
ఎలా తినాలి?
సాక్షి, కడప : సంక్షేమ హాస్టళ్ల విద్యార్థుల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని గొప్ప లు చెబుతున్న ప్రభుత్వం ఆచరణలో ఘోరంగా విఫలమైంది. ప్రస్తుతం హస్టల్ విద్యార్థులకు నాసిరకంగా ఉన్న చౌక బియ్యంతో వండిన అన్నం అందిస్తున్నారు. ఈ అన్నం తినలేక విద్యార్థులు అర్ధాకలితో అలమటిస్తున్నారు. నాణ్యమైన సన్న బియ్యంతో (జిలకర మసూరి) హాస్టల్ విద్యార్థులకు ఆహారం అందిస్తామని టీడీపీ సర్కారు ప్రకటించి దాదాపు ఆరు నెలలు అవుతున్నా ఆ దిశగా ఎలాంటి చర్యలు లేవు. ఇప్పటికే లెక్కలేనన్ని హమీలిచ్చి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయిన చంద్రబాబు సర్కారు.. సన్న బియ్యం ఊసెత్తక పోవడం చూస్తుంటే దాటవేట ధోరణి అవలంబిస్తున్నట్లు తెలుస్తోంది.
రాష్ర్టంలోని అన్ని హాస్టళ్లతో పాటు జిల్లాలోని హస్టళ్లలో చదువుతున్న విద్యార్థులు సన్న బియ్యంతో తయారు చేసిన ఆహారం కోసం ఎదురు చూస్తున్నారు. జిల్లాలో 143 ఎస్సీ హాస్టళ్లు, 60 బీసీ హాస్టళ్లు, 10 ఎస్టీ హాస్టళ్లు ఉన్నాయి. ఇందులో సమారు 14 వేల మందికి పైగా విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. వీరందరికి ప్రస్తుతం ప్రభుత్వం సరఫరా చేసే రేషన్ బియ్యంతోనే వంట వండుతున్నారు. రేషన్ బియ్యం కూడా ఒక్కో నెల ఒక్కో క్వాలిటీతో వస్తాయి. బాగోలేని బియ్యాన్నే హాస్టళ్లకు తరలిస్తున్నారు. ఇలాంటి బియ్యంతో వండిన అన్నం తినలేక చాలా మంది విద్యార్థులు పస్తులుంటూ రోగాలు తెచ్చుకుంటున్నారు. మరికొందరు ఇళ్లకు పారిపోతున్నారు. ఈ సమస్యపై ప్రభుత్వం ఎంత త్వరగా దృష్టి సారిస్తే అంత మంచిదని వార్డెన్లు కోరుతున్నారు.