ప్రత్యేక రాష్ర్ట సాధనలో అగ్రభాగాన నిలిచిన కేసీఆర్‌కు కందుకూరు మండలంతో ప్రత్యేక అనుబంధం ఉంది. ఆయన చేపట్టిన ఉద్యమానికి పునాది పడింది ఇక్కడే అని చెప్పొచ్చు.
కందుకూరు, న్యూస్‌లైన్: ప్రత్యేక రాష్ర్ట సాధనలో అగ్రభాగాన నిలిచిన కేసీఆర్‌కు కందుకూరు మండలంతో ప్రత్యేక అనుబంధం ఉంది. ఆయన చేపట్టిన ఉద్యమానికి పునాది పడింది ఇక్కడే అని చెప్పొచ్చు. 1996లో టీడీపీ హయాంలో రవాణా శాఖ మంత్రిగా ఉన్నప్పుడు దాసర్లపల్లి సమీపంలో 30 ఎకరాల విస్తీర్ణంలో వ్యవసాయ భూమిని కొనుగోలు చేశారు. అందులో ఫాంహౌస్ నిర్మించడంతో పాటు ఉసిరి, మామిడి, కొబ్బరి తోటలను సాగు చేశారు.
కొంతకాలం హరీష్‌రావు సైతం ఫాం హౌస్ నిర్వహణ బాధ్యతలు చేపట్టినట్లు గ్రామస్తులు గుర్తు చేసుకుంటున్నారు. 2001లో టీడీపీకి రాజీనామా చేసిన తదనంతరం కేసీఆర్ అత్యధికంగా ఈ ఫాంహౌస్‌లోనే విడిది చేశారని, పార్టీ స్థాపించే వరకూ మేధావులు, నాయకులతో కలిసి చర్చలు జరిపారని స్థానికులు పేర్కొంటున్నారు. దాసర్లపల్లికి బస్సు సౌకర్యం కల్పించడంతో పాటు దేవేందర్‌గౌడ్‌తో కలిసి ఈ ప్రాంతంలో అభివృద్ధి పనులు చేపట్టారని గుర్తు చేసుకుంటున్నారు. పార్టీ స్థాపించిన తర్వాత ఫాంహౌస్‌ను విక్రయించారని పేర్కొంటున్నారు. ఉద్యమానికి పునాది పడింది ఇక్కడి నుంచే కావడం గర్వంగా ఉందంటున్నారు.