చెక్ పవర్ ఇవ్వకుంటే హైదరాబాద్ దిగ్బంధం : ఆర్.కృష్ణయ్య
నిజామాబాద్, న్యూస్‌లైన్: గ్రామ సర్పంచులకు చెక్ పవర్ ఇవ్వకుంటే పదివేల మంది సర్పంచులతో హైదరాబాద్‌ను దిగ్బంధనం చేస్తామని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య ప్రభుత్వాన్ని హెచ్చరించారు. నిజామాబాద్‌లో జరిగిన బీసీగర్జన సభలో కొత్తగా ఎన్నికైన 400 మంది బీసీ సర్పంచులకు ఆత్మీయ సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కృష్ణయ్య మాట్లాడుతూ రాజ్యాంగబద్ధంగా సర్పంచులకు 29 అధికారాలు కల్పించాలన్నారు. బీసీ సబ్ ప్లాన్ బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశ పెట్టాలని, ఇందుకు బీసీ నాయకులు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలన్నారు.
బీసీలకు 150 ఎమ్మెల్యే సీట్లు ఇవ్వాలి
తూప్రాన్: బీసీలకు వచ్చే ఎన్నికల్లో 150 అసెంబ్లీ, 22 పార్లమెంటు స్థానాలు కేటాయించాలని ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. మెదక్ జిల్లా తూప్రాన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. వైఎస్సార్‌సీపీ, టీడీపీ బీసీలకు న్యాయం చేస్తామని ప్రకటించాయని, మిగిలిన పార్టీలు అదేబాటన నడవాలన్నారు. పీసీసీ మాజీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగిపోయిందని, సీమాంధ్ర నాయకులు ఎన్ని కుట్రలు చేసినా ఫలించవని, వారికి నిరాశ తప్పదన్నారు.