రైతుకేదీ ఊరట | How many schemes for farmers | Sakshi
Sakshi News home page

రైతుకేదీ ఊరట

Published Fri, Dec 26 2014 2:43 AM | Last Updated on Sat, Sep 2 2017 6:44 PM

ప్రకృతి వైపరీత్యాలతో నష్టపోయే రైతులను ఆదుకునేందుకు ఎన్ని పథకాలు ఉన్నా ఆచరణలో ఫలితం ఇవ్వడంలేదు.

కడప అగ్రికల్చర్ : ప్రకృతి వైపరీత్యాలతో నష్టపోయే రైతులను ఆదుకునేందుకు ఎన్ని పథకాలు ఉన్నా ఆచరణలో ఫలితం ఇవ్వడంలేదు. పైగా బీమా కంపెనీలకు చెల్లించే ప్రీమియం రైతలకు అదనపు భారం అవుతోంది. నష్టం జరిగితే బీమా చెల్లించాల్సిన కంపెనీలు ఏళ్ల తరబడి స్పందించడంలేదు. ఫలితంగా పంట నష్టపోరుున రైతులు అప్పుల పాలవుతున్నారు. బీమా, ఇన్‌పుట్ సబ్సిడీ సొమ్ము అందితే కొంతలోకొంత ఊరట లభిస్తుంద నుకున్న రైతులకు నాలుగేళ్లుగా ఎదురుచూపులే మిగిలారుు.
 
 2011 నుంచి ఇప్పటి వరకు జిల్లాకు ఇన్‌ఫుట్ సబ్సిడీ, బీమా కింద రూ.93.01 కోట్లు రైతులకు రావాల్సి ఉంది. రైతులను ఆదుకోవాల్సిన ప్రభుత్వాలు చేష్టలుడిగి చూస్తున్నాయి. ఏటా పంటల పరిస్థితులు ఏలా ఉంటాయో తెలియని రైతన్న బీమా కంపెనీ కలిపించిన వెసులుబాటును ఉపయోగించుకుంటూ సాగు చేసిన పంటలకు బీమా ప్రీమియం చెల్లిస్తున్నారు. కానీ ఏ సంవత్సరం కూడా రైతుకు సక్రమంగా బీమా సొమ్ము ఇచ్చిన దాఖలాలు లేవని
 రైతు సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
 
 అష్టకష్టాలు పడి ప్రీమియం చెల్లించినా...:
 బీమా ప్రీమియం చెల్లించేందుకు గడువును కంపెనీ సమయం తక్కువగా విధించినా రైతులు అష్టకష్టాలు పడి వివిధ బ్యాంకులకు, మీ-సేవ, ఈ- సేవ కేంద్రాలకు వెళ్లి తగిన మొత్తం చెల్లించినా కూడా బీమా సకాలంలో రాకపోవడంతో నష్టపోయిన పంటల స్థానంలో మళ్లీ పంటల సాగు చేసుకోలేక పోతున్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నా పట్టించుకున్న పాపాన పోలేదు.
 
 2011 నుంచి ఇప్పటి వరకు ఇన్‌ఫుట్ సబ్సిడీ, బీమా రూ.93.01 కోట్లు రావాల్సి ఉంది...
 2011 నుంచి ఇప్పటి వరకు అకాల వర్షాలు, వర్షాభావ పరిస్థితులు, ఈదురు గాలులకు పంటలు దెబ్బతిన్నాయి. అప్పటి నుంచి జిల్లాకు రూ. 93.01 కోట్ల బీమా రావాల్సి ఉన్నా ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోలేదు. జిల్లాకు చెందిన అధికార పార్టీకి చెందిన శాసనమండలి వైస్‌చైర్మన్ ఎస్వీ సతీష్‌రెడ్డిగానీ, ప్రభుత్వ విప్ మేడా మల్లికార్జునరెడ్డిగానీ పట్టించుకున్న దాఖలాలు లేవని రైతన్నలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై శాసనసభలో విపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పలుసార్లు ప్రశ్నించినా ముఖ్యమంత్రి గానీ, సంబంధిత మంత్రిగానీ నోరు మెదపలేదని రైతు సంఘాలు విమర్శిస్తున్నాయి.
 
 అలాగే 2012 ఖరీఫ్‌కు సంబంధించి బీమా రూ.52 కోట్లకు గాను రూ.24 కోట్లు మాత్రమే మంజూరైంది. అది కూడా రైతుల ఖాతాలకు చేరలేదు. అదేవిధంగా 2012-13 రబీకి గాను రూ. 8.72 కోట్లు బీమా సొమ్ములు రైతులకు చేరాల్సి ఉండగా, 2013 ఖరీఫ్‌కు రూ. 52.33 కోట్లు మంజూరైంది.
 
  ఇప్పటివరకు ఒక్క దమ్మిడి కూడా రైతులకు ప్రభుత్వం అందించిన పాపాన పోలేదు. అలాగే ఉద్యాన పంటలకు సంబంధించి 2011 నుంచి ఇప్పటివరకు 3.22 కోట్లు పంట నష్టం సంభవించింది. దానికి సంబంధించి ఉద్యాన అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి నష్ట నివేదిక పంపారు. కానీ, ఇప్పటివరకు సొమ్ములు వచ్చిన దాఖలాలు లేవు. అధికార పార్టీ ప్రజాప్రతినిధులు కూడా ఉండి కూడా జిల్లాకు ఒరిగింది ఏమిలేదని రైతు సంఘాల నాయకులు బాహాటంగా విమర్శిస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement