టీడీపీలో భగ్గుమన్న విభేదాలు
Published Tue, Aug 6 2013 3:40 AM | Last Updated on Sun, Sep 2 2018 4:46 PM
పాతపట్నం,న్యూస్‌లైన్: నియోజకవర్గ కేంద్రమైన పాతపట్నం మండలంలో గత కొద్ది కాలంగా టీడీపీ శ్రేణుల మధ్య వర్గపోరు ఊపందుకొంది. దీనికి తోడు నియోజకవర్గ ఇన్‌చార్జి నియామకంలో ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు చేసిన తాత్సారం టీడీపీ అభిమానులకు నిరాశ కలిగించింది. పంచాయతీ ఎన్నికల కోసం పార్టీ మద్దతుదారులను ఎన్నుకోలేని పరిస్థితి చాలా చోట్ల ఏర్పడింది. దీంతో పంచాయతీలో విజయం కోసం హడావుడిగా కొవగాపు సుధాకర్ రావును నియోజక వర్గ ఇన్‌చార్జిగా నియమించారు. ఐతే సుధాకర్‌రావు సర్పంచ్ అభ్యర్థులుగా పోటీచేసిన టీడీపీ మద్దతుదారుల గెలుపునకు ఏ మాత్రం కృషి చేయలేదని పాతపట్నం మండల టీడీపీ అధ్యక్షుడు కొంచాడ వీరభద్రరావుతో పాటు పలువరు టీడీపీ సీనియర్ నాయకులు బాహాటంగానే విమర్శించారు.
దీంతో టీడీపీలో అసంతృప్తి గలం బహిర్గతమైంది. సుధాకర్ స్థానికుడని చెప్పుకొంటున్నప్పటికీ అతడి స్వగ్రామమైన అవలంగిలో కూడా టీడీపీ మద్దతుదారుని బరిలో నిలుపలేకపోయారని పార్టీ నాయకులు ఆరోపించారు. పరిశీలకులు తప్పుడు సంకేతాలిచ్చి పార్టీని నష్టపరిచే విధంగా కొవగాపు సుధాకర్‌కు ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించారని స్థానిక నేతలు పార్టీ అధినాయకుడికి ఫిర్యాదు చేసే యోచనలో ఉన్నారు. నియోజకవర్గంలో పార్టీ పూర్వ వైభవం పొందాలంటే ఎర్రన్నాయుడు సతీమణి విజయకుమారిని ఇన్‌చార్జిగా నియమించాలని కోరుతూ టీడీపీ నాయకులు సమాచారాన్ని పంపినట్టు తెలుస్తుంది.
ఒకప్పుడు కంచుకోటగా ఉన్న పాతపట్నం నియోజకవర్గం ప్రస్తుతం టీడీపీకి చేజారినట్టే చెప్పుకోవాలి. అక్కడ నెలకొన్న పరిస్థితులను చూస్తే ఇదే విషయం స్పష్టమవుతుంది. నియోజకవర్గ పరిస్థితులపై అధినేతకు ఫిర్యాదు చేయాలన్న తలంపుతో సోమవారం మేజర్ పంచాయతీ సర్పంచ్ పైల ప్రియాంక, శాసనపురి మధుబాబు, డి.ఉదయ్ భాస్కర్, పైల బాబ్జీ, కనకల నారాయణ, రుంకు చలపతి రావు, డి.పద్మావతి, బిడ్డిక చంద్రయ్య పత్రికా ప్రకటన విడుదల చేశారు.
Advertisement