కర్నూలు(అగ్రికల్చర్), న్యూస్‌లైన్: ప్రభుత్వం ఎట్టకేలకు ఇన్‌పుట్ సబ్సిడీ మంజూరు చేసింది. 2011, 2012 సంవత్సరాల్లో అనావృష్టి పరిస్థితులతో పంట కోల్పోయిన రైతులకు త్వరలో పెట్టుబడి రాయితీ లభించనుంది. ఈ మేరకు జీవో విడుదలైనా.. వ్యవసాయ శాఖ నుంచి ప్రత్యేక ఉత్తర్వులు అందాల్సి ఉంది. ఈ ప్రక్రియ పూర్తయి ఇన్‌పుట్ సబ్సిడీ రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ కావడానికి మరో నెల రోజులు పట్టవచ్చని తెలుస్తోంది. 2011వ సంవత్సరంలో అనావృష్టి కారణంగా పంటలు దెబ్బతిన్నాయి. ఇందుకు సంబంధించిన ఇన్‌పుట్ సబ్సిడీ చాలా వరకు పంపిణీ చేసినా.. చివరన రూ.21.91 కోట్లను ప్రభుత్వం ఇతర ప్రాంతాలకు మళ్లించింది. 2012 నవంబర్ నెల నుంచి వేలాది మంది రైతులు ఇన్‌పుట్ సబ్సిడీ కోసం అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. తాజాగా జీవోతో వీరికి ఊరట లభించనుంది.
2012లోనూ వర్షాభావ పరిస్థితులతో కరువు పరిస్థితులు ఏర్పడ్డాయి. జిల్లా అధికారుల ప్రతిపాదనల మేరకు ప్రభుత్వం రూ.239 కోట్ల ఇన్‌పుట్ సబ్సిడీ మంజూరు చేసింది. ఈ మేరకు రైతుల పేర్లు, బ్యాంకు ఖాతా నంబర్లు, ఇన్‌పుట్ సబ్సిడీ వివరాలను హైదరాబాద్‌కు పంపితే పరిహారం విడుదల చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఇందుకు అనుగుణంగా మొదటి దశలో పంపిన వివరాల మేరకు రూ.198 కోట్లు విడుదల చేయగా.. ఆయా ఖాతాలకు జమ చేశారు. రెండో విడతలో 22,100 మంది రైతులకు రూ.14,13,23,194, మూడో విడతలో 17,217 మంది రైతులకు రూ.10,46,02,189, నాల్గో విడతలో 3,470 మంది రైతులకు రూ.2,13,90,160 పరిహారం కోసం ప్రతిపాదనలు పంపారు.
పెండింగ్‌లోని మూడు విడతలకు సంబంధించి 42787 మంది రైతులకు రూ.26,73,15,543లు మంజూరైంది. వారం, పది రోజుల్లో ట్రెజరీ ప్రక్రియను పూర్తి చేసి బ్యాంకుల వారీగా డీడీలు ఇచ్చి రైతుల ఖాతాల్లో జమ అయ్యేలా చూస్తామని జేడీఏ ఠాగూర్ నాయక్ తెలిపారు. ఇదిలాఉండగా 2010 జల్ తుపాను నుంచి 2013 అక్టోబర్ నెల భారీ వర్షాల వరకు ఇన్‌పుట్ సబ్సిడీ రూ.7.60 కోట్లు విడుదల కావాల్సి ఉంది. ప్రభుత్వం దీనిని పట్టించుకోకపోవడం పట్ల రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇన్‌పుట్ సబ్సిడీ విడుదల
Published Sat, Dec 28 2013 4:18 AM | Last Updated on Sat, Sep 2 2017 2:01 AM
Advertisement
Advertisement