
'మా వాడు తప్పు చేసుంటే శిక్షించండి'
కడప: హైదరాబాద్ యూసుఫ్గూడ ఏటీఎం దోపిడీ కేసు నిందితుడు శివకుమార్ తప్పు చేసినట్టయితే కఠినంగా శిక్షించాలని అతని తల్లిదండ్రులు చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన ఈ ఘటనపై శివ కుమార్ తల్లిదండ్రులు స్పందించారు. మందలించినందుకు 2006లోనే శివకుమార్ ఇల్లు విడిచి వెళ్లిపోయాడని చెప్పారు.
సాఫ్ట్‌వేర్ ఉద్యోగి శ్రీలలిత బుధవారం ఉదయం యూసుఫ్‌గూడలోని ఎస్‌బీఐ ఏటీఎం నుంచి డబ్బులు డ్రా చేస్తుండగా శివకుమార్ పిస్తోల్‌తో కాల్పులు జరిపి ఆమె నుంచి బంగారు గొలుసు, ఉంగరం, చెవి కమ్మలు, సెల్‌ఫోన్, ఏటీఎం కార్డు దోచుకెళ్లిన విషయం తెలిసిందే. హైదరాబాద్ నగర టాస్క్‌ఫోర్స్ పోలీసులు 24 గంటల్లోనే ఈ కేసును ఛేదించారు. దోపిడీకి పాల్పడిన నిందితుడిని గురువారం అరెస్టు చేసి అతని నుంచి పిస్తోల్‌తో పాటు మూడు ఏటీఎం కార్డులు, బంగారు గొలుసు, చేతి ఉంగరం, ఐదు సెల్‌ఫోన్‌లు, బటన్ చాకు, హ్యాడ్ కర్చీఫ్, రూ.4,000 నగదును పోలీసులు స్వాధీ నం చేసుకున్నారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా ఆగంతకుడు కడప జిల్లాకు చెందిన పెదపల్లి శివకుమార్‌రెడ్డి అని గుర్తించారు.