టీడీపీ హయాంలో జిల్లా సహకార కేంద్ర బ్యాంకు రైతులకు బదులుగా తన అనుయాయులకు ఆర్థిక వనరుగా మారింది. రైతుల సంక్షేమానికి వినియోగించాల్సిన కోట్ల రూపాయల నిధులను పక్కదారి పట్టించి తమ విలాసాలకు వాడుకోవడం పట్ల పలు విమర్శలు వినిపిస్తున్నాయి.
సాక్షి , రాజమహేంద్రవరం : ‘ఆవు చేలో మేస్తుంటే దూడ గట్టున మేస్తుందా’ అనే సామెతను టీడీపీ సర్కారు హయాంలో జిల్లా తెలుగు తమ్ముళ్లు బాగా వంట పట్టించుకున్న ట్టున్నారు. సీఎం స్థాయిలో చంద్రబాబే విమానయానాలతో ప్రజా సొమ్మును దుబారా చేస్తుంటే తాము తక్కువ తిన్నామా అన్నట్టు ఆ పార్టీ నుంచి జిల్లా కేంద్ర సహకార బ్యాంకు చైర్మన్‌గా వ్యవహరించిన వరుపుల రాజా రైతుల సొమ్ము ఇష్టానుసారంగా దుబారా చేశారనే ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. వీటిని నియంత్రించాలి్సన డీసీసీబీకి గతంలో సీఈఓగా పనిచేసి రిటైరయిన హేమసుందర్, ప్రస్తుత సీఈఓ మంచాల ధర్మారావు వంతపాడారు. డీసీసీబీపై ఎంతో నమ్మకం ఉండబట్టే జిల్లాలో లక్షలాది మంది రైతులు రూ.1000 కోట్లు డిపాజిట్లు చేశారు. కేవలం ఐదేళ్ల కాలంలో తమ నమ్మకాన్ని వమ్ము చేసి బ్యాంక్‌పై విశ్వాసం కోల్పోయేలా వ్యవహరించారని తాజాగా వెలుగుచూస్తున్న ఉదంతాలపై రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
విలాసాలు, విందులు, ఆతి«థుల రాచమర్యాదల కోసం తమ కష్టాన్ని అడ్డుగోలుగా లక్షల రూపాయలను బొక్కేశారని రైతులు మండిపడుతున్నారు. ప్రశ్నించేవారే లేరన్న ధైర్యంతో అడ్డగోలుగా సాగించిన అక్రమ బాగోతాలపై రాష్ట్ర ప్రభుత్వం 51 ఎంక్వైరీ వేసిన సంగతి తెలిసిందే. విచారణాధికారిగా నియమితులైన దుర్గాప్రసాద్ విచారణ ప్రక్రియను ఒకటి, రెండు రోజుల్లో ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో డీసీసీబీలో అవినీతి బాగోతాలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. జిల్లా కేంద్రం కాకినాడ దేవాలయం వీధిలో కోట్ల రూపాయలు విలువైన స్థలాన్ని అడ్డగోలుగా అసోసియేషన్‌కు కట్టబెట్టేసిన వ్యవహారం ‘సాక్షి’ ఈ నెల 29వ తేదీన ‘ఇదేమి సహ‘కారం’ శీర్షికతో వెలుగులోకి తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. ఇంచుమించు ఇటువంటి వ్యవహారమే మరొకటి రాజమహేంద్రవరంలో వెలుగులోకి వచ్చింది.
నిబంధనలన్నీ తుంగలో...
రాజమహేంద్రవరం శ్యామలా సెంటర్ అంటే నగరంలోనే అత్యంత ప్రాముఖ్యత ఉన్న ప్రాంతం. సినిమా థియేటర్లు, హోటళ్లు, బ్యాంకులు తదితర వాణిజ్య, వ్యాపార కార్యకలాపాలకు కేంద్ర బిందువు. అటువంటి సెంటర్‌లో డీసీసీబీకి ఎప్పుడో తొలినాళ్లలో ఏర్పాటు చేసిన బ్రాంచి ఉంది. ఈ భవంతికి వందేళ్ల చరిత్ర ఉంది. ఈ పురాతన బ్రాంచి కార్యాలయాన్ని ఆనుకుని గత పుష్కరాల సమయంలో లెక్కాపత్రం లేకుండా అత్యంత విలాసవంతమైన భవంతిని నిర్మించారు. అసలు ఎక్కడైనా ఒక లక్ష రూపాయల భవనం నిర్మించాలంటే ముందుగా ప్రతిపాదనలు, అంచనాలు, టెండర్లు...బిల్లులు...ఇలా పెద్ద ప్రక్రియ ఉంటుంది. కోటి రూపాయలు విలువైన భవన నిర్మాణమైనా ఇదే విధానాన్ని పాటించాలి. కానీ డీసీసీబీలో మాత్రం వీటన్నింటినీ బుట్టదాఖలు చేసి అత్యంత విలాసవంతమైన భవంతిని నిర్మించేశారు. సుమారు రూ.కోటిన్నరతో ఈ విలాసవంతమైన భవనాన్ని పుష్కరాల సమయంలో వివిధ జిల్లాల నుంచి వచ్చే అ«ధికార పార్టీ ప్రతినిధుల విడిది కోసం అగమేఘాలపై నిర్మించేశారు. రెండు అత్యంత ఖరీదైన సూట్‌లు ఉన్నాయి.
ఒక సూట్ చైర్మన్‌కు, మరొకటి డీసీసీబీ సీఈఓకు. ఒక పెద్ద విలాసవంతమైన హాలు. పైన ఏడు గదులు నిర్మించారు. సహకార సంఘాల చట్టం లేదా, స్వయం ప్రతిపత్తి కలిగిన డీసీసీ బ్యాంక్ మనుగడ పూర్తిగా రైతుల కష్టంపైనే ఆధారపడి ఉంటుంది. అటువంటి బ్యాంకు సొమ్ములతో భవనాలు నిర్మించడం నిబంధనలకు విరుద్ధమంటున్నారు. పుష్కరాలు వస్తున్నాయనగా హడావుడిగా నిర్మించిన భవనం ఆ సమయంలో పలు జిల్లాల నుంచి వచ్చే టీడీపీ నేతల కోసం బాగా ఉపయోగపడింది. 2015లో గోదావరి పుష్కరాల్లో వినియోగంలోకి వచ్చిన ఈ భవంతికి ఇప్పటికీ డీసీసీబీలో బిల్లులు లేవని ఇటీవల రాష్ట్ర ప్రభుత్వానికి జిల్లా సహకార యంత్రాంగం ఇచ్చిన ప్రాథమిక నివేదికలో స్పష్టం చేడయం గమనార్హం. భవనం నిర్మాణం పూర్తి చేసి నాలుగేళ్లు గడిచినా ఇప్పటి వరకూ ఏ ఒక్క దానికీ బిల్లులు లేకపోవడాన్ని పరిశీలిస్తే రైతుల సొమ్ము ఏ స్థాయిలో దుబారా జరిగిందో ఇట్టే అర్థమవుతోంది. ప్రతిపాదనలు సిద్ధం చేసినతరువాత టెండర్లు పిలిచి...పద్ధతి ప్రకారం తక్కువకు కోట్‌చేసే కాంట్రాక్టర్‌కు పనులు అప్పగించి ఉంటే ఇప్పుడు ఈ పరిస్థితి ఉండేది కాదు.
త్రిమెన్ కమిటీ పేరుతో సొంత వారికే నిర్మాణ పనులు అప్పగించి లక్షలు పక్కదోవపట్టించారని ప్రభుత్వానికి అందిన ప్రాథమిక నివేదికలో ఉంది. పార్టీ తరఫున చైర్మన్‌గా ఎన్నికై ఐదేళ్లు కాలమే పదవిలో ఉంటారు. కానీ డీసీసీబీకి సీఈఓ పోస్టు శాశ్వతం. రైతులకు చెందిన వెయ్యి కోట్ల రూపాయల డిపాజిట్‌లు కలిగిన డీసీసీబీలో కీలకం సీఈఓ. ఈ విషయాన్ని కూడా పెడచెవిన పెట్టడం విమర్శలపాలవుతోంది. అధికార పార్టీ పెద్దలు పైన ఉన్నారనే ధైర్యంతో సీఈఓ, ఇతర అధికారులు నిబంధనలను గాలికొదిలేసి భవన నిర్మాణాన్ని అడ్డగోలుగా చేపట్టి లక్షలు మింగేశారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయాలపై నిగ్గుతేల్చాల్సిన గురుతర బాధ్యత విచారణ అధికారిపై ఉంది.
Comments
Please login to add a commentAdd a comment