మృతి చెందిన విద్యార్థి శివహర
చిలంకూరు (ఎర్రగుంట్ల) : సాధారణంగా గుండెపోటు పెద్ద వయసు వారికి వస్తుంది. అయితే 17 ఏళ్లకే చిలంకూరుకు చెందిన ఓ విద్యార్థి గుండెపోటుతో మృతి చెందాడు. కళాశాలకు వెళ్లడానికి తయారవుతున్న తరుణంలో.. అమ్మా.. అంటూ ఒక్క సారిగా కుప్పకూలిపోయాడు. తల్లి వచ్చి చూసేలో గానే విగతజీవిగా కనిపించాడు. అప్పుడే నూరేళ్లు నిండాయా నాయనా అంటూ ఆమె గుండెలవిసేలా రోదించింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. చిలంకూరులోని ఇందిర కాలనీలో నివాసం ఉండే నాగార్జున, రమాదేవి పెద్ద కుమారుడు జలపతి శివహర (17) అదే గ్రామంలోని జెడ్పీ పాఠశాలలో పదో తరగతి వరకు చదివాడు. ఇంటర్మీడియట్ రెండో సంవత్సరాన్ని ఎర్రగుంట్లలోని శ్రీ గౌతమ్ జూనియర్ కళాశాలలో చదువుతున్నాడు. మంగళవారం ఉదయాన్నే కళాశాలకు వెళ్లాలని, క్యారీ కోసం అన్నం చేయాలని అమ్మకు చెప్పాడు.
ఇంకా కొన్ని నిమిషాలలో క్యారీ, పుస్తకాలు తీసుకొని కళాశాలకు పోవాల్సిన సమయంలో.. అమ్మా అంటూ ఒక్క సారిగా కుప్ప కూలిపోయి కింద పడి మృతి చెందాడు. శివహర చదువుకుంటూనే తల్లిదండ్రులకు చేదోడువాదోడగా ఉంటూ సాయం చేస్తుండే వారు. తండ్రి నాగార్జున కూలీ పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. చేతికి వచ్చిన కుమారుడు మృతి చెందడంతో తల్లిదండ్రులు కన్నీమున్నీరుగా విలపించారు. ఈ విషయం తెలుసుకున్న వైఎస్సార్ సీపీ జమ్మలమడుగు నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్ ఎం.సుధీర్‌రెడ్డి మృతుడి ఇంటి వద్దకు వెళ్లి బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. శ్రీ గౌతమ్ కళాశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు, చిలంకూరు జెడ్పీ పాఠశాల ఉపాధ్యాయులు వెళ్లి శివహర మృతదేహాన్ని చూసి విషణ్ణవదనంలో మునిగిపోయారు.
Comments
Please login to add a commentAdd a comment