పురం.. ‘హంగ్’పరం! | hung situation in municipal Election 2014 of Andhra pradesh | Sakshi
Sakshi News home page

పురం.. ‘హంగ్’పరం!

Published Tue, May 13 2014 1:43 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

పురం.. ‘హంగ్’పరం! - Sakshi

పురం.. ‘హంగ్’పరం!

  •  మెజార్టీ మున్సిపాలిటీల్లో ఇదే పరిస్థితి
  •  ఉన్నంతలో కాంగ్రెస్‌కే ఆధిక్యం
  •   మొత్తం 56 స్థానాల్లో 18 చోట్ల మాత్రమే స్పష్టమైన మెజారిటీ
  •   12 స్థానాల్లో కాంగ్రెస్ విజయం, 
  •   మూడింట్లో టీఆర్‌ఎస్ గెలుపు
  •   ఒక్కో మున్సిపాలిటీలో టీడీపీ, బీజేపీ, ఎంఐఎం జయకేతనం
  •   చాలాచోట్ల మెజారిటీకి కొద్ది దూరంలో పార్టీలు.. స్వతంత్రులే కీలకం
  •  
     సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో జరిగిన పురపాలక ఎన్నికల్లో ఓటర్లు ఏ పార్టీకీ స్పష్టమైన మెజారిటీ ఇవ్వలేదు. అత్యధిక పురపాలక సంఘాల్లో హంగ్ ఫలితాలే దర్శనమిచ్చాయి. 33 మున్సిపాలిటీలు, 20 నగర పంచాయతీలు, 3 కార్పొరేషన్లు.. మొత్తం 56 పురపాలక సంఘాల్లో ఎన్నికలు జరిగితే ఓటర్లు 18 చోట్ల మాత్రమే స్పష్టమైన తీర్పు ఇచ్చారు. ఇందులో కాంగ్రెస్  మెజారిటీ  స్థానాలను కైవసం చేసుకుంది. మొత్తం 12 చోట్ల కాంగ్రెస్‌కు స్పష్టమైన మెజారిటీ రాగా, టీఆర్‌ఎస్ మూడు స్థానాల్లో మెజారిటీ సాధించింది. టీడీపీ, బీజేపీ, మజ్లిస్ పార్టీలకు ఒక్కో మున్సిపాలిటీలో స్పష్టమైన మెజారిటీ లభించింది. మిగిలిన 35 మున్సిపాలిటీలు, 3 కార్పొరేషన్ల విషయానికొస్తే వీటిల్లో ఏ ఒక్క పార్టీ మ్యాజిక్ ఫిగర్ దాటలేదు. అయితే కాంగ్రెస్ 14, టీఆర్‌ఎస్ 7, టీడీపీ 6, బీఎస్పీ 1, బీజేపీ 2  మున్సిపాలిటీల్లో అధిక స్థానాలు సాధించి అతి పెద్ద పార్టీలుగా అవతరించాయి. మూడు కార్పొరేషన్ల (నిజామాబాద్, రామగుండం, కరీంనగర్)లోనూ మిశ్రమ ఫలితాలొచ్చాయి. నిజామాబాద్‌లో మొత్తం 50 వార్డులకుగాను కాంగ్రెస్, మజ్లిస్ చెరో 16 స్థానాలను దక్కించుకున్నాయి. ఇక్కడ 10 వార్డుల్లో గెలిచిన టీఆర్‌ఎస్ మూడో స్థానానికి పడిపోయింది. కరీంనగర్‌లో 50 వార్డులకుగాను టీఆర్‌ఎస్ 24 వార్డుల్లో గెలిచి అతి పెద్ద పార్టీగా ఆవిర్భవించింది. ఇక్కడ కాంగ్రెస్ 14 స్థానాలకే పరిమితమైంది. రామగుండ ంలో మాత్రం 50 వార్డుల కుగాను 19 స్థానాలను దక్కించుకున్న కాంగ్రెస్ పెద్ద పార్టీగా ఏర్పడింది.
     
     స్వతంత్రులే కీలకం
     మొత్తం మీద మెజారిటీ మున్సిపాలిటీలలో చైర్మన్ పీఠం సాధించేందుకు స్వతంత్రులు, మిత్రపక్షాల మద్దతు కీలకంగా మారింది. మొత్తం 53 మున్సిపాలిటీల్లో 18 చోట్ల చైర్మన్ పదవి దక్కాలంటే స్వతంత్ర అభ్యర్థుల మద్దతే పార్టీలకు ప్రధానంగా మారింది. అదే సమయంలో ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఉండే ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీల ఓట్లకూ ప్రాధాన్యత లభించనుంది. మెజారిటీకి ఒకటి రెండు ఓట్లు తక్కువ పడిన పక్షంలో ఎక్స్ అఫీషియో సభ్యుల ఓట్లే కీలకమవుతాయి. ఎక్కడ తమ ఓట్లు అవసరమో ఆ మున్సిపాలిటీలనే ఎక్స్ అఫీషియో సభ్యులు తమ ఓటు హక్కు వినియోగించుకోడానికి ఎంపిక చేసుకునే అవకాశం ఉంది. అయితే ఈ నెల 16న సాధారణ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాతే పార్టీల వారీగా ఎక్స్ అఫీషియో సభ్యుల ఓట్లు ఎక్కడెక్కడ కీలకమో స్పష్టం కానుంది. 
     
     ఇదీ పరిస్థితి..
     ఆదిలాబాద్‌లో మొత్తం 36 స్థానాలుంటే.. అత్యధికంగా టీఆర్‌ఎస్‌కు 14 వార్డులు లభించాయి. స్వతంత్ర అభ్యర్థుల మద్దతుతోపాటు, ఎక్స్ అఫీఫియో సభ్యుల ఓట్లతో చైర్మన్ స్థానాన్ని టీఆర్‌ఎస్ కైవసం చేసుకునే అవకాశం ఉంది.
     34 స్థానాలు ఉన్న బెల్లంపల్లిలో కాంగ్రెస్‌కు 14 స్థానాలు వచ్చాయి. మరో నాలుగు సీట్లు ఉంటే కానీ చైర్మన్ స్థానాన్ని పొందే అవకాశం లేదు. ఇక్కడ ఇండిపెండెంట్ అభ్యర్థులు ముగ్గురు మాత్రమే ఉన్నారు. స్వతంత్రుల మద్దతు లభించినా.. ఎక్స్ అఫీషియో సభ్యులు లేదా మరో పార్టీ నుంచి మద్దతు తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది.
     
    •  నిర్మల్‌లో 36 స్థానాలుంటే.. బీఎస్పీకి 16 దక్కాయి. ఇక్కడి ఇద్దరు ఇండిపెండెంట్లు మద్దతుగా నిలిచినా ఎక్స్ అఫీషియో సభ్యుడు లేదా మరో పార్టీ మద్దతు తప్పనిసరి.
    •  కాగజ్‌నగర్‌లో 28 స్థానాలకు టీఆర్‌ఎస్‌కు 13 వచ్చాయి. ఇక్కడ ఆ పార్టీకి మరో రెండు కావాల్సి ఉంది. 10 మంది స్వతంత్రుల్లో ఇద్దరు లేదా ముగ్గురి మద్దతు తప్పనిసరి. 
    •  సిరిసిల్లలో 33 స్థానాలకుగాను టీఆర్‌ఎస్‌కు 15 వచ్చాయి. స్వతంత్రుల మద్దతు లభిస్తే మున్సిపాలిటీని దక్కించుకోవచ్చు.
    •  31 స్థానాలున్న కోరుట్లలో కాంగ్రెస్ 13 చోట్ల విజయం సాధించగా, ముగ్గురు ఇండిపెండెంట్లు ఉన్నారు.
    •  మెట్‌పల్లిలోని 24 స్థానాల్లో 12 చోట్ల టీఆర్‌ఎస్ నెగ్గింది. ఇక్కడ కూడా ఇద్దరు ఇండిపెండెంట్లు కీలకం కానున్నారు.
    •  వేములవాడలోని 20 స్థానాలకు బీజేపీకి తొమ్మిది వచ్చాయి. ఇక్కడ ఐదుగురు స్వతంత్రులున్నారు.
    •  హుజురాబాద్‌లోని 20 స్థానాల్లో టీఆర్‌ఎస్ 9 నెగ్గింది. ముగ్గురు స్వతంత్రుల మద్దతు ఇక్కడ కీలకంగా మారింది. 
    •  సంగారెడ్డిలో 31 స్థానాలుంటే.. కాంగ్రెస్‌కు 11 లభించాయి. ఐదుగురు ఇండిపెండెంట్లు గెలిచారు.
    •  జహీరాబాద్‌లోనూ కాంగ్రెస్‌కు 24 స్థానాలు రాగా, మెజారిటీకి మరొక సీటు కావాలి. అక్కడ ఒక్కరే ఇండిపెండెంట్ ఉన్నారు. 
    •  మహబూబ్‌నగర్‌లో 41 స్థానాలుంటే.. కాంగ్రెస్‌కు 14 మాత్రమే వచ్చాయి. నలుగురు స్వతంత్ర అభ్యర్థులు, ఆరుగురు ఎంఐఎం సభ్యుల మద్దతు ఇక్కడ కీలకంగా మారింది.
    •  వనపర్తిలో 26 స్థానాలకు టీడీపీ ఎనిమిది నెగ్గింది. 4 స్థానాల్లో బీజేపీ గెలిచింది. బీజేపీ, స్వతంత్రుల మద్దతుతో టీడీపీ ఇక్కడ చైర్మన్ పదవి దక్కించుకోవచ్చు. 
    •  కోదాడలో 30 స్థానాలుంటే... మెజారిటీకి 16 కావాలి. ఇక్కడ కాంగ్రెస్‌కు 14 స్థానాలుండగా.. ఇద్దరు ఇండిపెండెంట్ అభ్యర్థుల మద్దతు అవసరం.
    •  హుజూర్‌నగర్‌లోని 20 సీట్లలో కాంగ్రెస్ పది నెగ్గింది. ఇండిపెండెంట్ల మద్దతుతో చైర్మన్ పీఠం పొందవచ్చు. 
    •  జనగామలో 28 స్థానాలకు కాంగ్రెస్ 14 దక్కించుకుంది. స్వతంత్ర లేదా ఎక్స్ అఫీఫియో సభ్యుల ఓట్లు ఇక్కడ కీలకమయ్యాయి.
    •  పరకాలలోని 20 స్థానాల్లో టీఆర్‌ఎస్‌కు ఎనిమిది వచ్చాయి. ఇక్కడ కూడా స్వతంత్రులే కీలకంగా మారారు. 
    •  కొత్తగూడెంలో 33 స్థానాలు ఉంటే.. కాంగ్రెస్‌కు 12 మాత్రమే వచ్చాయి. ఇక్కడ ఆరుగురు ఇండిపెండెంట్ల మద్దతు లేకుంటే పీఠం దక్కదు.
    •  
    • కార్పొరేషన్లలో..
    •  కరీంనగర్ కార్పొరేషన్‌లో 50 డివిజన్లకు గాను టీఆర్‌ఎస్ 24 డివిజన్లలో గెలుపొందింది. పూర్తి మెజారిటీ రావాలంటే మరో రెండు స్థానాలైనా కావాలి. ఇక్కడ ఏడుగురు ఇండిపెండెంట్లు గెలుపొందారు. వారి మద్దతు వద్దనుకుంటే కనీసం ఎక్స్ అఫీషియో సభ్యుల మద్దతు పొందాల్సి ఉంటుంది.
    •  రామగుండం మున్సిపల్ కార్పొరేషన్‌లో కాంగ్రెస్ మేయర్ పీఠం సాధించాలంటే స్వతంత్ర అభ్యర్థుల మద్దతు కీలకంగా మారింది.
    •  నిజామాబాద్‌లోనూ ఎవరికీ మెజారిటీ రాలేదు. ఇక్కడ టీఆర్‌ఎస్, మజ్లిస్ కూటమిగా లేదా మజ్లిస్, కాంగ్రెస్ కూటమిగా ఏర్పడి మేయర్ పీఠం ద క్కించుకునే వీలుంది. మరోవైపు ఐదు పురపాలక సంఘాల్లో ఫలితాలు నువ్వా? నేనా? అన్నట్లుగా ఉన్నాయి. పెద్దపల్లి, మహబూబాబాద్, భూపాలపల్లి, భువనగిరి, తాండూరు పురపాలక సంఘాల్లో ప్రధాన ప్రత్యర్థులకు సమాన సీట్లు వచ్చాయి. 
     ప్రధాన పార్టీలకు సమానంగా..
     మరోవైపు ఐదు పురపాలక సంఘాల్లో ఫలితాలు నువ్వా? నేనా? అన్నట్లుగా ఉన్నాయి. పెద్దపల్లి, మహబూబాబాద్, భూపాలపల్లి, భువనగిరి, తాండూరు పురపాలక సంఘాల్లో ప్రధాన పార్టీలకు సమాన సీట్లు వచ్చాయి. పెద్దపల్లిలో 20 వార్డులకుగాను కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌లకు చెరో 6 స్థానాలు దక్కాయి. మహబూబాబాద్‌లో 28 వార్డులుండగా కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌లకు చెరో ఏడు స్థానాలు దక్కాయి. భూపాలపల్లిలోని 20 వార్డుల్లో కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌లు చెరో ఏడు స్థానాలు గెలుచుకున్నాయి.  భువనగిరిలో 30 వార్డులుండగా బీజేపీ, కాంగ్రెస్‌లు చెరో 8 స్థానాల్లో విజయం సాధించాయి. తాండూరులో 31 వార్డులకుగాను టీఆర్‌ఎస్, మజ్లిస్ పార్టీలకు 10 స్థానాల చొప్పున దక్కాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement