పాసులు ఎందుకివ్వరో ఢిల్లీలోనే తేల్చుకుంటాం:లగడపాటి
గుంటూరు:సీమాంధ్ర కాంగ్రెస్ నేతలకు పాసులు ఇవ్వకపోవడంపై విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ మండిపడ్డారు. తమ ప్రాంత నేతలకు పాసులు ఎందుకివ్వరో ఢిల్లీలోనే తేల్చుకుంటామన్నారు. ఈ సందర్భంగా గురువారం మీడియాతో మాట్లాడిన లగడపాటి..తమకు పాసులు రాకపోవడం దురదృష్టకమరమైన అంశమన్నారు. ఆ విషయాన్ని కాంగ్రెస్ పెద్దల సమక్షంలోనే తేల్చుకుంటామన్నారు. గతంలో యూపీఏ ప్రభుత్వంపైన మాత్రమే అవిశ్వాసం తీర్మానాన్ని ప్రవేశపెట్టామని, కాంగ్రెస్ పై కాదన్నారు. తాను కాంగ్రెస్ వాదిగా ప్లీనరీకి తప్పకుండా హాజరవుతానని లగడపాటి స్పష్టం చేశారు.
ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించిన ఆరుగురు సీమాంధ్ర ఎంపీలను ఏఐసీసీ సమావేశానికి అధిష్టానం అనుమతి నిరాకరించింది. లగడపాటి రాజగోపాల్, రాయపాటి సాంబశివరావు, ఉండవల్లి అరుణ్ కుమార్, సాయిప్రతాప్, సబ్బం హరి, హర్షకుమార్లకు పాసులు నిరాకరించినట్లు తెలుస్తోంది. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) సమావేశాల్లో పాల్గొనడం కాంగ్రెస్ నేతలు గౌరవంగా భావించే నేపథ్యంలో వివాదానికి ఆజ్యం పోసినట్లుగా ఉందని సీమాంధ్ర నేతలు అభిప్రాయపడుతున్నారు.