
సాక్షి, అమరావతి: పరిపాలన వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దు బిల్లులపై దాఖలైన పిటిషన్లపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రభుత్వ నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై గురువారం న్యాయస్థానం విచారణ జరిపింది. వ్యాజ్యాలపై అత్యవసరంగా విచారణ జరపాలన్న పిటిషనర్ వాదననను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జితేంద్రకుమార్ మహేశ్వరి, న్యాయమూర్తి జస్టిస్ ఆకుల వెంకట శేషసాయిలతో కూడిన ధర్మాసనం తిరస్కరించింది. సంబంధిత బిల్లులపై చట్టసభల్లో ఇంకా చర్చ కొనసాగుతున్నందున ప్రస్తుతం విచారణ అవసరం లేదని తేల్చిచెప్పింది. అలాగే ప్రభుత్వ నిర్ణయంపై మధ్యంతర ఉత్వర్వులు ఇవ్వాలన్న పిటిషనర్ల వాదనలతో ఏకీభవించని ధర్మాసనం... మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు నిరాకరించింది. తదుపరి విచారణను ఫిబ్రవరి 26కు వాయిదా వేసింది.
మూడు రాజధానుల బిల్లు మనీ బిల్లుగా పిటిషనర్ తరఫు న్యాయవాది అశోక్ బయల్ వాదనలు వినిపించారు. మనీ బిల్ కాదని ప్రభుత్వం తరపు న్యాయవాది వాదించారు. బిల్లు ఏ దశలో ఉందని న్యాయమూర్తి అడగ్గా.. శాసనమండలిలో సెలెక్ట్ కమిటీకి పంపుతూ నిర్ణయం జరిగిందని అడ్వకేట్ జనరల్ సమాధానమిచ్చారు. శాసనమండలిలో బిల్లు ఆమోదం పొందలేదు కాబట్టి ఈ సమయంలో విచారణ అవసరం లేదని ధర్మాసనం పేర్కొంది. కార్యాలయాల తరలింపుకు ప్రభుత్వం మౌఖిక ఆదేశాలు ఇస్తోందని, దాన్ని ఆపేలా ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టును పిటిషనర్ తరపు న్యాయవాది అశోక్ బయల్ కోరారు. ప్రభుత్వం అలా చేసినట్టు నిరూపిస్తే దానికి ప్రభుత్వాన్ని, సంబంధించిన అధికారులను బాద్యులను చేస్తామని కోర్టు తెలిపింది. ప్రముఖ న్యాయవాది ముకుల్ రోహిత్గి రాష్ట్ర ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించారు. ఎంపీలు విజయసాయి రెడ్డి, కేశినేని నాని కోర్టుకు హాలుకు వచ్చి వాదనలు ఆలకించారు.