చెట్టు మీద దెయ్యం.. అమ్మో భయం! | Increasing Phasmophobia Cases In Young Children And Adolescents | Sakshi
Sakshi News home page

చెట్టు మీద దెయ్యం.. అమ్మో భయం!

Published Sun, Feb 23 2020 12:47 PM | Last Updated on Sun, Feb 23 2020 1:10 PM

Increasing Phasmophobia Cases In Young Children And Adolescents - Sakshi

అర్థరాత్రి వేళ నిద్రలో లేచి పెద్ద పెద్దగా కేకలు వేయడం..వారిలోకి ప్రేతాత్మ ప్రవేశించినట్లు వ్యవహరించడం..ఎవరో మాట్లాడినట్లు మాట్లాడటం..పళ్లు బిగపట్టడం వంటి లక్షణాలు ఇటీవల కాలంలో యువత, చిన్నారుల్లో పెరుగుతున్నాయి. ఒకప్పుడు అత్తమామల నుంచి వేధింపులకు గురయ్యే మహిళలు, భర్తతో సత్సంబంధాలు లేనివారు అలా ప్రవర్తించేవారని, ప్రస్తుతం సినిమాలు, సీరియల్స్‌ ప్రభావంతో యువత, చిన్నారులు లేనిపోనివి ఊహించుకుని భయపడుతుంటారని, ఈ భయం ముదిరి డిప్రెషన్‌లోకి వెళ్లిపోతారని, సకాలంలో మేల్కొని కౌన్సెలింగ్‌ తీసుకోవాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. 

విజయవాడలో ఒక ప్రైవేటు సంస్థలో పనిచేస్తున్న పదిహేను మంది యువతులు అదే సంస్థకు చెందిన హాస్టల్‌లో ఉంటున్నారు. నెల రోజుల కిందట వీరిలో నలుగురు రాత్రివేళల్లో దెయ్యం పట్టినట్లు వ్యవహరించడంతో మిగిలిన యువతులు కూడా తీవ్ర భయాందోళనకు గురవడం ప్రారంభించారు. రాత్రి వేళల్లో వారంతా బిగ్గరగా అరవడం, పళ్లు బిగపట్టం వంటి లక్షణాలు ఉండటంతో వారిని ఓ మానసిక వైద్యుని వద్దకు తీసుకెళ్లారు. అక్కడ 15 మంది యువతులను కూర్చోపెట్టి అసలు ఏమి జరుగుతుందని వివరాలు తెలుసుకు అనంతరం కౌన్సెలింగ్‌ ఇచ్చారు. దీంతో వారు ప్రస్తుతం ఎలాంటి భయాలు లేకుండా ఉన్నట్లు చెబుతున్నారు.  

వారం రోజుల కిందట నందిగామలో డిగ్రీ చదువుతున్న ఓ యువతిని దెయ్యం పట్టిందంటూ మానసిక వైద్యుని వద్దకు తీసుకు వచ్చారు అక్కడ వైద్య పరీక్షల అనంతరం కౌన్సెలింగ్‌ కోసం సైకాలజిస్ట్‌ వద్దకు పంపించారు. అక్కడ ఏ సమయంలో ఎలా ప్రవర్తిస్తుందనే విషయాలను తెలుసుకుని సరైన రీతిలో కౌన్సెలింగ్‌ ఇవ్వడంతో సమస్యకు పరిష్కారం లభించింది. 

సాక్షి, విజయవాడ : ఇటీవల కాలంలో తమ పిల్లల ప్రవర్తనలో మార్పు వస్తుందని, రాత్రి వేళల్లో మంచంపై నుంచి లేచి నడుచుకుంటూ వెళ్లిపోవడం, పెద్దగా కేకలు వేస్తూ మాట్లాడుతున్నారంటూ మానసిక  వైద్యుల వద్దకు వస్తున్న వారి సంఖ్య పెరుగుతున్నట్లు పలువురు వైద్యులు చెబుతున్నారు.   వారిలో కొందరు తమ పిల్లల్లోకి మృతిచెందిన వారి ప్రేతాత్మ ప్రవేశించి అలా ప్రవర్తిస్తున్నట్లు చెబుతుండగా, ఏం జరిగిందో తెలియడం లేదని, పిచ్చి పిచ్చిగా వ్యవహరిస్తున్నారంటూ మరికొందరు చెబుతున్నారు. పిల్లల్లో కనిపించిన లక్షణాలతో దెయ్యం పట్టిందని భావించి పూజలు, తాయత్తులు కట్టించే వారి సంఖ్య కూడా ఇటీవల కాలంలో ఎక్కువుగానే ఉంటున్నట్లు చెబుతున్నారు.  

మానసిక సమస్యే... 
దెయ్యం పట్టినట్లు వ్యవహరించడం.. ఏవేవో మాట్లాడటం వంటివి కూడా మానసిక సమస్యలుగానే గుర్తించాలని వైద్యులు అంటున్నారు. దెయ్యం అంటే భయపడడాన్ని వైద్య పరిభాషలో ఫాస్మోఫోబియా అంటారు. అలాంటి వారిని గుర్తించి సరైన వైద్యం అందించాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు. మరికొందరు సైకోసిస్‌ అనే మానసిక వ్యాధి కారణంగా దెయ్యం పట్టినట్లు, ప్రేతాత్మ తమలోకి ప్రవేశించినట్లు ప్రవర్తిస్తుంటారని నిపుణులు చెబుతున్నారు. కొందరిలో హిస్టారికల్‌ ప్రాబ్లమ్స్‌ కూడా ఉంటాయని వారు తెలిపారు. అలాంటి వారిని గుర్తించి మానసిక వైద్యుల వద్దకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. అక్కడ చికిత్సతో పాటు, సైకాలజిస్ట్‌ కౌన్సెలింగ్‌ ఇస్తారని చెబుతున్నారు.   

సీరియల్స్, సినిమాల ప్రభావమే... 
ప్రస్తుతం సీరియల్స్, సినిమాల్లో మృతి చెందిన ప్రేతాత్మలు మరొకరిలోకి ప్రవేశించడం, ఊహించని శక్తిని పొందడం వంటి సన్నివేశాలు ఎక్కువ గా చూపిస్తున్నట్లు వైద్యనిపుణులు చెపుతున్నారు. అంతేకాకుండా దెయ్యం పట్టడం వంటివి కూడా ఉంటున్నాయి. అలాంటి సన్నివేశాలు చిన్నారుల మనస్సుల్లో ఉండిపోయి. రాత్రివేళల్లో అలా వ్యవహరించే అవకాశం ఉందని చెబుతున్నారు. తలస్నానం చేసి బయటకు వెళ్లకూడదని, అర్ధరాత్రి వేళల్లో దెయ్యాలు తిరుగుతుంటాయని చిన్నారులకు తల్లిదండ్రులు చెప్పడం కూడా వారిపై ప్ర భావం చూపుతున్నట్లు చెబుతున్నారు. మన మనస్సులో దెయ్యం అనే ఆలోచన లేకుంటే ఎలాంటి భయాలు ఉండవని, నిత్యం సినిమాలు, సీరియల్స్‌లో చూస్తున్న ఘటనలతోనే ఇలాంటివి చోటుచేసుకుంటున్నట్లు చెబుతున్నారు. 

దెయ్యాలు అభూత కల్పనలే..  
దెయ్యాలు, భూతాలు అనేవి అభూత కల్పనలు మాత్రమే. ఒకసారి మృతి చెందిన వారి ఆత్మలు తిరిగి రావడం అనేది జరగదు. ప్రేతాత్మలు అనేవి ఊహాలు మాత్రమే. భూతాలు, భూత వైద్యం అనేవి నమ్మదగిన విషయాలు కాదు. మనం నిత్యం చూస్తున్న ఘటనలు మనస్సులో ఉండిపోయి రాత్రివేళల్లో అలాగే ప్రవర్తించడం జరుగుతుంది. సినిమాలు, సీరియల్స్‌ ప్రభావం చిన్నారులపై తీవ్రంగా ఉంటుంది. సైకోసిస్, పొసిషన్‌ సిండ్రోమ్, హిస్టీరికల్‌ వంటి మానసిక సమస్యల కారణంగా కూడా అలా ప్రవర్తించే అవకాశం ఉంది. పిల్లల దెయ్యంపట్టినట్లు ప్రవర్తించిన సమయంలో మానసిక వైద్యులను సంప్రదించాలి.వైద్యులు వారిని పరీక్షించి అవసరమైతే మందులు ఇవ్వడం, సైకాలజిస్ట్స్‌తో కౌన్సెలింగ్‌ ఇప్పించడం చేస్తారు. అంతేకాని భూత వైద్యం వంటి వాటిని ఆశ్రయించడం మంచిది కాదు.   – డాక్టర్‌ టీఎస్‌రావు, రిహాబిలిటేషన్‌ సైకాలజిస్ట్‌  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement