ప్రభుత్వం పింఛనుదారులకు మొండిచేయి చూపింది. రైతు, డ్వాక్రా రుణమాఫీ మాదిరిగానే పింఛన్ల పంపిణీలోనూ కోత పెట్టింది.
మచిలీపట్నం : ప్రభుత్వం పింఛనుదారులకు మొండిచేయి చూపింది. రైతు, డ్వాక్రా రుణమాఫీ మాదిరిగానే పింఛన్ల పంపిణీలోనూ కోత పెట్టింది. ఖర్చు తగ్గించుకోవటం, లేక ఇతరత్రా కారణాలు చూపి అర్హుల జాబితా నుంచి మూడొంతుల మందికి కోత పెడుతూ నిర్ణయం తీసుకుంది. గత ఏడాది అక్టోబరు, నవంబరుల్లో జరిగిన జన్మభూమి - మా ఊరు కార్యక్రమంలో వివిధ రకాల పింఛన్ల కోసం దరఖాస్తులు వచ్చాయి. జిల్లా వ్యాప్తంగా జన్మభూమి కమిటీ సభ్యులు పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకున్నవారి వివరాలను పరిశీలించి జిల్లా వ్యాప్తంగా 41 వేల 927 మందిని అర్హులుగా గుర్తించారు.
ఈ జాబితాలో 13 వేల 203 మందికి మాత్రమే పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ఇటీవల తెగేసి చెప్పింది. పాత జాబితా కాకుండా అర్హుల జాబితాను మరోసారి తయారుచేసి పంపాలని జన్మభూమి కమిటీ సభ్యులకే ఈ బాధ్యతలను ప్రభుత్వం అప్పగించింది. దీంతో జన్మభూమి కమిటీ సభ్యులు కంగుతినాల్సిన పరిస్థితి నెలకొంది. మొదటి జాబితాలో 41 వేల 927 మందికి పింఛన్లు మంజూరు చేస్తున్నట్లు ప్రభుత్వం నెలరోజుల క్రితం ఉత్తర్వులు జారీ చేసిందని, దీంతో అర్హత పొందిన వారి గృహాలకు వెళ్లి ఆ విషయం తెలియజేశామని జన్మభూమి కమిటీ సభ్యులు అంటున్నారు.
ప్రభుత్వం పాత జాబితాలోని మూడొంతుల మంది లబ్ధిదారులకు పింఛను ఇవ్వబోమని, అర్హులను మీరే నిర్ధారించాలని తాజాగా సూచించటంతో తమ పరిస్థితి ముందు నుయ్యి, వెనుక గొయ్యి అన్న చందంగా మారిందని జన్మభూమి కమిటీ సభ్యులు వాపోతున్నారు. జూన్ మూడో తేదీ నుంచి జన్మభూమి కార్యక్రమం జరగనున్న నేపథ్యంలో నూతన జాబితా ప్రకారం అర్హులకు పింఛన్లు మంజూరు చేయాల్సి ఉంది.
మళ్లీ జాబితాల తయారీ...
ప్రభుత్వం మూడో వంతు మందికి మాత్రమే పింఛన్లు మంజూరు చేయనున్నట్లు స్పష్టం చేయడంతో జన్మభూమి కమిటీ సభ్యులు అందుకనుగునంగా జాబితాలను రాసే పనిలో పడ్డారు. టీడీపీకి ఓటు వేసినవారికి, తమ బంధువులు, అనుయాయులు, గ్రామ ప్రముఖులు సిఫార్సు చేసిన వారి పేర్లను మాత్రమే జాబితాలో ఉంచి మిగిలినవి తొలగిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. మచిలీపట్నానికి సమీపంలోని ఓ మండలంలో 470 మంది వివిధ రకాల పింఛన్లు పొందేందుకు అర్హులని ప్రభుత్వానికి సిఫార్సు చేశారు.
తొలుత వీరందరికీ పింఛన్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. అనంతరం వారిలో 240 మందికి మాత్రమే పింఛన్లు ఇస్తామని చెప్పటంతో జన్మభూమి కమిటీ సభ్యులు తమ చిత్తానుసారం జాబితాలు తయారుచేస్తున్నట్లు సమాచారం. దివిసీమలోని ఓ పంచాయతీలో 70 మందికి వివిధ రకాల పింఛన్లు మంజూరయ్యాయి. వాటిలో 37 మందికి మాత్రమే పింఛన్లు ఇస్తామని, ఈ జాబితాను మీరే తయారు చేయాలని జన్మభూమి కమిటీ సభ్యులకు అప్పగించటంతో ఎవరి పేరు తొలగిస్తే ఎలాంటి ఇబ్బందులొస్తాయోనని జన్మభూమి కమిటీ సభ్యులు తలలు పట్టుకుంటున్నారు. జిల్లాలోని అన్ని మండలాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. అర్హులందరికీ పింఛన్లు ఇస్తామని చెప్పిన పాలకులు మాట మార్చి కొంతమందికే అందజేస్తామంటుండటం గమనార్హం.