=టీడీపీలోకి వస్తే పార్టీ చిన్నాభిన్నం
=అయ్యన్నపాత్రుడు ధ్వజం
విశాఖపట్నం, న్యూస్‌లైన్: ‘జిల్లా మంత్రి గంటా శ్రీనివాసరావుది ఐరెన్ లెగ్. ఆయన ఏ పార్టీలో అడుగుపెడితే ఆ పార్టీ భూస్థాపితమవుతుంది. టీడీపీలో అడుగుపెట్టగానే పార్టీ అధికారాన్ని కోల్పోయింది. ప్రజారాజ్యంలోకి వెళ్లాక ఆ పార్టీ కనుమరుగైంది. చివరగా కాంగ్రెస్‌లోకి వెళితే ఇప్పుడు ఆ పార్టీ కూడా ఉనికిని కోల్పోయింద’ంటూ టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు చింతకాయల అయ్యన్నపాత్రుడు ధ్వజమెత్తారు.
కోటవురట్ల మండలం రాజుపేట బీసీ కాలనీ ఓటర్లను రాజుపేట పంచాయితీలో ఉంచాలంటూ కలెక్టర్‌ను కోరేందుకు వచ్చిన పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాడుగుల ఎమ్మెల్యే గవిరెడ్డి రామానాయుడుతో కలిసి సోమవారం కలెక్టరేట్ వద్ద విలేకరులతో మాట్లాడారు. గంటా మళ్లీ టీడీపీలోకి వస్తే తమ పార్టీ కూడా చిన్నాభిన్నమైపోతుందన్న అనుమానాన్ని వ్యక్తం చేశారు. గంటా టీడీపీలోకి రావడాన్ని తాను వ్యతిరేకించడం లేదని, రాజకీయాల్లో విలువలు లేని గంటాలాంటి దొంగలను పార్టీలోకి తీసుకోవాలా? వద్దా? అన్నది పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడే నిర్ణయించుకోవాలన్నారు.
రాష్ట్రంలో అవినీతికి ఆజ్యం పోసిన వ్యక్తి చంద్రబాబని లోగడ గంటా ఆరోపించిన విషయాన్ని గుర్తుచేశారు. మరో మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు కూడా జగన్‌ను విమర్శించారని, ఆయన వైఎస్సార్‌సీపీలో చేరుతుండడాన్ని చూస్తే రాజకీయ నాయకులపై ప్రజలకు ఎలాంటి అభిప్రాయం కలుగుతందని ప్రశ్నించారు.
కలెక్టరేట్‌పై గంటా కన్ను..
విశాఖ కలెక్టర్ కార్యాలయం పాతబడి పోయిందని, దానిని విశాలమైన స్థలంలో పునఃనిర్మించాలని గంటా చెబుతుండటాన్ని బట్టి ఆయన కన్ను కలెక్టరేట్‌పై పడినట్లుందని అయ్యన్నపాత్రుడు ఆరోపించారు. విశాఖలో పోర్టు, కలెక్టరేట్‌లే అతి పురాతన కట్టడాలన్నారు. వీటిలో పోర్టు ద్వారా ఇప్పటికే అక్రమంగా వందల కోట్లు ఆర్జించిన గంటా ఇప్పుడు కలెక్టరేట్‌ను ఆక్రమించడానికి ప్రయత్నిస్తున్నారన్నారు. జిల్లా గ్రంథాలయ సంస్థ, నర్సీపట్నం బస్టాండ్, జీవీఎంసీ క్వార్టర్స్ స్థలాలను లాంగ్‌లీజ్, పీపీపీ ద్వారా ఇప్పటికే ఆక్రమించారని ఆరోపించారు.
గంటాది ఐరెన్ లెగ్
Published Tue, Dec 3 2013 12:57 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
Advertisement
Advertisement