కొట్టక్కి చేనేత సహకార సంఘంలో పేరుకుపోయిన వస్త్ర నిల్వలు
విజయనగరం, రామభద్రపురం: జిల్లాలో చేనేత పరిశ్రమ ప్రభుత్వ సహకారం లేక రోజురోజుకూ కునారిళ్లుతోంది. నాలుగేళ్ల కిందట జిల్లాలో 18 చేనేత సహకార సంఘాలుండేవి. ఆ సంఘాలను ప్రస్తుత ప్రభుత్వం కనీసం పట్టించుకోకపోవడంతో ఆయా కార్మికులకు గిట్టుబాటు ధర లేక పలు సంఘాలు మూతపడగా... ప్రస్తుతం 10 సంఘాలు మాత్రమే నిర్వహించబడుతున్నాయి. చేనేత కార్మికులను ఆదుకుంటాం..రెండు నెలలు జీవన భృతితో పాటు వంద యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తాం అని.. చంద్రబాబు హామీ ఇచ్చారు. కానీ ఆ హామీ నేటికి అమలుకాలేదు. జిల్లా వ్యాప్తంగా ప్రస్తుతం నిర్వహణలో ఉన్న పది సహకార సంఘాల్లో సుమారు 2,500 మంది చేనేత కార్మికులున్నారు. వీరికి దాదాపు రూ.2 కోట్లు పైబడి బకాయిలు ఉన్నాయి. ఈ బకాయిలను ఆప్కో పరిశ్రమ ఏడాదికి పైగా అవుతున్నా ఇప్పటికీ ఇవ్వకపోయినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.
కొనుగోళ్లలో నిర్లక్ష్యమే...
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో చేనేత సహకార సంఘంలో కార్మికులు తయారు చేసిన వస్త్రాలను నెలా నెలా కొనుగోలు చేయడంతో పాటు బకాయిలు చెల్లించేవారు. నాలుగేళ్లుగా చేనేత సహకార సంఘాల నుంచి వస్త్ర కొనుగోలు చేయడంలో నిర్లక్ష్యం జరుగుతోంది. ప్రస్తుత ప్రభుత్వం సరిగా పట్టించుకోకపోవడంతో నాలుగు నెలలకో.. ఆరు నెలలకో ఒకసారి కొనుగోలు చేస్తున్నారు.
పేరుకుపోయిన బకాయిలు, వస్త్ర నిల్వలు...
మండలంలో గల కొట్టక్కి చేనేత సహకార సంఘంలో పాచిపెంట, కొట్టక్కి, సాలూరు,రామభద్రపురం మండలాల్లోని 90 మంది చేనేత కార్మికులకు పనికల్పిస్తున్నారు. వీరికి గతేడాది డిసెంబర్ నాటికి సుమారు రూ.66 లక్షలు బకాయి ఉంది. ఈ ఏడాది జనవరిలో కొనుగోలు చేసిన వస్త్రాలకు సుమారు రూ.31 లక్షలు బకాయిలు ఉన్నాయి. ఇప్పటి వరకు మొత్తం రూ.97లక్షలు బకాయి ఉన్నట్లు తెలిసింది. ప్రస్తుతం వస్త్ర కొనుగోళ్లు సక్రమంగా జరగకపోవడంతో ఈ సంఘంలో తయారైన సుమారు రూ.20 లక్షల వస్త్రాలు నిల్వ ఉండగా మరో రూ.10 లక్షల విలువ చేసే ముడి సరుకు నిల్వ ఉంది. వస్త్రాలు సరిగా కొనుగోలు చేయకపోవడం.. అలాగే తీసుకెళ్లిన సరుకుకు డబ్బులు సక్రమంగా చెల్లించకపోవడంతో సంఘ పాలకవర్గం అప్పులు చేసి కొద్దో గొప్పో కార్మికులకు చెల్లిస్తున్నారు. మిగిలిన బకాయిల కోసం కార్మికులు నెలల కొద్దీ ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంది.
చంద్రబాబు హామీలు గాలికి...
వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు ఇచ్చే విధంగా వర్షాకాలంలో రెండు నెలల పాటు పనులు కోల్పోయిన చేనేత కార్మికులకు నెలకు రూ. రెండు వేల చొప్పున ఆర్థిక సాయం.. వంద యూనిట్ల ఉచిత విద్యుత్..పక్కాఇల్లు, వర్క్‌షెడ్, తదితర సౌకర్యాలు కల్పిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రకటించారు. కాని ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని కార్మికులు మండి పడుతున్నారు. పెథాయ్ తుఫాన్ కారణంగా పది రోజుల పాటు ఉపాధి కోల్పోయిన చేనేత కుటుంబాలు చాలా ఇబ్బంది పడ్డాయి.
కార్పొరేషన్‌తో ప్రయోజనం శూన్యం
చేనేత కార్మికులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామనడం ఎన్నికల గిమ్మిక్కు. దీని వల్ల ప్రయోజనం ఏమీ ఉండదని కార్మికులు చెబుతున్నారు. కార్మికులను ఆదుకునేందుకు ఆప్కో ద్వారా వస్త్రాలు కొనుగోలు చేయించడం.. బకాయిలు విడుదల చేయిస్తే సరిపోతుందని అభిప్రాయపడుతున్నారు. దివంగ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో 9వ తరగతి నుంచి ఇంటర్, ఐటీఐ చదివిన చేనేత కార్మికుల పిల్లలకు చదువు పెట్టిబడి కోసం ఏడాదికి రూ.1200 చొప్పున్న ఉపకారవేతనాలు అందేవని..ఈ ప్రభుత్వ హయాంలో మాత్రం ఎటువంటి సహాయం అందడం లేదని కార్మికులు వాపోతున్నారు.
గిట్టుబాటు లేదు..
వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వ హయాంలో కొనుగోలుతో పాటు నెల నెలా పేమెంట్ ఉండేది. ఇప్పుడు పేమెంట్ అందేసరికి ఆరు నెలల నుంచి ఏడాది సమయం పడుతోంది. అలాగే అప్పట్లో మీటరు వస్త్రం నేస్తే రూ.20 చొప్పున ఇచ్చే వారు. ఇప్పుడూ 20 రూపాయలే ఇవ్వడంతో గిట్టుబాటు కావడం లేదు. – గార అప్పలస్వామి,చేనేత కార్మికుడు, కొట్టక్కి
Comments
Please login to add a commentAdd a comment