అమృతహస్తం కార్యక్రమాన్ని అమలు చేయడం తమ వల్ల కాదని అంగ న్‌వాడీ కార్యకర్తలు చేతులెత్తేశారు. ఈ మేరకు 20 మంది అంగన్‌వాడీలు సీడీపీఓకు లేఖలు అందజేశారు.
పులివెందుల, న్యూస్‌లైన్ : అమృతహస్తం కార్యక్రమాన్ని అమలు చేయడం తమ వల్ల కాదని అంగ న్‌వాడీ కార్యకర్తలు చేతులెత్తేశారు. ఈ మేరకు 20 మంది అంగన్‌వాడీలు సీడీపీఓకు లేఖలు అందజేశారు. అంగన్‌వాడీ కేంద్రాలలో గర్భవతులు, బాలింతలకు మెరుగైన పౌష్టికాహారాన్ని అందించేందుకు ఇందిరమ్మ అమృతహస్తం పథకాన్ని సోమవారం నుంచి ప్రొద్దుటూరు, పులివెందులలో అమలు చేసేందుకు రంగం సిద్ధమైంది. అయితే ఈ పథకాన్ని అమలు చేయడం తమ వల్ల సాధ్యం కాదంటూ కొంతమంది వర్కర్లు లేఖలు ఇచ్చారు.
పులివెందుల ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలోని పులివెందుల అర్బన్, రూరల్, సింహాద్రిపురం, లింగాల, తొండూరు, వేముల, వేంపల్లె మండలాల్లోని 249అంగన్‌వాడీ, 23మినీ అంగన్‌వాడీ కేంద్రాలలో ఈ పథకం ప్రారంభం కావాల్సి ఉంది. అలాగే ప్రొద్దుటూరు రూరల్, అర్బన్ పరిధిలోని దాదాపు 356 అంగన్‌వాడీ కేంద్రాలలోఈ పథకాన్ని ప్రారంభించనున్నారు. ఈ కేంద్రాలలోని 2,165మంది గర్భిణులు, 4,131మంది బాలింతలకు ప్రతిరోజు(నెలకు24రోజులు) మధ్యాహ్న భోజనం, రోజూ 250మి.లీటర్ల పాలు, ఒక కోడి గుడ్డును అందించనున్నారు. ఈ పథకం ఆరంభం కాకముందే పులివెందులలో ఆయోమయం నెలకొంది. ఈ పథకాన్ని అమలు చేయలేమని కొంతమంది కార్యకర్తలు లేఖలు ఇచ్చారు.
అయితే ఎట్టి పరిస్థితులలోనూ పథకాన్ని ప్రారంభించాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. గ్రామ సమాఖ్య(వీవో)లకు బిల్లులకు సంబంధించిన బాధ్యతలు పెట్టడంపై కార్యకర్తలు పెదవి విరుస్తున్నారు. కష్టం మాకు.. బిల్లుల బాధ్యత వారికా అంటూ వారు ప్రశ్నిస్తున్నారు. తమకు ఇంతవరకు ఎలాంటి మెటీరియల్ రాలేదని.. ఏ విధంగా పథకాన్ని ప్రారంభించాలని కార్యకర్తలు పేర్కొంటున్నారు.
తమకు వచ్చే జీతాలతో పెట్టుబడి పెట్టలేమని చెబుతున్నారు. గర్భిణులు బాలింతలకు సంబంధించిన పాలు, కూరగాయల వ్యవహారాలపై ఎప్పటికప్పుడు లెక్కలు వీవోలకు చెప్పాల్సి వస్తుందన్న కారణంతో కొంతమంది వర్కర్లు ఈ పథకంపై నిరాసక్తత చూపుతున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై సీడీపీవో సావిత్రిదేవి వివరణ కోరగా. ఈ పథకాన్ని అమలు చేయలేమని దాదాపు 20మంది కార్యకర్తలు లేఖలు ఇచ్చిన మాట వాస్తవమేన న్నారు. అయితే అన్నిచోట్ల పథకాన్ని ప్రారంభిస్తామన్నారు.