సాక్షి, విశాఖపట్నం: అక్కడ జరుగుతున్నది అక్రమమని తెలుసు.. పేగు పచ్చి ఆరని పసి గుడ్డును విక్రయిస్తున్నారనీ తెలుసు.. అయినా ఏమీ జరగనట్టే ఉంటున్నారు. దీని వెనుక ఎవరున్నారో తెలుసు.. ఎలా నడిపిస్తున్నారో తెలుసు.. కానీ ఏమీ తెలియనట్టే ప్రవర్తిస్తున్నారు. ఎందుకంత నిర్లక్ష్యం? ఎవరి కోసం ఈ నిర్లిప్తత? అనే ప్రశ్నలకు సమాధానం దొరకదు. ‘బేబీ ఫ్యాక్టరీ’ వ్యవహారంలో ప్రభుత్వం, అధికారుల తీరు విస్మయానికి గురి చేస్తోంది. కేవలం వివరాలడిగి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు చేతులు దులుపుకుంటే, ఈ వ్యవహారంపై దష్టి పెట్టేందుకు పోలీసులు సాహసించడం లేదు. పైగా ఫిర్యాదు లేనిదే తామేమీ చేయలేమని తప్పించుకుంటున్నారు.
ఏజెంట్లతో ఒప్పందాలు
విశాఖపట్నంలో 10 ముఖ్యమైన ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్(ఐవీఎఫ్) కేంద్రాలు ఉన్నాయనేది అధికారుల లెక్క. ఇవి కాకుండా చిన్నాచితకా కేంద్రాలు కోకొల్లలుగా ఉన్నాయి. వీటిలో కొన్ని ప్రధాన ఐవీఎఫ్ కేంద్రాలకు అనుబంధంగా నడుస్తున్నాయి. ఐవీఎఫ్‌కు వచ్చిన వారిలో సంపన్న వర్గాల వారుంటే వారికి పిల్లలను విక్రయించేలా కేంద్రాల నిర్వాహకులు కొందరు ఏజెంట్లతో ముందస్తుగా ఒప్పందాలు చేసుకుంటున్నారు. తమ వద్ద ఉన్న దంపతుల వివరాలను ఏజెంట్లకు అందజేస్తున్నారు.
దత్తత తీసుకోవాలంటూ కౌన్సెలింగ్
సంతానం కోసం తమ వద్దకు వచ్చే వారిని ఐవీఎఫ్ కేంద్రాల నిర్వాహకులు ట్రీట్‌మెంట్ పేరిట సంవత్సరాల తరబడి తిప్పించుకుంటున్నారు. పరీక్షలంటూ రూ.లక్షలు దోచుకుంటున్నారు. ఇంతచేస్తున్నా ఈ కేంద్రాల్లో సంతాన భాగ్యం కలిగేది కొందరికే. ఎక్కువ శాతం దంపతులకు సరోగసీ ద్వారా కూడా బిడ్డలు కలిగే అవకాశం ఉండటం లేదు. ఇక ప్రయోజనం లేదని, ఎవరినైనా దత్తత తీసుకోవడమే మేలని నిర్వాహకులు కౌన్సె లింగ్ ఇస్తున్నారు. దానికి ఒప్పుకున్న దంపతులను అప్పటికే సిద్ధంగా ఉన్న ఏజెంట్లకు అప్పగిస్తున్నారు. ఐవీఎఫ్ కేంద్రాల వద్ద ముగ్గురు చొప్పున ఏజెంట్లు ఉంటున్నారు. బేబీ ఫ్యాక్టరీల నుంచి పిల్లలను తీసుకువచ్చి దంపతులకు విక్రయిస్తున్నారు.
మంత్రి ఆదేశాలు బేఖాతరు
ఐవీఎఫ్ కేంద్రాలపై అధికారుల పర్యవేక్షణ లేదు. ఇప్పటివరకు ఎంత మంది పుట్టారు. వారి వివరాలేమిటనే రికార్డులు వైద్య ఆరోగ్య శాఖ వద్ద లేవు. ఐవీఎఫ్‌లలోని పిండాలు ఏమవుతున్నాయనే దానిపై సమాచారం లేదు. ఐవీఎఫ్ కేంద్రాల్లో అవకతవకలపై విచారణ జరపాలని సాక్షాత్తూ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఆదేశించినా పోలీసులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. నగరంలో 13 పెద్ద ఐవీఎఫ్ సెంటర్లు ఉండగా 10 సెంటర్లకే నోటీసులిచ్చారు. మిగతా మూడు సెంటర్లను ఎందుకు వదిలేశారో అధికారులకే తెలియాలి. ఇక చిన్నాచితకా సెంటర్ల బాగోతాన్ని పట్టించుకోవడమే లేదు.
అన్నీ పట్టించుకోవాలంటే సిబ్బంది లేరు
‘‘ఐవీఎఫ్ కేంద్రాలకు పిల్లల విక్రయాలతో సంబం ధంఉండకపోవచ్చు. పిల్లలను విక్రయిస్తున్న వారు కావాలనే ఐవీఎఫ్ కేంద్రాల పేరు చెబుతుండవచ్చు. అయినప్పటికీ 10 ఐవీఎఫ్ సెంటర్లకు నోటీసులిచ్చాం. అన్నీ పట్టించుకోవాలంటే మా వద్ద తగిన సంఖ్యలో సిబ్బంది లేరు’’
-జె.సరోజిని, జిల్లా వైద్య ఆరోగ్య అధికారి,
విశాఖపట్నం
ఐవీఎఫ్ కేంద్రాల్లో అక్రమ దందా!
Published Thu, Jan 7 2016 11:55 PM | Last Updated on Thu, May 3 2018 3:17 PM
Advertisement
Advertisement