సాక్షి, అమరావతి బ్యూరో: ‘‘సమాజంలో అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉండటమే నిజ మైన అభివృద్ధి. భవనాలు, రహదారులు, వంతెనల నిర్మాణం వంటివి అభివృద్ధికి సూచి కలే. కానీ, అంతకుమించి ప్రజల సంతోషమే నిజమైన ప్రగతికి తార్కాణం. సామాజిక, ఆర్థిక అసమానతలను తొలగిస్తేనే సర్వతో ముఖాభివృద్ధి సాధించగలం.
ఆ బాధ్యత కేంద్రం కంటే రాష్ట్రాల పైనే ఎక్కువగా ఉంది’’ అని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ స్పష్టం చేశారు. ‘‘వివక్షకు తావు లేకుండా అందరికీ అభివృద్ధి ఫలాలు అందాలి. యావత్ జాతి సంక్షేమమే లక్ష్యంగా వనరులను వినియోగిం చుకునేలా ప్రభుత్వాలు తమ విధానాలను రూపొందించుకోవాలి. అలా చేస్తేనే మనం కలలు కంటున్న నూతన భారతదేశాన్ని 75వ స్వాతంత్య్ర దినోత్సవం జరుపుకునే 2022 నాటికి ఆవిష్కరించగలం’’ అని ఆయన పేర్కొన్నారు.
గుంటూరు జిల్లాలోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఎదుట బైబిల్ మిషన్ ప్రాంగణంలో నిర్వహిస్తున్న ‘ఇండియన్ ఎకనామిక్ అసోసియేషన్ (ఐఈఏ)’ శతాబ్ది ఉత్సవాల సదస్సును రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన కీలకోపన్యాసం చేశారు. భారతదేశం 75వ స్వాతంత్య్ర దినోత్సవాల దిశగా ఉరకలు వేస్తున్న వేళ ఇంకా పేదరికం, అసమానతల గురించి మాట్లాడాల్సి రావడం బాధాకరమని అన్నారు.
దేశంలో అత్యధిక సంఖ్యలో ప్రజలకు సరైన మౌలిక వస తులు, విద్య, ఆరోగ్యం, పౌర సేవలు ఇంకా అందుబాటులోకి రాలేదన్నది కఠిన వాస్తవమని పేర్కొన్నారు. సమాజంలో అసమానతలను తొలగించడమే ధ్యేయంగా ఆర్థిక విధానాలను రూపొందించాల్సిన అవసరం ఉందన్నారు. నైపుణ్యవంతమైన మానవ వనరులను తీర్చిదిద్దడానికి విద్య, ఆరోగ్య రంగాల్లో ఎక్కువ నిధులు వెచ్చించాలని రాష్ట్రపతి సూచించారు.
రాష్ట్ర ప్రభుత్వాలదే ఎక్కువ బాధ్యత
దేశ సర్వతోముఖాభివృద్ధికి కీలకమైన విద్య, వైద్య రంగాల్లో అభివృద్ధి మొదలైనవి రాష్ట్ర ప్రభుత్వాల జాబితాలోని అంశాలేనని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ స్పష్టం చేశారు. రాష్ట్రస్థాయి, స్థానిక సంస్థల స్థాయిలోనే సరైన విధానాలు రూపొందించి సమర్థంగా అమలు చేస్తేనే ప్రజా సంక్షేమాన్ని సాధించగలమని చెప్పారు.
ఆహారభద్రత కల్పించే దిశగా..
ధనిక–పేద వర్గాలు, పట్టణ–గ్రామీణ ప్రాం తాల మధ్య అంతరాన్ని తగ్గించడమే లక్ష్యంగా ఆర్థిక విధానాలను రూపొందించాలని గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ సూచించారు. ప్రజలకు ఆహార భద్రత కల్పించే దిశగా ఆర్థిక విధానాలు ఉండాలన్నారు.
పుట్టగొడుగులాంటి ఆర్థిక వ్యవస్థ
‘‘ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పుట్టగొడుగు మాదిరిగా ఆర్థిక వ్యవస్థ రూపుదిద్దుకోవడం వల్లే పేదరికం సమస్య సమసిపోవడం లేదు’’ అని బంగ్లాదేశ్‌కు చెందిన ప్రముఖ ఆర్థికవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత మహ్మద్ యూనస్ అభిప్రాయపడ్డారు. ఐఈఏ సదస్సులో ఆయన మాట్లాడుతూ... ‘‘ఆర్థిక వ్యవస్థ పుట్టగొడుగు మాదిరిగా తయారవుతోంది. కింద సన్నగా ఉంటున్న సంపద పైభాగంలో మాత్రం పెద్ద ఎత్తున పేరుకుపోతోంది.
సమాజంలో 99 శాతం ఉన్న అట్టడుగువర్గాలకు సంపద చేరడం లేదు. కేవలం ఒక్క శాతం ఉన్న ఉన్నతవర్గాల వద్దకే చేరుతోంది. అందువల్లే సమాజంలో పేదరికాన్ని రూపుమాపలేకపో తున్నాం’’ అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సదస్సులో ఐఈఏ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు సి.రంగరాజన్, ఏపీ మంత్రి గంటా శ్రీనివాస రావు, ఐఈఏ అధ్యక్షుడు సుఖ్‌దేవ్ థోరాట్, ఐఈఏ ప్రధాన కార్యదర్శి అనిల్ కుమార్ ఠాకూర్, నాగార్జున విశ్వవిద్యాలయం వీసీ ఎ.రాజేంద్ర ప్రసాద్‌తోపాటు దేశ, విదేశాల ఆర్థికవేత్తలు, విద్యార్థులు పాల్గొన్నారు.
సింగపూర్‌ని ఆదర్శంగా తీసుకోవాలి
విద్య, సాంకేతిక పరిజ్ఞానాలను సాధనాలుగా చేసుకుని ఆర్థికాభివృద్ధిని సాధించడమే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానమని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. భారతదేశం రెండంకెల వృద్ధి రేటు సాధించడమే లక్ష్యంగా పెట్టుకోవాలన్నారు. అలాగైతేనే అమెరికా, చైనాల తరువాత ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఆవిర్భ విస్తామని అభిప్రాయపడ్డారు. చిన్నదేశం అయినప్పటికీ సింగపూర్ సాధిస్తున్న ప్రగతిని మనం ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. ఆ దిశగా విధానాల రూపకల్పనకు ఆర్థికవేత్తలు ప్రభుత్వానికి సలహాలు, సూచనలు ఇవ్వాలన్నారు.
రాష్ట్రపతి ప్రసంగిస్తుండగా ఆహార పొట్లాల పంపిణీ
ఇండియన్ ఎకనామిక్ అసోసియేషన్ సదస్సులో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రసంగిస్తుండగానే, నిర్వాహకులు ఆహార పొట్లాలు పంపిణీ చేశారు. సదస్సుకు హాజరైన ప్రతినిధులు, విద్యార్థులు, విలేకరులకు ఈ పొట్లాలు ఇవ్వడం ప్రారంభించారు. దీంతో చాలామంది వాటిని అందుకునేందుకు పోటీపడడంతో సదస్సులో కలకలం రేగింది.
ఇది గమనించిన రాష్ట్రపతి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘‘ప్రస్తుతం ఆర్థిక వ్యవస్థలో నెలకొన్న పరిస్థితే ఈ సదస్సులోనూ కనిపిస్తోంది. ప్రతినిధులకు ఆహార పొట్లాలు ఇవ్వడం మంచిదే. కానీ, అది సదస్సులో గందరగోళం సృష్టించేలా ఉండరాదు’’ అని చెప్పారు. ఆహార పొట్లాల పంపిణీని కొద్దిసేపు నిలిపివేయాలని కోరారు. వెంటనే తేరుకున్న పోలీసులు సదస్సులో ఆహార పొట్లాల పంపిణీని నిలిపి వేయించారు.
Comments
Please login to add a commentAdd a comment