ఒంగోలు ఒన్‌టౌన్, న్యూస్‌లైన్ : ఉద్యోగులకు నగదు ప్రమేయం లేని వైద్య సేవలు అందించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఆరోగ్య కార్డుల్లో ఉద్యోగుల వివరాలు నమోదు కార్యక్రమం జిల్లాలో నత్తనడకన సాగుతోంది. హెల్త్‌కార్డుల మంజూరుకు సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాల్లో స్పష్టత లోపించింది. హెల్త్‌కార్డుల కోసం వివరాలు నమోదు చేసుకునేందకు ఉద్యోగులు ముందుకు రావడం లేదు. ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు నగదు ప్రమేయం లేని వైద్యం కోసం హెల్త్‌కార్డులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. జిల్లాలో 35 వేల మంది ప్రభుత్వ ఉద్యోగులు, 22 వేల మంది పెన్షనర్లు, సుమారు 17 వేల మంది ఉపాధ్యాయులున్నారు. వీరందరికీ హెల్త్‌కార్డులు వర్తిస్తాయి. హెల్త్‌కార్డుల్లో వైద్య పరిమితిని రూ. 2 లక్షలకు కుదిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడాన్ని ఉద్యోగులందరూ వ్యతిరేకిస్తున్నారు. ఆ పరిమితిని తొలగించమని డిమాండ్ చేస్తున్నారు. దీనిపై ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన రాకపోవడంతో ఉద్యోగులు మాత్రం హెల్త్‌కార్డుల కోసం వివరాల నమోదుకు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. పెన్షనర్లు మాత్రం హెల్త్‌కార్డుల కోసం వివరాల నమోదులో బిజీగా ఉన్నారు.
మార్గదర్శకాలపై అయోమయం
హెల్త్‌కార్డుల జారీకి సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల్లో స్పష్టత లోపించడంతో అంతా గందరగోళంగా ఉంది. ఉద్యోగులు, ఉపాధ్యాయుల కోసం సంబంధిత డీడీవో (డ్రాయింగ్ అండ్ డిస్బర్సింగ్ ఆఫీసర్)లకు స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేయాల్సి ఉండగా వీరికి ఇంతవరకు ఎటువంటి ఉత్తర్వులు అందలేదు. ఈ హెల్త్‌కార్డులతో ఏ వైద్యశాలలో వైద్యం చేయించుకోవాలో నిర్దేశించలేదు. ఈ నెల 25 నాటికి అందరికీ తాత్కాలిక హెల్త్‌కార్డులు జారీచేస్తామని ప్రభుత్వం చెప్పినప్పటికీ ఆచరణలో అమలయ్యే పరిస్థితి కనిపించడంలేదు. హెల్త్‌కార్డుల కోసం ఆన్‌లైన్‌లో వివరాలు నమోదు చేసుకునేందుకు ప్రయత్నిస్తుంటే ఆసలు వెబ్‌సైట్ ఓపెన్ కావడం లేదు. పెన్షనర్లుకు సంబంధించి వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకునేందుకు పీపీవో (పెన్షన్ పేమెంట్ ఆర్డర్) నంబర్ తప్పనిసరి. అయితే పెన్షనర్ల పీపీవో నంబర్లన్నీ వెబ్‌సైట్‌లో ముందుగా నమోదు చేయకపోవడంతో ఇబ్బంది తలెత్తింది. అదేవిధంగా మండలాల్లో, హైస్కూళ్లలో ఉపాధ్యాయులందరి వివరాలు వెబ్‌సైట్‌లో పొందుపరచకపోవడంతో వారికి ఇబ్బందులు తప్పడంలేదు. ఈ విషయంలో ప్రభుత్వం కేవలం ఉత్తర్వులు జారీ చేసి వివరాలను గాలికి ఒదిలేయడంతో ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నారు.
పథకం వర్తించేవారు వీరు..
రాష్ట ప్రభుత్వ రెగ్యులర్ ఉద్యోగులు, రాష్ట్రీకరణ (ప్రొవిన్సలైజ్) చేయబడిన స్థానిక సంస్థల ఉద్యోగులు, సర్వీస్ పెన్షనర్లు, ఫ్యామిలీ పెన్షనర్లు, పునర్నియామకం పొందిన సర్వీసు పెన్షనర్లు, ఆధారిత కుటుంబ సభ్యులు హెల్త్‌కార్డులకు అర్హులు. జీవనం కోసం ఉద్యోగిపై ఆధారపడిన తల్లిదండ్రులు (దత్తత లేదా జన్మనిచ్చిన వారిలో ఒకరు), పురుష ఉద్యోగి విషయంలో చట్టబద్ధమైన భార్య, మహిళా ఉద్యోగి విషయంలో ఆమె భర్త, ఫ్యామిలీ పెన్షనర్ల ఆధారితులు, నిరుద్యోగులైన అవివాహిత, వితంతు, విడాకులు పొందిన ఒంటరి కుమార్తెలు, 25 ఏళ్లలోపు నిరుద్యోగ కుమారులు, ఉద్యోగానికి పనికిరాని వైకల్యంతో బాధపడుతున్న పిల్లలు అర్హులు.
ఇన్ పేషెంట్ చికిత్స
ఈ పథకం ద్వారా జాబితాలో పేర్కొనబడిన వ్యాధులకు నెట్‌వర్క్ హాస్పిటల్స్‌లో ఇన్‌పేషెంట్ చికిత్స అందిస్తారు. హాస్పిటల్స్ జాబితా కోసం ఠీఠీఠీ.్ఛజిజ.జౌఠి.జీ వెబ్‌సైట్ చూడవచ్చు. శస్త్రచికిత్స అనంతర వైద్యం కూడా అందిస్తారు. ఆరోగ్యశ్రీ హెల్త్‌కేర్ ట్రస్టుకు సంబంధించిన ఆరోగ్యమిత్ర రోగికి అవసరమైన సహకారం అందిస్తారు. నెట్‌వర్క్ హాస్పిటల్ సిబ్బంది ఒకరు సంధానకర్తగా వ్యవహరిస్తారు.
చికిత్స ఖర్చు
ఒక్కసారికి రూ.2 లక్షల వరకు ఖర్చు చేస్తారు. ఈ విధంగా ఎన్నిసార్లు అయినా చికిత్స పొందవచ్చు. ఏదైనా సందర్భంలో చికిత్సకు అయ్యే ఖర్చు రూ.2 లక్షలు దాటినప్పటికీ చికిత్స కొనసాగుతుంది. 2 లక్షలు దాటిందని చికిత్స చేసేందుకు నిరాకరించే అవకాశం హాస్పిటల్స్‌కు లేదు. ఇంతకు ముందే పేర్కొన్న ప్యాకేజీ రేట్లలో చికిత్స ఖర్చురూ.2 లక్షలకు మించి పేర్కొని ఉంటే అటువంటి చికిత్సలకు రూ.2 లక్షల వరకు మాత్రమే అనే నిబంధన వర్తించదు. రూ.2 లక్షల నిబంధనను తొలగించి పరిమితి లేని వైద్యం అందించాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు.
నమోదు చేసే విధానం
దరఖాస్తులను ఈ-ఫారం ద్వారా ఆన్‌లైన్‌లో పంపించాలి. దీని కోసం www.ehf.gov.in వైబ్‌సైట్ ద్వారా పంపించాలి. ప్రతి ఉద్యోగికి ట్రెజరీ ఎంప్లాయి కోడ్ యూజర్ ఐడీగా ఉంటుంది. పాస్‌వర్డ్‌ను డీడీవోలు ఇస్తారు. పాస్‌వర్డ్ ప్రకారం వెబ్‌సైట్‌లోకి ప్రవేశించాలి. ఉద్యోగి కావాలంటే పాస్‌వర్డ్ మార్చుకోవచ్చు. వెబ్‌సైట్‌లోకి ప్రవేశించిన తరువాత తప్పులు లేకుండా వివరాలు నమోదు చేయాలి. పూర్తి సమాచారానికి ఉద్యోగే బాధ్యత వహించాలి. నమోదు పూర్తయిన తరువాత ప్రింట్ తీసుకుని సరిచూసుకోవాలి. తప్పులుంటే సరిచేసి మళ్లీ ప్రింట్ తీసుకోవాలి.
ఈ-ఫారంతో జత చేయాల్సినవి..
పైన తెలిపిన ప్రింట్‌పై సంతకం చేసి స్కాన్ చేసి ఈ-ఫారానికి జత చేయాలి. ఉద్యోగి మరియు కుటుంబ సభ్యులందరి పాస్‌పోర్టు సైజ్ డిజిటల్ ఫొటోలు జతపరచాలి. ఉద్యోగి సేవా పుస్తకం (పాత సేవా పుస్తకం అయితే 1, 2 పేజీలు, కొత్త సేవా పుస్తకం అయతే 4, 5 పేజీలు) స్కాన్ చేసి జతపరచాలి. ఆధార్ కార్డు లేదా ఆధార్ నమోదు రసీదు జతపరచాలి. ఈ-ఫారంకు ఈ పత్రాలన్నీ జతపర్చి ఆన్‌లైన్‌లో సమర్పించాలి. ఒక్కసారి ఆన్‌లైన్‌లో సమర్పించిన తరువాత (తిరస్కరించబడితే తప్ప) తిరిగి మార్పులు చేసుకునే అవకాశం లేదు. దరఖాస్తు అంగీకరించిన, లేదా తిరస్కరించిన విషయం ఎస్‌ఎంఎస్ ద్వారా తెలుస్తుంది.
నత్తనడకన హెల్త్‌కార్డుల నమోదు ప్రక్రియ
Published Mon, Nov 25 2013 6:43 AM | Last Updated on Tue, Oct 9 2018 7:32 PM
Advertisement
Advertisement