భారీ వర్షం.. ట్రాఫిక్ అతలాకుతలం
ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా రాత్రి వరకు కురుస్తూనే ఉన్న వర్షం వల్ల రాష్ట్ర రాజధాని నగరంలో ట్రాఫిక్ పరిస్థితి అస్తవ్యస్తంగా మారింది.
ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా రాత్రి వరకు కురుస్తూనే ఉన్న వర్షం వల్ల రాష్ట్ర రాజధాని నగరంలో ట్రాఫిక్ పరిస్థితి అస్తవ్యస్తంగా మారింది. కేవలం ఒకటి రెండు కిలోమీటర్ల దూరం వెళ్లడానికే దాదాపు గంట సమయం పట్టిందంటే పరిస్థితి అర్థమవుతుంది. బస్సులు, కార్లు, ద్విచక్ర వాహనాలు.. వేటిలో వెళ్లినా ఇదే పరిస్థితి.
ముఖ్యంగా నగరంలోని పలు ప్రాంతాల్లో ఇప్పటికే రోడ్లు అస్తవ్యస్తంగా ఉండటంతో చిన్న చినుకు పడితే చాలు.. నీళ్లు ఎక్కడికక్కడ నిల్వ ఉండిపోతున్నాయి. నిల్వ ఉన్న నీళ్లలోంచి వెళ్లడానికి వాహన చోదకులు ఇబ్బందులు పడుతుండటం, మరికొన్ని ప్రాంతాల్లో బాటిల్ నెక్స్ కారణంగా ట్రాఫిక్ జామ్ మరింత ఎక్కువ ఇబ్బంది పెడుతోంది. బుధవారం నాటి వర్షానికి జూబ్లీ హిల్స్, బంజారాహిల్స్, మాసాబ్ ట్యాంక్, లక్డీకా పుల్, ఆబిడ్స్, కోఠీ, మలక్ పేట, మూసారాం బాగ్, దిల్ సుఖ్ నగర్ లాంటి ప్రాంతాల్లో పరిస్థితి అత్యంత దారుణంగా తయారైంది. మెట్రో రైలు పనులు జరుగుతున్న ప్రాంతాల్లో అయితే, సగానికి పైగా రోడ్డును మెట్రో రైలు కోసం ఆక్రమించుకోవడం, మిగిలిన కొద్దిపాటి రోడ్డు అప్పటికే ఎంతో కొంత ఆక్రమణలకు గురికావడంతో ఆ మధ్య ఉన్న కొద్దిపాటి ఖాళీ లోంచి వాహనాలు వెళ్లలేక, ఆగలేక నానా అవస్థలు పడాల్సి వస్తోంది. మామూలు రోజుల్లోనే ఇలాంటి ప్రాంతాల్లో సమస్య ఉందంటే, ఇక వర్షం వచ్చినప్పుడు అసలు చెప్పనక్కర్లేదు.
అమీర్ పేట, పంజాగుట్ట లాంటి ప్రాంతాలు కూడా వర్షం తాకిడికి విపరీతమైన రద్దీతో నిండిపోయాయి. మామూలు రోజుల్లో గంట - గంటన్నర ప్రయాణంతోనే గమ్యాన్ని చేరుకునే నగర జీవులు వర్షం పడిన రోజుల్లో మూడు నాలుగు గంటలు గడిస్తే తప్ప గమ్యాన్ని చేరుకోలేని పరిస్థితి కనిపిస్తోంది.
ఒకవైపు వర్షం, మరోవైపు మునిసిపల్ కార్మికులు సమ్మెలో ఉండటంతో పలు ప్రాంతాల్లో రోడ్డు మీద చెత్తకుప్పలు పేరుకుపోయాయి. ట్రాఫిక్ ఆగిపోయినప్పుడు తప్పనిసరిగా వాటి పక్కన ఉండేవారి బాధలు ఇక వర్ణనాతీతం. వర్షాలకు ఇలాంటి పరిస్థితులు కూడా తోడైతే వ్యాధులు వ్యాపిస్తాయేమోనన్న భయాందోళనలు సామాన్య ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి.
నగర అవసరాలకు తగినట్లుగా రోడ్లు విస్తరించడం, గోతులు పడినప్పుడు రీ కార్పెటింగ్ మాత్రమే చేసి వదిలేయకుండా మొత్తం రోడ్డు వేయడం వల్ల ప్రయోజనం ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు. రీ కార్పెటింగ్ చేసినప్పుడు మళ్లీ వారం పది రోజుల్లో వర్షాలు పడటం, మళ్లీ అక్కడ కూడా గుంతలు ఏర్పడటం సర్వసాధారణంగా మారింది. గతంలో ఒకసారి మాత్రం ముఖ్యమంత్రి నగర రోడ్ల పరిస్థితి మీద జీహెచ్ఎంసీ అధికారులతో సమీక్షించారు. తర్వాత మళ్లీ ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా ఉంది. ఈ రోడ్లకు ఎన్నాళ్లకు మోక్షం వస్తుందో ఆ పైవాడికే ఎరుక..