
సాక్షి, అమరావతి: దివంగత మహానేత వైఎస్సార్ లైఫ్ టైం ఎచీవ్‌మెంట్ అవార్డుల ఎంపిక కోసం రాష్ట్ర ప్రభుత్వం హైపవర్ స్క్రీనింగ్ కమిటీ ఏర్పాటు చేసింది. ఈ మేరకు ప్రభుత్వం సోమవారం జీవో జారీ చేసింది. ప్రజా సేవా కార్యక్రమాలు చేసేవారికి అవార్డుల ఎంపికలో ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభుత్వం జీవోలో పేర్కొంది.
ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి నేతృత్వంలో కమిటీ సభ్యులుగా సలహాదారులు దేవుపల్లి అమర్, కె.రామచంద్రమూర్తి, జీవీడీ కృష్ణమోహన్, ఐఏఎస్ అధికారులు ప్రవీణ్ ప్రకాష్, కె.దమయంతి, ఉషారాణి, కోన శశిధర్, జేవీ మురళి, ఐఐఎస్ అధికారి టి.విజయకుమార్ రెడ్డి నియమితులయ్యారు. ప్రతి ఏడాది ఆగస్టు 15, జనవరి 26వ తేదీన వైఎస్సార్ లైఫ్ టైం ఎచీవ్‌మెంట్ అవార్డులు ప్రదానం చేయనున్నారు. అవార్డు కింద రూ.10 లక్షల నగదు, జ్ఞాపిక అందించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది.