
ప్రేమ చిత్రాలకే ప్రాధాన్యం
విశాఖపట్నం : ప్రేమ కథా చిత్రాలకే తొలి ప్రాధాన్యం ఇస్తానని, ఇటువంటి చిత్రాలు వర్థమాన హీరోలను పై స్థాయికి తీసుకువెళతాయని యువ హీరో ప్రిన్స్ (నీకు నాకు డాష్ డాష్ ఫేం) అన్నారు. విశాఖకు చిత్ర పరిశ్రమ తరలిరావాల్సిన అవసరం ఉందని, అందుకు తగిన వాతావరణం ఇక్కడ ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. గురువారం స్థానిక గుల్లలపాలెంలో ఒక ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన ఆయనతో ‘న్యూస్‌లైన్’ చిట్‌చాట్...
ఆల్‌రౌండర్‌గా నిలవాలి
అన్ని రకాల చిత్రాల్లో నటించి ఆల్‌రౌండర్‌గా గుర్తింపు పొందాలన్నదే నా కోరిక. ప్రేమ చిత్రాలతోపాటు యాక్షన్ చిత్రాల్లోను, అదే విధంగా కుటుంబ తరహా చిత్రాల్లోను నటించాలని ఉంది.
‘నీకు నాకు డాష్ డాష్’తో గుర్తింపు
2011లో ప్రముఖ దర్శకుడు తేజ దర్శకత్వం వహించిన నీకు నాకు డాష్ డాష్ చిత్రం ద్వారా సినీ రంగ ప్రవేశం చేశాను. ఆ సినిమా నాకు మంచి గుర్తింపునిచ్చింది. బస్టాప్, రొమాన్స్, బన్నీ అండ్ చెర్రీ సినిమాల్లో కూడా హీరోగా నటించాను. ప్రస్తుతం డాలర్స్ కాలనీ చిత్రం చివరి షెడ్యూల్‌లో ఉంది. ఇంకా రెండు చిత్రాల్లో నటించేందుకు కమిట్ అయ్యాను
అభిమాన నటీనటులు
నా అభిమాన హీరోలు మహేష్‌బాబు, ప్రభాస్. నచ్చిన హీరోయిన్లు సమంత, జనీలియా.
చిత్ర నిర్మాణాలకు విశాఖ అనుకూలం
విశాఖ అన్ని విధాలా సినిమాల నిర్మాణానికి అనువుగా ఉంటుంది. ఇక్కడున్నన్ని అందమైన లొకేషన్స్ మన రాష్ట్రంలో ఇంకెక్కడా లేవు. స్టార్ డెరైక్టర్లు, హీరో హీరోయిన్లకు నచ్చే ప్రాంతమిది. తండ్రి ప్రోత్సాహంతోనే ఈ స్థాయికి ఎదిగాను. నన్ను హీరోగా చూడాలన్నది ఆయన కోరిక.