గుప్తనిధుల కోసం వేట
విద్యానగర్(గుంటూరు)
గుంటూరు రూరల్ మండలంలోని కొండవీడు ప్రాంతంలో గుప్తనిధుల కోసం రహస్య తవ్వకాలు జరుగుతున్నారుు. బడా నేతల అండదండలతో దుండగులు రాత్రి సమయంలో రెచ్చిపోతున్నారు. వంట సామగ్రి, తాగునీరు, ఇతర నిత్యావసరాలను ముందుగానే నిల్వ చేసుకుని మరీ తవ్వకాలు కొనసాగిస్తున్నారు. జంతుబలులు, క్షుద్రపూజలు చేస్తున్నారు. పొలాలకు నీరు పెట్టేందుకు రాత్రి పూట ఆ ప్రాంతం మీదుగా వెళుతున్న రైతులు, పశువుల కాపర్ల ద్వారా విషయం తెలియటంతో సమీప గ్రామాల ప్రజలు భయూందోళనకు గురవుతున్నారు. గుప్తనిధుల కోసమే తవ్వకాలు జరుపుతున్నట్టు అక్కడ లభించిన ఆనవాళ్లు స్పష్టం చేస్తున్నారుు. తవ్వకాల గురించి తెలిసినప్పటికీ పోలీసులు, అధికారులు పట్టించుకోకపోవటం విస్మయం కలిగిస్తోంది. వెంగళాయపాలెం, ఓబులునాయుడుపాలెం, నాయుడుపేట, పొత్తూరు గ్రామాల పరిధిలో ఉన్న కొండవీడు కొండల్లో తవ్వకాలు జరుగుతున్నారుు. దాదాపు 20 నుంచి 25 మంది గ్రూపుగా ఏర్పడి వీటిని చేపడుతున్నారు. దీనికోసం పెద్ద రాళ్ళ మధ్య నివాసాలు కూడా ఏర్పాటు చేసుకుంటున్నారు. కనీసం నెల రోజులకు సరిపడా బియ్యం, ఇతర వంట సామగ్రి, గ్యాస్, మినరల్ వాటర్ బాటిళ్లు తీసుకువెళుతున్నారు.
తవ్వకాలకు ముందు క్షుద్ర పూజలు చేస్తున్నారు. రాళ్లను పగలుగొట్టేందుకు తక్కువ శబ్దం వచ్చే జిలెటిన్ స్టిక్స్‌తో పేలుళ్లు నిర్వహిస్తున్నారు. తవ్వకాలు జరిపిన ప్రాంతంలో నిధి దొరకకపోతే గోతులను కంకర రాళ్లతోను, చెట్లను నరికి పూడ్చివేస్తున్నారు.
క్షుద్రపూజలు, లైట్ల హడావుడి, పేలుడు శబ్దాలు వింటున్న సమీప గ్రామాల ప్రజలు భయభ్రాంతులకు లోనవుతున్నారు. తవ్వకాలు జరుగుతున్న ప్రాంతాలను ఉదయం పూట కొందరు పోలీసులు పరిశీలించి వెళ్లిపోతున్నారని, తవ్వకాల విషయం అటవీ శాఖ అధికారులకు కూడా తెలుసునని స్థానికులు చెబుతున్నారు.
తవ్వకాలపై ప్రశ్నిస్తే తమను బెదిరిస్తున్నారని సమీప గ్రామాల ప్రజలు అంటున్నారు. కొండ ప్రాంతంలోకి రావద్దని పశువుల కాపర్లను సైతం హెచ్చరిస్తున్నారని వాపోతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని తమకు రక్షణ కల్పించాలని వేడుకుంటున్నారు.