ఇసుక తరలింపుతో గుల్లబారిన బొమ్మిరెడ్డిపల్లె వంక (ఇన్‌సెట్) ఎర్రచెరువు పూడికమన్ను తరలిస్తున్న దృశ్యం
సాక్షి, వెల్దుర్తి: మండలంలో టీడీపీ నాయకుల సహజవనరుల యధేచ్ఛ దోపిడి ఆ పార్టీ ప్రభుత్వం గద్దెనెక్కిన కాలం నుంచి కొనసాగుతోంది. అరికట్టాల్సిన అధికారులు అధికారం మందు తలవంచేశారు. మండల పరిధిలోని టీడీపీ నాయకుడు బొమ్మిరెడ్డి పల్లె సుబ్బరాయుడు చెరుకులపాడు, కొసనాపల్లె గ్రామాల పరిధిలోని పాలహంద్రీలో, నార్లాపురం, బొమ్మిరెడ్డిపల్లె, మల్లెపల్లె వంకల్లోని ఇసుక రవాణాను ఐదేళ్లుగా తన అనుచర, బంధు గణంతో చేయిస్తూ రూ.కోట్లకు పడగలెత్తినట్లు మండల ప్రజలు బహిరంగంగా ఆరోపిస్తున్నారు.
మండల కేంద్రంలోని టీడీపీ నాయకుడు మాజీ ఎంపీపీ ఎల్‌ఈ జ్ఞానేశ్వర్‌గౌడ్ స్థానిక ఈరన్న గట్టు కొండను కరిగిస్తూ గ్రావెల్ అక్రమ తరలింపులో రికార్డు కెక్కాడని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. దీంతో పాటు ఎర్ర చెరువు పూడిక మట్టిని ఉలిందకొండ ఇటుకల బట్టీలకు తరలిస్తూ రూ.లక్షలు గడిస్తున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. ఇసుక, గ్రావెల్, పూడిక మట్టి తరలింపులో ఈ నాయకులు పాత్రధారులు కాగా నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్ కేఈ శ్యాంబాబు, ఎంఎల్‌సీ కేఈ ప్రభాకర్ సూత్రధారులనే ఆరోపణలున్నాయి. ఏదేమైనా ప్రభుత్వ పథకాల్లో అవినీతి, అక్రమాలు, పర్సెంటేజీలతో పాటు సహజవనరులను కొల్లగొట్టి టీడీపీ నాయకులు బాగానే సంపాదించారని, ఈ దఫా ఎన్నికల్లో ఎంతైనా ఖర్చు చేసి నియోజకవర్గంలో గెలుపు సాధించాలనే దిశగా పావులు కదుపుతున్నట్లు రాజకీయ మేధావులు అభిప్రాయపడుతున్నారు.
మట్టిని కూడా వదలడంలేదు
టీడీపీ నాయకులు ప్రభుత్వ పథకాల్లో అవినీతి అక్రమాలతో పాటు కొండ మట్టి, చెరువు మట్టిని కూడా వదలడం లేదు. మాజీ ఎంపీపీ ఎల్‌ఈ జ్ఞానేశ్వర్‌గౌడ్ ఇదే తరహాలో అక్రమంగా రూ.లక్షలు కూడబెట్టుకుంటున్నాడు. డబ్బే ప్రధానమైన ఇతను ప్రజలకు, రైతులకు అవసరమయ్యే మట్టిని వ్యాపారులకు తరలింపజేస్తూ అన్యాయం చేస్తున్నాడు. ఇలాంటి వారు నేడు తమ పార్టీకి ఓటేయాలని అడిగితే ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు.
– వైఎస్సార్‌సీపీ పట్టణ కన్వీనర్ వెంకట్‌నాయుడు, వెల్దుర్తి
ఇసుక మాఫియా అంతా ఇంతా కాదు
మా గ్రామ, కొసనాపల్లె, బొమ్మిరెడ్డిపల్లె ఇలా ఏ వంక, వాగు, హంద్రీలలోనైనా ఇసుక మాఫియా అంతా ఇంతా కాదు. ఈ మాఫియా చెరుకులపాడు నారాయణరెడ్డిని సైతం బలిగొన్నది. ఈ మాఫియాకు పాత్రధారులు, సూత్రధారులు అందరూ బొమ్మిరెడ్డిపల్లె సుబ్బరాయుడు అనుచరులు, డిప్యూటీ సీఎం కుటుంబీకులే. రూ.కోట్ల సంపాదనతోనే నేడు ఎన్నికలలో ఓట్లను కొనేందుకు పన్నాగాలు పన్నుతున్నారన్నది వాస్తవం. ప్రజలు గమనిస్తూనే ఉన్నారు.
– శివ, చెరుకులపాడు
Comments
Please login to add a commentAdd a comment