సాక్షిప్రతినిధి, నల్లగొండ: ఒకప్పుడు నల్లగొండ జిల్లా అంటే కమ్యూనిస్టులకు కంచుకోట. ప్రధానంగా మిర్యాలగూడ, తుంగతుర్తి, నకిరేకల్, నల్లగొండ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు ఉన్న పార్టీ సీపీఎం. నకిరేకల్‌లో నర్రా రాఘవరెడ్డిని ఆరు పర్యాయాలు, నోముల నర్సింహయ్యను రెండుమార్లు గెలిపించుకున్న పార్టీగా రికార్డు సాధించింది.
మిర్యాలగూడ ఎంపీ సీటును వరుసగా మూడుసార్లు దక్కించుకొని భారత కమ్యూనిస్టు మార్క్సిస్టు పార్టీ (సీపీఎం) జిల్లాలో తిరుగులేనిదిగా వెలుగొందింది. ఆ తర్వాత పార్టీలో పెరిగిపోయిన అన్యపోకడల వల్ల ఉనికే ప్రమాదంలో పడింది. వరుసగా ఏడు విజయాల తర్వాత నకిరేకల్‌లో కోలుకోలేని దెబ్బతిన్నది. ఒక్క మిర్యాలగూడలో మాత్రమే పరువు దక్కించుకుంది. ఈ పరిణామాలన్నింటికీ కేవలం ప్రజల్లో విశ్వాసం కోల్పోవడమొక్కటే కారణం కాదు. ఆ పార్టీలోని కొందరు నాయకుల పనితీరు ప్రధాన కారణంగా నిలిచింది. అవినీతి ఆరోపణలు వచ్చిన వారూ నేతలుగా చెలామణి అయ్యారు. వారిపై ఎలాంటి చర్యా తీసుకోలేదు. ఇది చూసి మరికొందరు, ఇలా.. పలు చోట్ల పార్టీ సిద్ధాంతాలకు, నియమ నిబంధనలకు నీళ్లొదిన వారు పెత్తనం చెలాయించారు.
కొందరయితే ఏకంగా కాంగ్రెస్ గూటికి చేరారు. మొన్నటి గ్రామ పంచాయతీ ఎన్నికల్లోనూ అనుకున్నంత స్థాయిలో ఫలితాలు రాబట్టలేక పోయింది. మరికొందరు నాయకులు ఏకంగా రియల్ ఎస్టేట్ వ్యాపారుల అవతారం ఎత్తారు. చివరకు ఇది పార్టీ అనుబంధ సంఘాల నాయకులకూ పాకింది. వీరిలో కొందరు పైరవీకారులుగా మారారు. నల్లగొండ మున్సిపాలిటీలో కౌన్సిలర్‌గా పనిచేసిన సీపీఎం నాయకుడు ఒకరిపై బహిరంగంగానే విమర్శలు వ్యక్తమయ్యాయి. భూ కబ్జాలు, లిటిగేషన్లు, బలవంతంగా డబ్బులు వసూలు చేయడం వంటి ఆరోపణలు ఎన్నో ఉన్నాయి.
కానీ, పార్టీలో పేరుకుపోయిన కుల సంస్కృతి వల్ల నాయకత్వం చర్యలకు సాహసించలేక పోయిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరి కొద్ది నెలల్లో సార్వత్రిక ఎన్నికలున్న తరుణంలో సీపీఎం ఇల్లును చక్కబెట్టుకునే పనిలో పడింది. నిబంధనలు అతిక్రమించిన వారిని వదులుకోవడమే బెటర్ అన్న నిర్ణయానికి వచ్చినట్లు కనిపిస్తోంది. ఇది తాత్కాలికంగా కొంత నష్టం చేకూర్చినా, దీర్ఘకాలంలో సత్ఫలితాలు ఇస్తుందన్న భావనతో కొందరిపై క్రమశిక్షణ వేటు వేయడం మొదలు పెట్టింది. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు ఇప్పటికే జిల్లాలో నలుగురిపై చర్యలు తీసుకున్నారు. మునుగోడు నియోజవకర్గం పరిధిలో చౌటుప్పల్, సంస్థానారాయణపురం మండలాలకు చెందిన ఇద్దరు నాయకులను జిల్లా కమిటీ నుంచి తగ్గించినట్టు సమాచారం. అదే మాదిరిగా, సూర్యాపేట నియోజకవర్గంలో సూర్యాపేట, నెమ్మానికి చెందిన ఇద్దరు జిల్లా స్థాయి నాయకులపైనా వేటు పడిందని చెబుతున్నారు.
కాగా, ఆలేరు డివిజన్ కార్యదర్శిని ఆ పదవి నుంచి తొలగించారు. జిల్లా కమిటీలో సభ్యునిగా మాత్రం ఆయనను కొనసాగిస్తున్నారని సమాచారం. ఇటీవల జరిగిన జిల్లా కమిటీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కేవలం ఇంతటితోనే ఆగిపోకుండా ఆరోపణలు ఉన్న మరో తొమ్మిది మందితో రెండో జాబితాను కూడా సిద్ధం చేశారని వినికిడి. మొత్తానికి చానాళ్ల తర్వాత సీపీఎంలో క్రమశిక్షణ చర్యలు మొదలైనట్లు కనిపిస్తోంది. మున్ముం దు ఆ పార్టీలో ఇంకెలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో వేచి చూడాల్సిందే.
సీపీఎంలో ప్రక్షాళన..!
Published Mon, Sep 23 2013 3:45 AM | Last Updated on Fri, Mar 22 2019 6:17 PM
Advertisement
Advertisement