
ఏటీఎం దోపిడీ వీడియో విడుదల
యూసుఫ్గూడ ఏటీఎం దోపిడీ కేసులో విచారణ వేగవంతమైంది. ఏటీఎం సెంటర్‌లోని సీసీ కెమెరా ఫుటేజ్‌లో నిందితుడిని పోలీసులు గుర్తించారు. యూసుఫ్‌గూడ ఆర్బీఎస్ ఏటీఎం కేంద్రంలో బుధవారం ఉదయం 7.25కు సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని డబ్బులు డ్రా చేస్తుండగా... ఆమెపై దాడి జరిగింది. ముసుగుతో లోపలికి వచ్చిన గుర్తు తెలియని వ్యక్తి తాను కష్టాల్లో ఉన్న నగదు కావాలంటూ తుపాకీతో బెదిరించాడు. ఈ బెదిరింపుల వీడియో క్లిప్పింగును పోలీసులు గురువారం విడుదల చేశారు. ఏటీఎంలో ఉన్న సీసీటీవీ ఫుటేజిలో అతడు బెదిరించి, బయటకు వెళ్లేవరకు ఉన్న దృశ్యాలన్నీ రికార్డయ్యాయి. అయితే అతడు ముసుగుతో రావడంతో కచ్చితంగా నిందితుడిని గుర్తించడం కొంత కష్టంగా మారింది.
నిందితుడు తన వద్ద ఉన్న రివాల్వర్ తో ఒక రౌండ్ కాల్పులు కూడా జరిపాడు. దీంతో భయాందోళనకు గురైన యువతి తన వద్ద ఉన్న డెబిట్ కార్డు, బంగారు నగలు ఇచ్చేసింది. అక్కడి నుంచి పారిపోయిన నిందితుడు మరో ఏటీఎంలో రూ. 3,500 డ్రా చేసుకున్నాడు. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన ఎస్ఆర్ నగర్ పోలీసులు.. సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా నిందితుడి కోసం గాలిస్తున్నారు.