రుణమాఫీ చేయలేక వైఎస్ జగన్పై దాడా?
హైదరాబాద్: రైతుల రుణాలు మాఫీ చేయలేక వైఎస్ జగన్మోహన రెడ్డి నివేదికలు పంపుతున్నారని దుష్ప్రచారం చేస్తున్నారని వైఎస్ఆర్ సిపి నేత పార్థసారధి మండిపడ్డారు. మంత్రి దేవినేని ఉమపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇచ్చిన మాటను అమలు చేయలేక ప్రతిపక్షంపై ఎదురుదాడి చేయడం తగదని హితవు పలికారు. దమ్ముంటే 10 రోజుల్లో ఏ ఏజెన్సీతోనైనా విచారణ చేయించుకోండన్నారు. వాస్తవాలు బయటపెట్టండని కూడా సవాల్ విసిరారు. వైఎస్ఆర్ సీపీపై చేసిన ఆరోపణలు నిరూపించలేకపోతే మీరు పదవి వదులు కోవడానికి సిద్ధమా? అని ఆయన ఉమను ప్రశ్నించారు.
రీ షెడ్యూల్‌కు, రుణమాఫీకి సంబంధం ఏంటని ఆయన అడిగారు. బీజేపీపై రుణమాఫీ కోసం ఎందుకు ఒత్తిడి చేయరు? అని ప్రశ్నించారు. ఆర్బిఐపై నెపం వేసి రుణమాఫీని వాయిదా వేయడం తగదన్నారు. తక్షణమే రైతులకు కొత్త రుణాలు ఇప్పించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల్లో అప్పులు కట్టొద్దు అన్నారు, మీ వల్ల రైతులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.
వైఎస్ జగన్మోహన రెడ్డి దిష్టిబొమ్మల దహనానికి చంద్రదండు ఏర్పాటు చేయడాన్ని ఖండిస్తున్నామని చెప్పారు. రుణమాఫీ చేయమని వైఎస్ జగన్ అడగటమే తప్పా అని ప్రశ్నించారు. అబద్ధాలను కట్టిపెట్టి తక్షణమే రుణమాఫీ అమలు చేయాలని పార్థసారధి డిమాండ్ చేశారు.