
మాగుంట శ్రీనివాసులు రెడ్డి
తెలంగాణ బిల్లు పార్లమెంట్లో ఆమోదం పొందితే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తానని ఒంగోలు ఎంపీ, కాంగ్రెస్ పార్టీ నాయకుడు మాగుంట శ్రీనివాసులు రెడ్డి స్పష్టం చేశారు. శనివారం ఆయన ఒంగోలులో విలేకర్లతో మాట్లాడారు. సీమాంధ్ర ప్రజల మనోభావాలను కాంగ్రెస్ పార్టీ పట్టుకోవడం లేదన్నారు. టి.బిల్లుపై కాంగ్రెస్ పార్టీ తాను పట్టిన కాళ్ల కుందేలుకు మూడే కాళ్లు అన్న తరహాలో అప్రజాస్వామికంగా వ్యవహరిస్తుందని ఆయన ఆరోపించారు.
పార్లమెంట్లో తెలంగాణ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేయాలని చూసిన మాపై వేటు వేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచే క్రమంలో సీమాంధ్రలో జరుగుతున్న సమైక్య ఉద్యమం మరో స్వాతంత్ర్య పోరాటమని ఆయన అభివర్ణించారు. రానున్న ఎన్నికలలో ఒంగోలు నుంచి పోటీ చేస్తా కానీ ఏ పార్టీ తరఫున అనేది మాత్రం ఇప్పుడే వెల్లడించలేనని మాగుంట శ్రీనివాసులు రెడ్డి తెలిపారు.