
కాయ్ రాజా... కాయ్...!
నంద్యాల ఉప ఎన్నిక ఫలితంపై భారీ స్థాయిలో పందేలు సాగుతున్నాయి.
ప్రభుత్వ వ్యతిరేక ఓటు పోటెత్తిందని, దీనివల్ల వైఎస్సార్‌సీపీ గెలుపు ఖాయమని ఆ పార్టీని బలపరిచేవారు విశ్వసిస్తున్నారు. ప్రభుత్వ అనుకూల ఓటింగ్ వల్లే పోలింగ్ పెరిగిందని టీడీపీ అనుకూలవాదులు విశ్లేషించుకుంటున్నారు. పోలింగ్ శాతం పెరిగినప్పుడల్లా అధికార పక్షాలకు వ్యతిరేక తీర్పు వచ్చిందని, పైగా నంద్యాలలో జగన్ అనుకూల ఓటింగ్ జరిగినందున తమదే విజయమని వైఎస్సార్‌సీపీ శ్రేణులు ధీమాతో అధిక మొత్తంలో పందేలకు దిగుతున్నాయి.
రాయలసీమతోపాటు గుంటూరు, కోస్తా జిల్లాల్లో భారీగా బెట్టింగులు సాగుతున్నాయి. ‘‘వైఎస్సార్‌సీపీ గెలుస్తుందంటూ వైఎస్సార్ జిల్లాకు చెందిన ఒక వ్యాపారి బుధవారం రూ. 15 లక్షలు పందెం కాశారు. ఆంధ్రప్రదేశ్‌లోనే కాకుండా హైదరాబాద్‌లో కూడా నంద్యాల ఎన్నిక ఫలితంపై తీవ్ర స్థాయిలో పందేలు సాగుతున్నాయి. రాయలసీమ, కోస్తా జిల్లాల నుంచి వచ్చి హైదరాబాద్‌లో స్థిరపడినవారే కాకుండా తెలంగాణకు చెందినవారు కూడా చాలామంది వైఎస్సార్‌సీపీ అభ్యర్థి విజయం సాధిస్తారంటూ బుధవారం పందేలు కాశారు. టీడీపీ తరఫున పందేలకు వస్తున్న వారిలో కృష్ణా, గుంటూరు జిల్లాల వారే ఎక్కువగా ఉన్నారు.
వైఎస్సార్‌సీపీ గెలుస్తుందంటూ కూకట్‌పల్లికి చెందిన ఒక పారిశ్రామికవేత్త కృష్ణా జిల్లాకు చెందిన వ్యాపారితో రూ. 10 లక్షలు పందెం కాశారు. పోలింగ్ సరళిని సొంతంగా అంచనా వేయడంతోపాటు కచ్చితమైన విశ్లేషణ కోసం చాలామంది మీడియా ప్రతినిధులతోనూ, ఇతరత్రా వాకబు చేస్తున్నారు. ఒక నిర్ధారణకు వచ్చిన తర్వాత పందేలకు దిగుతున్నారు. పోలింగ్ తర్వాత వైఎస్సార్‌సీపీకి అనుకూలంగా పందేలు కాచే వారి సంఖ్య ఎక్కువైంది. అందుకే రూపాయికి రూపాయన్నర రేటు నడుస్తోంది..’’ అని ఈ వ్యవహారాల్లో తలపండిన ఒక వ్యాపారి ’సాక్షి’కి తెలిపారు.