శాతవాహన యూనివర్సిటీ, న్యూస్‌లైన్ : శాతవాహన అనుబంధ పీజీ కళాశాల వసతి గృహంలో బుధవారం గ్యాస్ పైప్ లీకై మంటలు చెలరేగాయి. అసిస్టెంట్ కుక్ ఇ.సంతోష్ గాయపడ్డాడు. విద్యార్థులకు ప్రతీ బుధవారం మధ్యాహ్నం చపాతీ చేసి ఇస్తారు. ఇందులో భాగంగా చపాతీ చేస్తుండగా సిలిండర్ పైప్ లీకై ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. చపాతీల కోసం అక్కడ క్యూలో నిల్చున్న విద్యార్థులు భయపడి పరుగులు పెట్టారు. అసిస్టెంట్ కుక్ చాకచాక్యంగా సిలిండర్ ఆఫ్ చేయడంతో ప్రమాదం తప్పింది. ఈ క్రమంలో ఆయన గాయపడ్డాడు. కార్మికులు వర్సిటీ పీజీకాలేజీ ప్రిన్సి పాల్ నమ్రత, అధికారులకు సమాచారం అందించడంతో వారు సంతోష్‌ను ఆస్పత్రికి తరలించారు.
కార్మికుల ధర్నా..
తమ బాగోగులను అధికారులు పట్టించుకోవడం లేదని కార్మికులు ధర్నాకు దిగారు. గతంలో ఇలాంటి ప్రమాదాలు జరిగిన సమయంలో బీమా కల్పించాలని కోరినా ఇప్పటికీ నెరవేర్చలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మిక చట్టం ప్రకారం రూ.6,700 చెల్లించాల్సి ఉన్నా ఇవ్వడం లేదని, వెంటనే జీతాలు పెంచాలని, ప్రమాద బీమా సౌకర్యాన్ని కల్పించాలని డిమాండ్ చేశారు. పని చేసే ప్రాంతంలో మెడికల్ కిట్ ఏర్పాటు చేయాలని, నెలకోసారి రెగ్యులేటర్ మార్చాలని డిమాండ్ చేశారు. వీటిని అంగీకరించని పక్షంలో ఆందోళనకు దిగుతామని తెలిపారు. ధర్నాలో ఆల్ యూనివర్సిటీస్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు ఎం.శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి బి.శంకరయ్య తదితరులు పాల్గొన్నారు.
పీజీ కాలేజీ హాస్టల్‌లో అగ్నిప్రమాదం
Published Thu, Nov 28 2013 3:26 AM | Last Updated on Sat, Sep 2 2017 1:02 AM
Advertisement
Advertisement