నెత్తురోడుతున్న రహదారులు | increase road accident in West Godavari | Sakshi
Sakshi News home page

నెత్తురోడుతున్న రహదారులు

Published Thu, Aug 30 2018 8:44 AM | Last Updated on Tue, Mar 3 2020 1:38 PM

increase road accident in West Godavari  - Sakshi

రోడ్డు ప్రమాదాలు చాలా వరకూ మానవ తప్పిదాల కారణంగానే చోటు చేసుకుంటున్నాయి. డ్రైవింగ్‌లో ఎంతటి నిపుణులైనా నిబంధనలు పాటించకుంటే ప్రమాదాలు తప్పడం లేదు. దురదృష్టవశాత్తూ సినీ నటుడు, రాజకీయ నేత నందమూరి హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో మృతిచెందడం ఇటువంటిదే. ఈ ప్రమాదానికి ప్రధాన కారణం డ్రైవింగ్‌ సీటులో ఉన్న హరికృష్ణ  సీటు బెల్టు ధరించకపోవడం, అత్యంత వేగంగా వాహనం నడపడం అని నల్గొండ పోలీసులు చెబుతున్నారు. ఇక మన జిల్లాకు వస్తే రహదారి ప్రమాదాల కారణంగా అధికారుల గణాంకాల ప్రకారం ఏటా రెండు వేలకు పైగా మృత్యువాత పడుతున్నారు. మరో 700 మంది వరకూ క్షతగాత్రులవుతున్నారు. లెక్కల్లోని రాని ప్రమాదాల్లో మరో వెయ్యిమంది వరకూ గాయాలు పాలవుతున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో జిల్లాలో రోడ్డు భద్రతపై పోలీసులు తీసుకుంటున్న నియంత్రణ చర్యలు. నిపుణుల సూచనలు తెలుసుకుందాం. 

నిడమర్రు: వాహనచోదకుల నిర్లక్ష్యం, ట్రాఫిక్‌ నిబంధనలు పాటించకపోవడం ప్రాణాలకు ముప్పుగా మారుతోంది. రోడ్డు సేప్టీ నిబంధనలు తప్పక పాటించాలని అధికారులు సూచిస్తున్నారు.

డ్రైవింగ్‌లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇలా.. 
► కార్లు, జీపులు, బస్సులు, లారీలు నడిపే సమయంలో ముఖ్యంగా కాళ్ల సమీపంలో ఎలాంటి వస్తువులు లేకుండా చూసుకోవాలి, బ్రేక్‌ కిందకు వచ్చినప్పుడు వాటిని నొక్కినా బ్రేక్‌ పట్టక ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది.

► వాహనం నడిపేటప్పుడు క్లచ్, బ్రేకు ఎక్స్‌లేటర్‌ విషయంలో కచ్చితమైన అవగాహన అవసరం. కొత్తగా కొన్న వాహనాన్ని 

► కారు పార్కింగ్‌ చేసేటప్పుడు సెంట్రల్‌ బ్రేకు వేస్తుంటాం, అయితే కారు వేగంగా వెళ్తున్నప్పుడు అదే సెంట్రల్‌ బ్రేకు ప్రమాదానికి కారణమవ్వవచ్చు. ఎవరైనా చిన్న పిల్లలుంటే దాన్ని పట్టుకొని లాగితే ప్రమాదం. అలా లాగితే నాలుగు చక్రాలకు బ్రేకులు పడతాయి. 

► టైర్లలో గాలి తక్కువగా ఉంటే వెంటనే గాలి నింపుకోవాలి. లేకుంటే వేగంగా వెళ్తుండగా మొత్తం గాలిపోతే కారు నెమ్మదిగా వెళ్లడంతో పాటు ఇంధనం ఎక్కువగా ఖర్చవుతుంది. అదీగాక పంక్చర్‌ పడితే వాహనాన్ని నియంత్రించడం కష్టం. ప్రమాదం జరిగే అవకాశం ఎక్కువ.

వర్షాకాలంలో జాగ్రత్తలు ఇలా..
ప్రమాదాల శాతం ఎక్కువగా పొగమంచు రోజుల్లోనూ, వర్షాకాలంలో జరుగుతున్నట్టు గణాంకాలు  చెబుతున్నాయి. వర్షంలో తడిసిన / నీటితో నిండిన రోడ్లపై వేగంగా వెళ్లే వాహనాన్ని స్లో చెయ్యటం క్లిష్టం, అలాంటి సందర్భాల్లో మితిమీరిన వేగం వద్దు. ప్రత్యేకించి కొండలు, లోయల ప్రాంతాల్లో ప్రయాణించేటప్పుడు మరింత అప్రమత్తతో డ్రైవ్‌ చెయ్యాలి. వైఫర్స్‌ సరి చేసుకోవాలి. పగటి పూట హెడ్‌లైట్స్‌ వేయాలి. వాహనాల మధ్య దూరం ఎక్కువ ఉండాలి.

ద్విచక్ర వాహనాల విషయంలో..
అధికారులు ఎన్నిసార్లు హెచ్చరించినా ద్విచక్ర వాహనదారులు హెల్మెట్‌ ధరించక ప్రాణాలమీదకు తెచ్చుకుంటున్నారు. పలుమార్లు జరిమానా కడుతున్నా హెల్మెట్‌ ధరించడం లేదని జిల్లా ట్రాఫిక్‌ డీఎస్పీ పి.భాస్కరరావు చెప్పారు. 

జిల్లాలో డీటీ ఆర్బీ అనే ప్రత్యేక వింగ్‌
జిల్లాలో రహదారిపై జరిగే ప్రమాదాల నివారణకు డీటీఆర్బీ(డిస్ట్రిక్‌ ట్రాఫిక్‌ రికార్డ్‌ బ్రాంచ్‌) అనే ప్రత్యేక వింగ్‌ ఏర్పాటు చేశారు. ఈ వింగ్‌ జిల్లా పోలీసులు, ఆర్టీవో అ«ధికారులకు నోడల్‌ ఏజెన్సీగా సహకరిస్తుంది. జిల్లాలో ఎక్కడైనా రోడ్డు ప్రమాదం జరిగితే దానికి కారణాలు, తర్వాత తీసుకోవల్సిన చర్యలు, ప్రమాదానికి సంబంధించిన డేటా సేకరించి అనుబంధ శాఖలకు అందిస్తారు. హైవేలపై డ్రైవర్లను అప్రమత్తం చేసేందుకు సిద్ధాంతం నుంచి ఏలూరు వరకూ 23 పెట్రోలింగ్‌ వాహనాల్లో సిబ్బందిని అందుబాటులో ఉంచినట్టు ట్రాఫిక్‌ డీఎస్పీ పి.భాస్కరరావు తెలిపారు.

హరికృష్ణ మృతికి ఇదే కారణమా..!
సీటు బెల్టు పెట్టుకోని కారణంగా కార్లకు ఉండే సెంట్రల్‌ లాకింగ్‌ సిస్టం ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు రాపిడికి ముందుగా తెరుచుకునేవి కారు తలుపులే. అలాంటి సమయంలో సీటు బెల్టు పెట్టుకోకపోవడంతో అనేక మంది ప్రమాదాల్లో వాహనంలోంచి విసిరేసినట్లు పడటంతో తీవ్రంగా గాయాలై మృతి చెందిన సంఘటనలు ఉన్నాయి. హరికృష్ణ మృతి విషయంలో ఇదే జరిగింది. డివైడర్‌ను ఢీకొట్టిన వెంటనే కారు తిరగబడుతున్న సమయంలో సీట్‌ బెల్టు పెట్టుకోకపోవడంతో హరికృష్ణ వాహనంలోచి బయటకు విసిరి వేయబడి తలకు బలమైన గాయమైనట్టు తెలుస్తోంది.

నాలుగు ప్రాంతాల్లో స్పీడ్‌ గన్స్‌ ఏర్పాటు
రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువ శాతం మితిమీర వేగం వల్లే సంభవిస్తున్నాయి. వీటిని నియంత్రించేందుకు జిల్లాలో కొవ్వూరు, తణుకు, భీమవరం, ఏలూరు ప్రాంతాల్లోని జాతీయ రహదారుల వెంబడి స్పీడ్‌ లేజర్‌గన్స్‌ ఏర్పాటు చేశాం. రహదారి వెంబడి ఉంచిన స్పీడ్‌ లిమిట్‌ సూచీల్లో ఉన్న వేగంకంటే అధిక వేగంతో వాహనాలు నడిపిన వారికి ఈ–చలానా ద్వారా జరిమానాలు విధిస్తున్నాం. ఈ చలానాలో వాహనం ఫొటో, ఏ సమయంలో, ఎంత వేగంతో వెళ్లింది ఉంటుంది, దీంతో వారు వేగం లిమిట్‌ దాటకుండా నియంత్రిస్తున్నాం.
–పి.భాస్కరరావు, డీఎస్పీ, ట్రాఫిక్‌

హైవేలపై ప్రత్యేక డ్రైవ్స్‌ 
పెట్రోలింగ్‌ వాహనాల్లో సిబ్బంది హైవేలపై ప్రత్యేక డ్రైవ్స్‌ నిర్వహిస్తున్నారు. ప్రమాదం జరిగిన 5 నుంచి 10 నిమిషాల్లో స్పాట్‌కు చేరి క్షతగాత్రులను హాస్పటల్‌కు తరలించేలా పెట్రోలింగ్‌ సిబ్బంది బాధ్యతలు నిర్వహిస్తున్నారు. రోడ్డు మార్జిన్‌లో వాహనాలు నిలిపినా, అపసవ్య దిశలో వాహనాలు నడుపుతున్న వారికి కౌన్సిలింగ్‌ ఇస్తాం. రోడ్డు ప్రమాదాలకు కారణాలు సేకరించి. అవసరమైన సూచనలు అందించేందుకు కృషి చేస్తున్నాం.              
–చావా సురేష్‌ ఎస్సై, డీటీ ఆర్బీ

స్వీయ నియంత్రణ అవసరం 
వాహనాలు నడిపేవారికి డ్రైవింగ్‌ విషయంలో స్వీయ నియంత్రణ ఉంటే ప్రమాదాలు జరగవు.  రహదారుల అధ్వానంగా ఉండటం, హైవేలపై రోడ్డు నిర్వహణ సక్రమంగా చెయ్యకపోవడం వల్ల కూడా ప్రమాదాలు జరుగుతున్నాయి. మితిమీరిన వేగంతో జరిగిన ప్రమాదాల్లో అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నట్టు రోడ్డు ప్రమాద కేసుల ద్వారా తెలుస్తోంది. 
–మోపాటి బాల పరమేశ్వరరావు, సీనియర్‌ న్యాయవాది, భీమవరం
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement