూలైలో జాతీయస్థాయిలో ఇండియన్ స్ట్రోక్ క్లినికల్ ట్రయల్ నెట్‌వర్క్‌లో చోటు లభించింది. దేశ వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులు 23 ఉండగా అందులో జీజీహెచ్ న్యూరాలజీ వైద్య విభాగం ఒకటి.
గుంటూరు జీజీహెచ్ న్యూరాలజీ వైద్య విభాగం
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏ ప్రభుత్వ ఆస్పత్రుల్లో లేని విధంగా నాట్కో ట్రస్ట్ సాయంతో 2017 జూలైలో న్యూరాలజీ వైద్య విభాగంలో స్లీప్ ల్యాబ్‌ను ఏర్పాటుచేసి కార్పొరేట్ వైద్యం అందిస్తున్నారు. న్యూరాలజీ వైద్య విభాగంలో కార్పొరేట్‌కు మించి వైద్యసౌకర్యాలు ఉండటంతోపాటుగా నాణ్యమైన వైద్యసేవలను అందిస్తున్నందుకు 2018 జూన్‌లో ఐఎస్‌ఓ 9001–2015 గుర్తింపు లభించింది. నాణ్యమైన వైద్యసేవలకు ఐఎస్‌ఓ సర్టిఫికెట్ గల ఏకైక ప్రభు త్వాస్పత్రిగా న్యూరాలజీ విభాగం గుర్తింపు పొందింది. ఎలాంటి మొండి రోగమై, అరుదైన వ్యాధైనా న్యూరాలజీ వైద్యులు ఉచితంగా కార్పొరేట్ వైద్యం చేసి నయం చేస్తున్నారనే నమ్మకం రోగుల్లో కలిగించేలా ఇక్కడి వైద్యసేవలు ఉన్నాయంటే అతిశయోక్తి కాదేమో.
వైద్యుల అభినందనలు
రాష్ట్రంలో ఎక్కువ సంఖ్యలో పీజీ సీట్లు కల్గిన విభాగంగా గుంటూరు జీజీహెచ్ న్యూరాలజీ వైద్య విభాగానికి గుర్తింపు రావటంతో శుక్రవారం పలువురు వైద్యులు, వైద్యాధికారులు గుంటూరు వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ గుంటుపల్లి సుబ్బారావుకు, జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ సబిన్‌కర్ బాబాలాల్‌కు, న్యూరాలజీ వైద్య విభాగాధిపతి డాక్టర్ సుందరాచారికి అభినందలు తెలిపారు.
ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏ ప్రభుత్వ ఆస్పత్రుల్లో లేని విధంగా గుంటూరు జీజీహెచ్ న్యూరాలజీ వైద్య విభాగంలో నాలుగు డీఎం న్యూరాలజీ పీజీ సీట్లు రావటానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఎంతో చొరవ చూపించారు. ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే గుంటూరు జీజీహెచ్‌లో సమస్యలపై దృష్టిసారించి నివేదిక అందజేయాలని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి జవహర్‌రెడ్డిని పంపించారు. జవహర్‌రెడ్డికి పీజీ సీట్లు పెంచాలని వినతి పత్రం అందజేశాం. ఆయన వెంటనే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి నెలరోజుల వ్యవధిలోనే ఎసెన్షియాలిటీ సర్టిఫికెట్ ఇవ్వటంతో పీజీ సీట్లు పెంపుకోసం దరఖాస్తు చేశాం.
దరఖాస్తు చేసిన నెల రోజుల్లోనే పీజీ సీట్లు పెంచుతూ ఉత్తర్వులు రావటానికి రాష్ట్ర ప్రభుత్వం ఎంతో కృషి చేసింది. దీని వల్ల ప్రైవేటు వైద్య కళాశాలల్లో కోటి రూపాయలకు పైగా ఖరీదుచేసే డీఎం న్యూరాలజీ పీజీ కోర్సులో ఏడాదికి ఇద్దరు ప్రతిభ ఉన్న పేద వైద్యులు ఉచితంగా పీజీ చదివే అవకాశం లభించటంతోపాటుగా పేదలకు ఉచితంగా కార్పొరేట్ వైద్యం అందుతుంది. ప్రస్తుతం న్యూరాలజీ వైద్య విభాగంలో ఒక ప్రొఫెసర్, ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులతో వారంలో మూడు రోజులు న్యూరాలజీ ఓపీ వైద్యసేవలను అందిస్తున్నాం. ప్రభుత్వం పెద్దమనస్సు చేసుకుని ఒక అసోసియేట్ ప్రొఫెసర్, ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను కూడా మంజూరు చేస్తే న్యూరాలజీ వైద్య విభాగంలో రోజూ వైద్యసేవలను అందించేం అవకాశం కలుగుతుంది. – డాక్టర్ నాగార్జున కొండవెంకటసుందరాచారి, న్యూరాలజీ వైద్య విభాగాధిపతి, గుంటూరు జీజీహెచ్
Comments
Please login to add a commentAdd a comment