
'అమలాపురాన్ని కేరళగా మారుస్తా'
కోనసీమాలో భాగమైన అమలాపురాన్ని కేరళ లాగా అభివృద్ధి చేస్తామని ఆ ప్రాంత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లోక్సభ అభ్యర్థి పి.విశ్వరూప్ స్పష్టం చేశారు. కేరళలో కొబ్బరి తోటల సాగు, అక్కడి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పథకాలుపై అధ్యాయనం చేసి అమలాపురం ప్రాంతంలో అమలు చేస్తామని చెప్పారు. ఆదివారం అమలాపురం లోక్సభ నియోజకవర్గం పరిధిలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్బంగా విశ్వరూప్ మాట్లాడుతూ... అమలాపురం ప్రాంతాన్ని అట్టడుగు స్థాయి నుంచి అభివృద్ధి చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటానని ఆయన స్థానిక ప్రజలకు భరోసా ఇచ్చారు.
అమలాపురాన్ని వ్యాపారానికి ముఖ్య కూడలిగా అభివృద్ధి చేస్తానన్నారు. ప్రభుత్వం చేపట్టే అన్ని సంక్షేమ పథకాలు ప్రజలకు అందుబాటులోకి తీసువస్తానని చెప్పారు. గతంలో ఇక్కడ నుంచి ఎన్నికైన నేతలు ఈ ప్రాంతాన్ని తీవ్ర నిర్లక్ష్యం చేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అమలాపురం ప్రజలకు తనపై పూర్తి నమ్మకం ఉందని... ఈ నేపథ్యంలో తనను అత్యధిక మేజార్టీతో స్థానిక ప్రజలకు గెలిపిస్తారని విశ్వరూప్ ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ పార్టీ తన నిర్ణయాన్ని ప్రకటించడంతో విశ్వరూప్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. అనంతరం ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే.