'విభజన జరిగినా కాంగ్రెస్లోనే ఉంటా..'
గుంటూరు : పార్లమెంట్లో ఎంపీల మధ్య జరిగిన సంఘటన దురదృష్టకరమని కేంద్రమంత్రి పనబాక లక్ష్మి అన్నారు. సభలో తెలంగాణ బిల్లు పెడుతున్న సమయంలో తాను కేంద్రమంత్రి సుశీల్ కుమార్ షిండే వెనకనే ఉన్నానని...అది అందరికి తెలిసే జరిగిందన్నారు. గుంటూరు జిల్లా పరుచూరులో కమ్యూనిటీ కార్యాలయాన్ని కేంద్రమంత్రులు పనబాక లక్ష్మి, జేడీ శీలం శనివారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా పనబాక మాట్లాడుతూ ఒకవేళ రాష్ట్ర విభజన జరిగినా కాంగ్రెస్ పార్టీలోనే ఉంటానని... బాపట్ల నుంచే పోటీ చేస్తానని స్పష్టం చేశారు. హైదరాబాద్ను పదేళ్లు ఉమ్మడి రాజధాని చేయాలనే యోచన ఉన్నట్లు ఆమె అన్నారు. ఇక వంటగ్యాస్కు ఆధార్ అనుసంధానం తొలగించేందుకు త్వరలోనే జీవో జారీ చేస్తామని పనబాక తెలిపారు.