
నిందితుని ఇంట్లో స్థానికుల నుంచి వివరాలు సేకరిస్తున్న పోలీసులు
రైలుపేటలో ఓ కీచక ప్రధానోపాధ్యాయుడు పదో తరగతి విద్యార్థినిపై లైంగికదాడికి పాల్పడ్డాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపుతానంటూ బెదిరించడంతో ఐదురోజులుగా రక్తస్రావంతో బాధపడుతున్నప్పటికి బాధితురాలు మిన్నకుండిపోయింది. తల్లి శనివారం నిలదీయడంతో ఆ బాలిక బోరున విలపించింది.
సోమవారం రాత్రి స్థానికులకు విషయం తెలియడంతో పాఠశాలను ధ్వంసం చేశారు. కీచకుడు పరారయ్యాడు. ఆ మేరకు బాలిక తల్లి పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. వివరాలిలా ఉన్నాయి.. రైలుపేట ఐదో లైనులో జవహర్ భారతి కాన్వెంట్ స్కూల్‌ను అన్నవరపు శ్రీనివాసరావు (50) నడుపుతున్నారు.
అదే ప్రాంతంలో సొంత పాఠశాలలు రెండు ఉన్నాయి. స్కూల్‌లో పదో తరగతి చదివి పబ్లిక్ పరీక్షలు రాస్తున్న ఓ బాలికను మార్చి 26న ఇంటింటికి రావాలని, కష్టమైన ప్రశ్నలు చెబుతానంటూ పిలిచాడు. ఇంటికి వచ్చిన విద్యార్థినిపై లైంగికదాడికి పాల్పడ్డాడు. రక్తస్రావంతో బాధపడుతున్న బాలికను తల్లి గట్టిగా అడ గడంతో సోమవారం మధ్యాహ్నం విషయం చెప్పింది. భర్త చనిపోవడంతో ఉన్న ముగ్గురు పిల్లలను పోషించేందుకు ఆమె పాచి పని చేసి బతికిస్తోంది.
బిడ్డ చెప్పిన మాటవిని తట్టుకోలేక బాధితురాలి తల్లి పెద్దలకు వివరించి భోరున విలపించింది. దీంతో అగ్రహించిన స్థానికులు పాఠశాలను ధ్వంసం చేశారు. కీచకుడు శ్రీనివాసరావును మందలించేందుకు యత్నించగా.. కుటుంబ సభ్యులతోసహా పరారయ్యాడు. పట్టణ సీఐ రామారావు, ఎస్‌ఐ బ్రహ్మం సంఘటన స్థలానికి వెళ్లి పరిస్థితిని సమీక్షించారు.