
'రైతులకు పరిహారం.. వైఎస్ జగన్ విజయం'
హైదరాబాద్: రైతుల ఎక్స్ గ్రేషియాపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవో జారీ చేయడం వైఎస్సార్ సీపీ విజయమని ఆ పార్టీ నేత పార్థసారధి తెలిపారు. రైతుల ఎక్స్ గ్రేషియాపై తదితర ఆంశాలకు సంబంధించి శుక్రవారం మీడియాతో మాట్లాడిన పార్థసారధి.. ఇది తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విజయమని పేర్కొన్నారు. గతంలో రైతుల ఆత్మహత్యలను భూతద్దంలో చూపిస్తోందని వైఎస్సార్ సీపీని ప్రభుత్వం విమర్శించిందన్న సంగతిని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. చేనేత కార్మికుల, రైతుల ఆత్మహత్యలను అనంత జిల్లా కలెక్టరే ధృవీకరించారన్నారు. రైతులకు అండగా ఉండేందుకు వైఎస్ జగన్ భరోసా యాత్ర చేయబోతున్నారని తెలిసే ప్రభుత్వం ఈ జీవో జారీ చేసిందన్నారు.ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కుటుంబాలకు రూ. 3.5 లక్షల పరిహారంతో పాటు మరో రూ. 1.5 లక్షలను రుణంగా కూడా ఇవ్వనున్నట్లు ఏపీ ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే.
రైతులకు ఎక్స్ గ్రేషియా జారీ చేస్తున్నందుకు సంతోషంగా ఉందని పార్థసారధి అన్నారు. రైతులకు మేలు జరగడమే తమకు కావాల్సిందని ఆయన తెలిపారు. ఇదిలా ఉండగా పోలవరం ప్రాజెక్టుకు ప్రభుత్వం ఎగనామం పెట్టేలా వ్యవహరిస్తోందని ఆయన విమర్శించారు.పట్టిసీమ ప్రాజెక్టుపై ప్రభుత్వం ఎందుకంత హడావుడి చేస్తుందని ఆయన మండిపడ్డారు. నాలుగేళ్లలో పోలవరం పూర్తి చేస్తామని చెప్పి పట్టిసీమ అంశాన్ని తెరపైకి ఎందుకు తీసుకొచ్చారని ప్రశ్నించారు. పట్టిసీమ ప్రాజెక్టు నీటిని లిఫ్ట్ చేయడానికి కాదని.. నోట్లను లిఫ్ట్ చేయడానికని పార్థసారధి ఎద్దేవా చేశారు. . చంద్రబాబు పాలనపై రెఫరెండమ్ కావాలంటే 10 మంది మంత్రులు రాజీనామా చేసి పోటీకి సిద్ధంగా కావాలని సవాల్ విసిరారు.