బాపట్ల కాంగ్రెస్ లో టు-లెట్ బోర్డు!
* బాపట్ల పార్లమెంట్ నియోజకవర్గంలో కాంగ్రెస్ ఖాళీ
*అన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థుల కోసం ఎదురుచూపు
*సిట్టింగ్ ఎమ్మెల్యేలంతా ఇతర పార్టీల్లోకి జంప్
*మండలాల వారీగా ప్రధాన నాయకులదీ తలోదారి
*చేసేది లేక నియోజకవర్గాల వారీగా ఇన్‌చార్జీల నియామకం
* అధికార పార్టీకి పెద్దదిక్కుగా మిగిలిన కేంద్ర మంత్రి పనబాక
చీమకుర్తి : బాపట్ల పార్లమెంట్ నియోజకవర్గంలో అధికార కాంగ్రెస్ పార్టీ చుక్కాని లేని నావలా మిగిలింది. రాష్ట్రాన్ని ముక్కలు చేస్తున్నట్లు సీబ్ల్యూసీ (కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ) ప్రకటించడంతో సీమాంధ్రలో ఆ పార్టీ ఖాళీ అయింది. ఏతా వాతా ఆ పార్టీ ఉనికే ప్రశ్నార్థకంగా మారింది. ప్రకాశం, గుంటూరు జిల్లాల పరిధిలో ఉన్న బాపట్ల నియోజకవర్గంలోని ఏడు అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ముఖ్యనాయకులు వైఎస్సార్ సీపీలోకి, ఒకరిద్దరు నాయకులు టీడీపీలోకి వెళ్లారు. చివరకు కాంగ్రెస్ పార్టీ ముందు టు-లెట్ బోర్డు వేలాడుతోంది.
కాంగ్రెస్ పార్టీలో చేరేవారు ఎవరైనా ఉన్నారా.. అని బాపట్ల ఎంపీ, కేంద్రమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న పనబాక లక్ష్మి భూతద్దం పెట్టి మరీ వెతుకుతున్నారు. బాపట్ల పార్లమెంట్ నియోజకవర్గంలో గుంటూరు జిల్లా బాపట్ల, రేపల్లె, వేమూరు, ప్రకాశం జిల్లా సంతనూతలపాడు, చీరాల, పర్చూరు, అద్దంకి అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. బాపట్ల, రేపల్లె, సంతనూతలపాడు, అద్దంకి, చీరాల, పర్చూరు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున గాదె వెంకటరెడ్డి, మోపిదేవి వెంకటరమణ, బీఎన్ విజయ్‌కుమార్, గొట్టిపాటి రవికుమార్, ఆమంచి కృష్ణమోహన్, దగ్గుబాటి వెంకటేశ్వరరావులు ఎమ్మెల్యేలుగా గెలిచారు. గాదె వెంకటరెడ్డి పార్టీ నుంచి రేపోమాపో బయటకు వెళ్లనున్నారు.
మోపిదేవి వెంకటరమణ, గొట్టిపాటి రవికుమార్‌లు గతంలోనే వైఎస్సార్ కాంగ్రెస్‌లో చేరగా బీఎన్ విజయ్‌కుమార్ మంగళవారం టీడీపీలో చేరారు. దగ్గుబాటి ఏకంగా రాజకీయాల నుంచే విరమించుకున్నట్లు ప్రకటించారు. ఆమంచి చూపులు టీడీపీ, వైఎస్సార్‌సీపీ వైపు ఉన్నాయి. మొత్తం మీద బాపట్ల పార్లమెంటు నియోజకవర్గంలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీకి అండగా ఉన్న ప్రజాప్రతినిధులు ఎవరిదారి వారు చూసుకోవడంతో పనబాక ఒంటరై పార్టీని ఎలా కాపాడుకోవాలబ్బా.. అని ఆలోచిస్తున్నారు.
కార్యకర్తలూ ఇతర పార్టీల్లోకి ..
బాపట్ల పార్లమెంటు నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా ఇతర పార్టీల్లోకి చేరిపోయారు. ఈ నేపథ్యంలో పార్టీ నిర్మాణంపై పనబాక దృష్టి కేంద్రీకరించి ఇటీవల చీమకుర్తికి వరుసగా రెండుమూడు సార్లు వచ్చి ఉన్న కొద్దిమందితో కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు. అప్పట్లో కేంద్రమంత్రి పనబాక.. చీమకుర్తి వచ్చారంటే నేరుగా బూచేపల్లి నివాసంలోకి వెళ్లి కార్యకర్తలతో సమావేశమయ్యేవారు.
బూచేపల్లి కుటుంబం వైఎస్సార్ సీపీలోకి వెళ్లడంతో కొంతకాలం ఏఎంసీ చైర్మన్ మారం వెంకారెడ్డి నివాసమే కేంద్రంగా చేసుకుని కాంగ్రెస్ పార్టీ కార్యకలాపాలు నిర్వహించే వారు. ప్రస్తుతం ఆయన కూడా వైఎస్సార్ సీపీలోకి చేరడంతో కాంగ్రెస్ పార్టీకి దిక్కుమొక్కు లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో చేసేది లేక పనబాక తన పరిధిలో ఉన్న ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇన్‌చార్జిలను నియమించారు.
బాపట్లకు కె.నారాయణరెడ్డి, రేపల్లెకు మోపిదేవి శ్రీనివాసరావు, వేమూరుకు నత్తల భరత్, సంతనూతలపాడుకు వేమా శ్రీనివాసరావు, అద్దంకికి జి.శ్రీలక్ష్మి, చీరాలకు ఎం.నిశాంత్, పర్చూరుకు నుసుం కృష్ణారెడ్డిలను ఏపీసీసీ అనుమతితో ఇన్‌చార్జిలుగా నియమించుకున్నారు. వారి ద్వారా పార్టీని ముందకు తీసుకెళ్లేందుకు పనబాక నానాతంటాలు పడుతున్నారు.