ఏటీఎం సెంటర్ల భద్రతను ఆయా బ్యాంకులు గాలికి వదిలేస్తున్నాయి. గుంటూరు నగరంలో చాలా ప్రాంతాల్లోని ఏటీఎంలకు డోర్ లాక్‌లు పనిచేయడం లేదు.
ఎవరికీ పట్టని ఏటీఎంలు
Published Fri, Jan 17 2014 2:13 AM | Last Updated on Fri, Aug 24 2018 2:33 PM
సాక్షి, గుంటూరు: ఏటీఎం సెంటర్ల భద్రతను ఆయా బ్యాంకులు గాలికి వదిలేస్తున్నాయి. గుంటూరు నగరంలో చాలా ప్రాంతాల్లోని ఏటీఎంలకు డోర్ లాక్‌లు పనిచేయడం లేదు. 24 గంటల పాటు ఏటీఎం తలుపులు బార్లా తెరిచే ఉంటున్నప్పటికీ, సంబంధిత బ్యాంకర్లు పట్టించు కోవడం లేదు. సెక్యూరిటీ సిబ్బంది నియామకాలు సైతం నామమాత్రంగా జరుగుతున్నాయి. సరైన పర్యవేక్షణ లేక పోవడంతో ఏటీఎంల వద్ద ఖాతాదారులు తీవ్ర ఇబ్బం దులు ఎదుర్కొంటున్నారు. నిత్యం కోట్లాది రూపాయలు ఈ ఏటీఎంల నుంచి ఖాతాదారులు డ్రా చేసుకుంటున్నారు. సెలవు దినాల్లో కూడా ఏటీఎంలు పనిచేస్తున్నాయి. భద్రతా సిబ్బంది పర్యవేక్షణ లోపం కారణంగా ఏటీఎంలలోకి నిజమైన ఖాతాదారులు వెళుతున్నారా లేక ఇతరులు వెళుతున్నారో వారికి పట్టదు. నగరంలో నిత్యం ఎక్కడో ఓ చోట చోరీలు జరుగుతూనే ఉన్నాయి. దొంగల దృష్టి ఏటీఎంలపై పడింది. దీంతో ఏ క్షణంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకుంటాయోనని ఖాతాదారులు భయాందోళనకు గురవుతున్నారు. ఇటీవల నెల్లూరు, వైజాగ్, హైదరాబాద్‌లో ఏటీఎంలను ధ్వంసం చేసి చోరీకి పాల్పడ్డ సంఘటనలు జిల్లా ప్రజలను కలవరపరుస్తున్నాయి. ఏటీఎంల వద్ద తారసపడుతున్న అనుమానితులను ప్రశ్నించే భద్రతా సిబ్బంది కరువయ్యారు.
మూసుకున్న నిఘా నేత్రాలు...
జిల్లాలో సుమారు 200 బ్యాంకులు తమ ఖాతాదారుల సౌలభ్యం కోసం ఏటీఎం కేంద్రాలను ఏర్పాటు చేసుకున్నాయి. వీటిల్లో గతంలో ఏర్పాటు చేసిన ఏ ఒక్క ఏటీఎంకు సీసీ కెమెరా లేదు. కొత్తగా ఏర్పాటు చేసుకునే ఏటీఎంలకు మాత్రమే సీసీ కెమెరాలు ఏర్పాటు చే స్తున్నారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) అర్బన్ జిల్లాలో అత్యధికంగా 80 ఏటీఎంలు ఏర్పాటు చేసింది. అలాగే స్టేట్‌బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ (ఎస్‌బీహెచ్) 28 ఏటీఎంలు ఏర్పాటు చేసుకుంది. ఆంధ్రాబ్యాంకు 26 ఏటీఎంలు, ఐసీఐసీఐ బ్యాంకు 15, హెచ్‌డీఎఫ్‌సీ 6, యాక్సిస్ 11, ఇండియన్ బ్యాంకు 5, కరూర్ వైశ్యాబ్యాంక్ 2, కెనరా బ్యాంక్ 5, ఇండస్ ఇండ్ బ్యాంక్ 2, ఇండియన్ ఓవర్‌సిస్ బ్యాంకు 4, ధనలక్ష్మీ 1, బ్యాంక్ ఆఫ్ బరోడా 1, బ్యాంక్ ఆఫ్ ఇండియా 2, యూకో బ్యాంక్ 2, విజయా 1, ఐఎన్‌జీ వైశ్యా బ్యాంక్ 1, సిండికేట్ బ్యాంక్ రెండు, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్‌తో పాటు మరికొన్ని గ్రామీణ బ్యాంకులు కూడా ఖాతాదారులను పెంచుకునే ప్రయత్నంలో భాగంగా ఏటీఎంలు ఏర్పాటు చేసుకున్నాయి. అయితే సగానికి పైగా ఏటీఎంలో సీసీ కెమెరాలు లేకపోవడం గమనార్హం.
డోర్‌లాక్‌లపై శ్రద్ధ ఏదీ..?
నగరంలోని పలు ఏటీఎం కేంద్రాలకు డోర్‌లాక్‌లు లేవు. దీంతో వినియోగదారులు గుంపులుగా లోపలకు వెళుతున్నారు. ఏసీలు పనిచేయక సర్వర్లు అప్పుడప్పుడూ మొరాయించడంతో వినియోగదారులకు అవస్థలు తప్పడం లేదు. ఏటీఎం లోపలకు వెళ్ళాలంటే ముందుగా ఏటీఎం కార్డుతో డోర్ లాక్ తెరుచుకునే విధానం ప్రవేశపెట్టిన బ్యాంకులు.. రాన్రానూ వాటిని తొలగించాయి. అలారంలు ఉన్నప్పటికీ, అవికూడా సరిగ్గా పనిచేయడం లేదని తెలుస్తోంది.
బ్యాంకర్లకు క్లాసు తీసుకున్న అర్బన్ ఎస్పీ
ఇటీవల గుంటూరు లక్ష్మీపురం రోడ్డులో వరుసగా చోటుచేసుకున్న భారీ చోరీల నేపథ్యంలో ఇప్పటికే బ్యాంకర్లతో అర్బన్ ఎస్పీ గోపీనాథ్ జెట్టి సమావేశమయ్యారు. ప్రధానంగా బ్యాంకు ఆవరణలతో పాటు సంబంధిత ఏటీఎంల వద్దకూడా సీసీ కెమెరాలు, అలారంలు, సెక్యూరిటీ సిబ్బంది విధిగా ఉండాలని చెప్పారు. వారంలోగా వీటన్నింటినీ మార్చుకోవాలని లేదంటే, తాము సూచించిన నియమాలు అమలయ్యే వరకు లావాదేవీలు నిలిపివేయాల్సి ఉంటుందని హెచ్చరించారు. అయితే, పోలీస్ హెచ్చరికలను కొన్ని బ్యాంకులు మాత్రమే పాటించగా చాలావరకు బేఖాతరు చేయడంపై ఎస్పీ సీరియస్‌గా ఉన్నారు. బ్యాంకు ఏటీఎంల దొంగతనాలపై ప్రజల్లో చైతన్యం కోసం డాక్యుమెంటరీలును చిత్రించి సీడీలు విడుదల చేశారు. సినిమా థియేటర్‌లలో కూడా డాక్యుమెంటరీ ప్రసారాలు చేయాలని పోలీసులు కోరి సీడీలు పంపిణీ చేశారు. బ్యాంకర్లు ఇప్పటికైనా స్పందించి ఏటీఎంల భద్రతపై ప్రత్యేక శ్రద్ధచూపాలని పోలీసులు, ప్రజలు కోరుతున్నారు.
Advertisement
Advertisement