ఐసెట్ కౌన్సెలింగ్ ప్రారంభం
Published Wed, Sep 11 2013 6:20 AM | Last Updated on Sun, Sep 2 2018 4:46 PM
ఎచ్చెర్ల క్యాంపస్, న్యూస్‌లైన్: వాయిదాలు పడుతూవస్తున్న ఐసెట్ కౌన్సెలింగ్ ప్రక్రియ ఎట్టకేలకు మంగళవారం ప్రారంభమైంది. ఉన్నత విద్యామండలి ఎంబీఏ, ఎంసీఏ కామన్ ఎంట్రన్స్ టెస్టు ఐసెట్- 2013 వెబ్ కౌన్సెలింగ్‌లో భాగంగా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ యూనివర్సిటీలో విద్యార్థుల ధ్రువీ కరణ పత్రాలను పరిశీలించగా తొలిరోజు 114 మంది విద్యార్థులు హాజరయ్యారు. 20 వేల లోపు ర్యాంకు పొందిన వారి సర్టిఫికెట్లను పరిశీలించారు.
ఈ ప్రక్రియ ఉదయం తొమ్మిది గంటలకు షెడ్యూల్ మేరకు ప్రారంభం కావాల్సి ఉండగా ఇంటర్‌నెట్ మొరాయించడం, విద్యుత్ సరఫరాలో అంతరాయం కారణంగా రెండున్నర గంటలు ఆలస్యంగా 11.30 గంటలకు ప్రారంభించారు. యూపీఎస్ ఏర్పాటు చేసి కౌన్సెలింగ్‌ను ప్రారంభించే సరికి జాప్యం జరగడంతో విద్యార్థులు ఆందోళన చెందారు. అయితే సాయంత్రం వరకూ సజావుగా సర్టిఫికెట్ల పరిశీలన జరగడంతో ఊపిరి పీల్చు కున్నారు. బీఆర్‌ఏయూ వీసీ ఆచార్య హనుమంతు లజపతిరాయ్ కౌన్సెలింగ్‌ను పర్యవే క్షించారు. ఐసెట్‌లో 91వ ర్యాంకు సాధించిన స్వాతికుమారి ధ్రువీకరణ పత్రాలు పరిశీలించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. వీసీ ఈమెకు స్క్రాచ్ కార్డు అందజేసి అభినందనలు తెలియజేశారు.
రిజస్ట్రార్ ప్రొఫెసర్ వడ్డాది కృష్ణమోహన్, సీడీసీ డీన్ ప్రొఫెసర్ గుంట తులసీరావు, చీఫ్ వార్డెన్ ప్రొఫెసర్ బిడ్డిక అడ్డయ్య, కౌన్సెలింగ్ ఇన్‌చార్జి డాక్టర్ విజయభాస్కర్ కూడా కౌన్సెలింగ్‌ను పర్యవేక్షించారు. బుధవారం 40 వేల ర్యాంకులోపు విద్యార్థుల ధ్రువీకరణ పత్రాలు పరిశీలిస్తారు. 15వ తేదీ వరకు కౌన్సెలింగ్ ప్రక్రియ కొనసాగనుంది. 13వ తేదీ నుంచి సర్టిఫికెట్ల పరిశీలన పూర్తయిన వారు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవల్సి ఉంటుంది. వర్సిటీ సహాయ కేంద్రానికి విజయనగరం, విశాఖపట్నం జిల్లాల విద్యార్థులు హాజరు అవుతుండటంతో తాకిడి ఎక్కువగానే ఉంది.
Advertisement