ఎస్సీ వర్గీకరణను విస్మరిస్తే తుని తరహాలో ఘటనలు పునరావృతమవుతాయని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధికార ప్రతినిధి
అధికారం, అగ్రకుల మైకంలో చంద్రబాబు
ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధికార ప్రతినిధి నరేంద్రబాబు
కురబలకోట : ఎస్సీ వర్గీకరణను విస్మరిస్తే తుని తరహాలో ఘటనలు పునరావృతమవుతాయని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎస్.నరేంద్రబాబు హెచ్చరించారు. కురబలకోట మండలంలోని అంగళ్లులో గురువారం జరిగిన ఎమ్మార్పీఎస్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ మూడు కమిషన్లు ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా రిపోర్టులు ఇచ్చినా న్యాయం చేయలేదన్నారు. అలాంటిది చంద్రబాబు మంజునాథ కమిషన్ పేరుతో కాపులకేం న్యాయం చేస్తారని ప్రశ్నించారు.
వడ్డెర, వాల్మీకి, రజక కులాలవారిని ఎస్టీల్లో చేరుస్తానని హామీ ఇచ్చినా అతీగతీ లేదన్నారు. అందర్నీ నమ్మించడం, అధికారం చేపట్టాక వంచించడం ఆయన నైజంగా మారిందన్నారు. దళితులను కించపరుస్తూ మాట్లాడిన చంద్రబాబు క్షమాపణ చెప్పకపోతే ఆయన రాజకీయ జీవితానికి సమాధి కడతామని హెచ్చరించారు.