నెల్లూరు(క్రైమ్): అరెస్టు చేసేందుకు వెళ్లిన పోలీసులను నెట్టివేసి పరారయ్యేందుకు ప్రయత్నించారు గుట్కావ్యాపారులు. అతికష్టంపై పోలీసులు వారిని అరెస్టు చేసి రూ.5 లక్షలు విలువచేసే గుట్కాలు, ఖైనీలను స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. నెల్లూరులోని సెంట్రల్ క్రైమ్ స్టేషన్‌లో బుధవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో సీసీఎస్ డీఎస్పీ ఎం.బాలసుందరరావు నిందితుల వివరాలను వెల్లడించారు. నగరానికి చెందిన కొందరు హోల్‌సేల్ వ్యాపారులు తమిళనాడు, కర్నాటక రాష్ట్రాల నుంచి పెద్దఎత్తున గుట్కాలను దిగుమతి చేసుకుని జిల్లాలోని పలు ప్రాంతాల వ్యాపారులకు సరఫరా చేస్తున్నారు. వీరి కదలికలపై పోలీసులు కొద్దిరోజులుగా నిఘా ఉంచారు.
రెండురోజులుగా సీసీఎస్ ఇన్‌స్పెక్టర్ కె.చెంచురామారావు, ఎస్‌కే బాజీజాన్‌సైదా నేతృత్వంలో సీసీఎస్ సిబ్బంది నగరంలో విస్తృత దాడులు చేశారు. రెండోనగర పోలీసు స్టేషన్ పరిధిలోని నవాబుపేటకు చెందిన సరాబు కిషోర్‌కుమార్, జూటూరు సుధాకర్, నరుకూరురోడ్డు సెంటర్‌కు చెందిన గుర్రం మల్లికార్జున, మూడోనగర పోలీసు స్టేషన్ పరిధిలో కఠారిపాలెంకు చెందిన కలుపూరి రాజశేఖర్, పాశం మోహన్‌లు, నాలుగోనగర పోలీసు స్టేషన్ పరిధిలో వేమాలశెట్టిబావి వీధికి చెందిన జి.వెంకట శేషాద్రి అలియాస్ శేషు, హరనాథపురానికి చెందిన చందా వెంకట రాజశేఖర్ అలియాస్ శేఖర్, బోయపాటి సు«ధాకర్‌లను బుధవారం తెల్లవారుజామున పోలీసులు అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించారు.
ఈ క్రమంలో వారు పోలీసులను నెట్టివేసి పరారయ్యేందుకు ప్రయత్నించారు. వెంటనే పోలీసులు స్పందించి అతికష్టంపై నిందితులను అదుపులోకి తీసుకుని నాన్‌బెయిల్‌బుల్ కేసు నమోదు చేశారు. గుట్కా విక్రయాలపై పూర్తిస్థాయిలో దృష్టిసారించామని త్వరలోనే బడా వ్యాపారులను అరెస్టు చేస్తామని డీఎస్పీ వెల్లడించారు. హోల్‌సేల్ వ్యాపారులను అరెస్టు చేసిన సీసీఎస్ ఇన్‌స్పెక్టర్లు కె.చెంచురామారావు, ఎస్‌కే బాజాజీన్‌సైదా, ఎస్సై షేక్ షరీఫ్, హెడ్‌కానిస్టేబుల్స్ ఎస్‌డీ వారీస్ అహ్మద్, వై శ్రీహరి, కానిస్టేబుల్స్ జి.నరేష్, షేక్ దిలీప్, అరుణ్ తదితరులను డీఎస్పీ అభినందించి రివార్డులు ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment